nehiru
పాకిస్తాన్‌తో స్నేహం గురించి నెహ్రూ ఎంతో పరితపించి పోయినట్లు కనిపించారు. కాలవనీటి తగాదా విషయంలో పాకిస్తాన్‌ పట్ల భారతదేశం చూపిన ఔదార్యాన్ని ప్రస్తుతించారు. నెహ్రూ దృష్టిలో ఔదార్యాన్ని మించి గొప్ప బుద్ధిలేదు. కానీ, కాశ్మీర్‌ను ముందుపెట్టుకుని పాకిస్తాన్‌ భారతదేశంతో నిరంతరం కయ్యానికి కాలుదువ్వటం ఆయనకెంతో చిరాకు కలిగించింది. మధ్యయుగం మనస్తత్వాన్ని పాకిస్తాన్‌ విడనాడకపోతే దానికి భవిష్యత్తు లేదనేవారు. చైనా ఎడల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం గురించి గుర్తుచేసుకున్నారు. ఈ విషయమై అతిగా ప్రశ్నించిన వారినుద్దేశించి ‘భారతీయులకు విమర్శచేయడమంటే అతి సహజంగా వస్తుందనీ, ఎవర్నీ తమతమ పనులు చేయనీయమనీ, ఎప్పుడూ విమర్శచేయడమే మనపని’ అని మనలోని బలహీనతను బైటపెట్టారు.

నెహ్రూ రూపొందించిన అలీన విధానాన్ని ప్రారంభంలో ఇటు భారతదేశంలోనూ, అటు విదేశాలలోనూ అపార్థం చేసుకోవడం జరిగింది. అప్పుడీ విధానాన్ని తీవ్రంగా విమర్శించినవారే ఇప్పుడు దీని విలువను గుర్తిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలలో ఎక్కువ దేశాలు తమ విదేశీ విధానానికి అలీన విధానాన్నే పునాదిగా పెట్టుకున్నాయి. మన అలీన విధానానికి నెహ్రూ వివరణ చెబుతూ ఎక్కడ స్వాతంత్య్రానికి ముప్పువాటిల్లినా, అన్యాయం జరిగినా, ఎక్కడ దురాక్రమణ జరిగినా మనం తటస్థంగా ఉండలేమని అన్నారు.

ప్రపంచంలో సుస్థిర శాంతి స్థాపనకు వలసతత్వం నిర్మూలన సరైనమార్గమని నెహ్రూ విశ్వాసం. దానికోసం ఐక్యరాజ్యసమితినే పోరాట వేదికగా మార్చుకున్నారు. దీనితో వర్ధమానదేశాలకు ప్రపంచ ఆర్థిక సంస్థలనుంచి విరివిగా విరాళాలు లభించాయి. నిరాయుధీకరణ ఆవశ్యకత గురించి ప్రపంచానికి నచ్చచెప్పడంలో నెహ్రూ ఎంతో ఉదాత్తమైన పాత్ర నిర్వహించారు. కమ్యూనిస్టు, కమ్యూనిస్టేతర కూటముల మధ్య ఏర్పడిన ప్రమాదభరిత అగాధాన్ని తగ్గించి ఇరు వర్గాల మధ్య రాయబారాలు ఫలప్రదం కావడానికి నెహ్రూ ఎంతో శ్రమించారు. ఆసియా, ఆఫ్రికా దేశాల పాశ్చాత్య రాజప్రసాదాల వద్ద మేకలలాగా మోకరిల్లి ‘దేహీ’ అని చేతులు చాపవలసిన దుష్కాలము అంతరించిపోయిన రోజులొచ్చాయని 1947 మార్చిలో జరిగిన ఒక సమావేశంలో నెహ్రూ పండితుడు ఉద్ఘోషించారు. అందుకనే ఆ మహనీయుడు అస్తమించినప్పుడు మిత్రరాజ్యల సమితిలోని ఆసియా, ఆఫ్రికా దేశాలవారు ఆయనను మా ప్రాంతమండలి ప్రపంచాన్ని పాలించే నైతిక ధర్మసూత్రాలను మలచిన మహాశిల్పి అని నివాళులర్పించారు.

