cm-sirisillaనేత కార్మికుల జీవితాలనుంచి దు:ఖం పోవాలని, వారి తలరాత మారాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. చేనేత మగ్గాలు, మర మగ్గాలలో పనిచేస్తున్న కార్మికులందరూ మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నుంచి నేత కార్మికులు బయటపడాలని, సంతోషకరమైన జీవితం గడపాలని చెప్పారు.

సిరిసిల్ల, పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే అపప్రథకు బదులుగా, తెలంగాణలో నేత కార్మికులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారనే మాట రావాలని సీఎం కోరారు. నేత కార్మికుల సంక్షేమం కోసం, నేత పరిశ్రమ అభివృద్ధికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇందుకోసం రాబోయే బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు. తెలంగాణలో చేనేత పరిశ్రమకు గతంలో ఎంతో గొప్ప పేరుండేదని సీఎం అన్నారు. అలాంటి నేత కార్మికుల బతుకులు వ్యధాభరితంగా, బాధామయంగా మారడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. పోచంపల్లి, నారాయణపేట్‌, గద్వాల ప్రాంతంలో నేసే పట్టు, ఇక్కత్‌ చీరలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. గతంలో పెళ్లి బట్టలకోసం కంచికిపోయేవారు ఇప్పుడు పోచంపల్లికి పోవడం మనకు గర్వకారణమని సీఎం అన్నారు. ఇలాంటి వాడుకను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

నేత కార్మికుల సంక్షేమంకోసం, నేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీ రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు వివేక్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, కో ఆపరేటివ్‌ బ్యాంకు ఛైర్మన్‌ రవీందర్‌రావు, సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్‌లూమ్‌ పరిశ్రమకు చెందిన దాదాపు 40మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

నేత పరిశ్రమకు చెందిన ప్రతినిధులు చెప్పిన అభిప్రాయా లను ముఖ్యమంత్రి సావధానంగా విన్నారు. నేత వృత్తిని ఆధారం చేసుకుని బతికే కార్మికులకు నెలకు 15-20వేల ఆదాయం సగటున రావడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకోసం పవర్‌లూమ్‌లు నడిపే యజమానులకు అవసర మైన చేయూత అందివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ప్రభుత్వం ఇంత ఉదారంగా ఎప్పుడూ ముందుకు రాలేదని, ప్రభుత్వ చేయూత అందితే తాము కార్మికులకు నెలకు 15వేలకు తక్కువ కాకుండా వేతనం బ్యాంకులో వేస్తామని యజమానులు ముఖ్యమంత్రి సమక్షంలో అంగీకరించారు. పండుగల సందర్భంగా పేదలకు పంచే బట్టలతోపాటు, ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని రకాల వస్త్రాలను రాష్ట్రంలోని నేత పరిశ్రమ ద్వారా వచ్చిన వాటినే కొనుగోలు చేస్తామని సీఎం చెప్పారు.

పద్మశాలీలకోసం త్రిముఖ వ్యూహం

నేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించే పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం అనుసరించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. చేనేత మగ్గాలపై పనిచేస్తున్న వారు, పవర్‌లూమ్‌ కార్ఖానాల్లో కూలీలుగా పనిచేస్తున్న వారు, నేత వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకున్న వారు మూడు విధాలుగా పద్మశాలీలున్నారన్నారు. వీరికోసం త్రిముఖ వ్యూహం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతీ కుటుంబం గౌరవంతో బతికే వేతనం పొందాలన్నది తమ ఉద్దేశ్యమని వెల్లడించారు.

రాష్ట్రంలో ఇంకా చేనేత మగ్గాలపై పనిచేస్తున్న వారున్నారు. సాధారణ వస్త్రాలు నేసేవారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని సీఎం నిర్ణయించారు. నూలు, రసాయనాలను సబ్సిడీపై అందిస్తామన్నారు. వారు తయారుచేసిన వస్త్రాలన్నింటినీ ప్రభుత్వం తరఫునే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వారికి మార్కెటింగ్‌ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. ప్రతీ చేనేత మగ్గాన్ని లెక్కిస్తారు. చేనేతపై ఆధారపడిన వారిని గుర్తిస్తారు.

చేనేతలో నారాయణపేట, గద్వాల, పోచంపల్లి ప్రాంతాల్లో కళాత్మక వస్త్రాలు తయారు చేసే వారున్నారు. ఆ వస్త్రాలకు అంతర్జాతీయ డిమాండ్‌ ఉంది. వారిని ప్రోత్సహించడానికి కూడా అవసరమైన విధానం రూపొందిస్తారు.

రాష్ట్రంలో పవర్‌లూమ్‌లు పెద్ద సంఖ్య లో ఉన్నాయి. వాటిలో ఎక్కువ సంఖ్యలో సిరిసిల్లలోనే ఉన్నాయి. పవర్‌లూమ్‌లను ఆధునీకరిస్తాం. రేపియల్‌ మగ్గాల స్థాయికి మన మరమగ్గాలు చేరుకోవాలి. అప్పుడు నాణ్యత, ఉత్పత్తి పరిణామం పెరుగుతుంది. ఇప్పుడున్న మరమగ్గాల ద్వారా ఒకరోజు 40 మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్‌ మగ్గాల ద్వారా 150 మీటర్లకు పైగా బట్ట ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల యజమానులకు లాభాలొ స్తాయి. దీని ఫలితం మరమగ్గాలలో పనిచేసే కార్మికులకు కూడా దక్కాలి. కార్మికులకు ప్రతీ నెలా 15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి. వేతనంతోపాటు కార్మికులకోసం త్రిఫ్ట్‌ స్కీమ్‌ (పొదుపు పథకం) అమలు చేయాలి. ఈ పథకంలో భాగంగా కార్మికుడు ఎంతైతే పొదుపు చేస్తాడో అదే నిష్పత్తిలో యజమానులు, ప్రభుత్వం కూడా కార్మికుడి పేరుమీద పొదుపు చేయాలి. అలా పొదుపైన డబ్బులు కార్మికుడి కుటుంబానికి ఉపయోగపడాలి. కార్మికుడి వేతనం బ్యాంకుల ద్వారానే అందాలి.