ఆనాడు రాజకీయరంగంలో నెహ్రూ అధికారం అనిర్వచనీయం. తలచుకుంటే తదితర వర్దమాన దేశాల నాయకుల వలె ఏకవ్యక్తి పరిపాలనను సులువుగా సాగించకలిగి ఉండేవారు. అందుకు భిన్నంగా అపారమైన తనశక్తియుక్తుల న్నిటినీ ప్రజాస్వామ్య సంస్థల నిర్మాణానికే వినియోగించారు. అజ్ఞాన దారిద్య్ర జాతి ద్వేష విముక్తమైన నవ భారతంగా జాతి రూపొందాలనీ, ప్రపంచ రాజ్యా లలో తలయెత్తి తిరుగుతూ దృఢచిత్తులై, స్వేచ్ఛా ప్రియులైన ప్రజలు అన్ని అవరో ధాలనూ అధిగమించి తమ భాగ్య విధా తలు తామే కాగలరని మాన వాళికి నిరూపించాలని ఆయన ప్రగాఢవాంఛ.

భారత ప్రజల జీవన ప్రమాణాన్ని అభివృద్ధిపరచడమే పండిట్‌ నెహ్రూ ఏకైక లక్ష్యం. ఆ దృష్టితో, శాస్త్ర కృషి ఫలితాలను అన్వయించడానికి, అభివృద్ధి పరచడానికి అవకాశం గల శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన సంస్థకు అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. అణుశక్తి శాఖను తనవద్దనే పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్‌ అభివృద్ధికి గల అవకాశాల పట్ల, బ్రాడ్‌కాస్టింగ్‌ ఇతర కమ్యూనికేషన్‌ వ్యవహారాలపట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. గ్రామీణ ప్రాంతాలలో రేడియో విస్తరణ వల్ల ప్రజల మనస్సులలో సాంకేతికంగా మార్పు వస్తుందని ఆయన విశ్వసించారు. స్కూళ్లకు వెళ్లి చదువుకోలేని లక్షలాది జనానికి రేడియో ద్వారా విద్య, విజ్ఞానాలు సమకూరుతాయని ఆయన విశ్వసించారు.

సోషలిజం పట్ల తనకున్న విశ్వాసాన్ని నెహ్రూ ఎన్నడూ దాచుకోలేదు. సమసమాజ నిర్మాణానికీ, దారిద్య్ర నిర్మూలనకు, సోషలిజం ఒక్కటే మార్గం అని చెప్పటానికి ఆయన ఎన్నడూ వెనుకాడలేదు. స్వాతంత్య్రమూ, ప్రజాస్వామికమూ అయిన రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడమే ఆయన ధ్యేయం. నాగరిక జీవితంలో కనీస జీవితావసరాలు తీర్చగల జీవన ప్రమాణాలు అందరికీ ఉండాలి. సంఘంలో సమానత్వం సిద్ధించాలి. తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి. ఇట్టి ఆర్థిక సమానత్వంమీద ఆధారపడి ఉన్నప్పుడే మనిషి మనిషికీి మధ్య హెచ్చు తగ్గులులేని సమాజం ఆవిర్భవిస్తుంది. ఇది మన ప్రణాళికలకు సరిఅయిన పునాదిగా నెహ్రూ అభిప్రాయపడేవారు.

చరిత్రలోని దీర్ఘకాలిక దృష్టితో చూస్తే, నెహ్రూ గొప్పతనం సువిశాల సంక్లిష్టమైన యీ ఉపఖండాన్ని మహాజాతిగా అతకడంలోనే ఉన్నదని ప్రముఖుల అభిప్రాయం.

భారతదేశపు జనాభా-ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలోని 55 జాతుల జనాభాల మొత్తం కంటేె అధికం. రష్యా మినహా మిగతా యూరపు ఖండపు జనాభాతో దాదాపు సమానం. తత్తుల్యమైన భాష మిత జాతి భేదాలు సమృద్ధిగా ఉన్నవి. అయితే నెహ్రూ సునిశిత రాజకీయ నేతృత్వంలో భారతదేశం విభజనకు దోహదమిచ్చే యీ ప్రభావాల నుండి క్రమంగా దూరమవుతూ వచ్చింది. ఆరు దశాబ్దాల స్వాతంత్య్ర పరిపాలన పిమ్మట ఈనాడు కూడా ప్రజలే ఎన్నుకున్న పార్లమెంటు ద్వారా ఒకే ప్రభుత్వాధినేత క్రింద ఒకే న్యాయ విచారణ పద్ధతి క్రింద నిలబడి ఉన్నది.

Other Updates