పవర్‌లూమ్‌ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యే దుస్తులు, హాస్టళ్ళు, హాస్పిటళ్ల దుప్పట్లు, ఇతర యూనిఫారాలు తదితర వస్త్రాలన్నీ తెలంగాణలో నేత కార్మికులు ఉత్పత్తి చేసినవే వాడతారు. దీనివల్ల చేనేత మగ్గాలు, మరమగ్గాలకు గిరాకీ ఉంటుంది. నూలు, రసాయనాలపై సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది.

పవర్‌లూమ్‌ల ఆధునీకరణ వల్ల పెద్ద సంఖ్యలో కొత్త పవర్‌లూములు కూడా వస్తాయని సీఎం చెప్పారు. అయితే అన్ని మగ్గాలు ఒకే రకం వస్త్రాలు తయారు చేయడం వల్ల పోటీ ఎక్కువై, మార్కెటింగ్‌ పెద్దగా ఉండదని సీఎం అన్నారు. కాబట్టి మగ్గాలను ఎంచుకునే క్రమంలో వైవిధ్యం ఉండాలని చెప్పారు. వేర్వేరు రకాల వస్త్రాలు, వేర్వేరు సైజులు, వేర్వేరు డిజైన్లు ఉండేలా వర్గీకరణ చేసుకోవాలని సూచించారు.

నేత వృత్తి కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపో వడంతో చాలామంది పద్మశాలీలు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకున్నారు. ఇంకా ఎవరైనా పద్మశాలీలు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకుంటే వారికి అవసర మైన ప్రోత్సాహం అందివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుతో మహర్దశ

నేత వృత్తిని నమ్ముకున్న వారు, అదే పని చేయగలిగిన వారు కుటుంబాలను పోషించుకోవడానికి సూరత్‌లాంటి ప్రాంతాలకు పోయి పనిచేస్తున్నారని సీఎం అన్నారు వరంగల్‌లో పెట్టే టెక్స్‌టైల్‌ పార్కువల్ల కార్మికుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందని సీఎం అన్నారు. షోలాపూర్‌లో చద్దర్లు, సూరత్‌లో చీరలు, తిర్పూ రులో ఇతర వస్తువుల తయారీ పెద్ద ఎత్తున జరుగుతుందని, ఈ మూడింటి సమాహారంగా వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం ఇటీవలే తమిళనాడులోని తిర్పూరు సందర్శించి వచ్చిందని, అదే పద్ధతిలో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు ఉంటుందని చెప్పారు. దేశంలోనే నంబర్‌ వన్‌ టెక్స్‌టైల్‌ పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు. సిరిసిల్లతోపాటు రాష్ట్రంలోని నేత కార్మికులకు, నేత పరిశ్రమకు వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుతో మహర్దశ పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ ప్రాసెసింగ్‌ జరగడంతోపాటు ఇతర అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయని, మార్కెటింగ్‌ సమస్య రాదని సీఎం చెప్పారు. సిరిసిల్ల పవర్‌లూమ్స్‌ను వరంగల్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు అనుసంధానం చేస్తామన్నారు.

సిరిసిల్లలో అపెరల్‌ పార్కు, గోదాములు

సిరిసిల్లలో అపెరల్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. నేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి రెడీమేడ్‌ దుస్తుల తయారీ రంగంలోకి దింపుతామన్నారు. అపెరల్‌ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం కోరారు. సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌ పార్కులో కొన్ని పరిశ్రమలు వివిధ కారణాలవల్ల మూతపడ్డాయని, వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. సిరిసిల్లకు త్వరలో రైల్వే లైనుకూడా వస్తున్నందున ఇక్కడ తయారైన వస్త్రాలను అటు వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు పంపవచ్చునని, దేశంలో ఎక్కడ డిమాండ్‌ ఉంటే అక్కడికి పంపవచ్చునని సీఎం చెప్పారు పవర్‌లూమ్‌ కార్మికులు తమ నూలును, వస్త్రాలను నిలువ చేసుకునేందుకు సిరిసిల్లలో నాలుగు గోదాములు నిర్మిస్తారు. దీనిలో స్టాక్‌ పెట్టుకునే యజమానులకు సహకార బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పిస్తారు. పవర్‌లూమ్‌లకు రుణ సౌకర్యం కల్పించేందుకు మొదటి ఏడాది రూ. 100 కోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకును సీఎం ఆదేశించారు.

దు:ఖపడ్డ సంఘటనలు గుర్తు చేసుకున్న కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి అనేకసార్లు దు:ఖపడ్డానని, రెండుసార్లయితే కళ్లవెంట నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ”కరీంనగర్‌ ఎంపీగా ఉండి, ఉద్యమంలో తిరుగుతున్న సమయంలో ఓ రోజు పేపర్లో సిరిసిల్లలో ఒకే రోజు 11మంది చేనేత కార్మికులు మృతి అనే వార్త వచ్చింది. ఆ వార్త చూసి నా మనసు చలించింది. ప్రశాంతంగా ఉండలేకపోయాను. దు:ఖపడ్డాను. తిండికి లేక కార్మికులు మరణించడం చాలా బాధనిపించింది. సిరిసిల్ల కార్మికులకు ఎంతో గొప్ప పేరుంది. వారిలా చావడమేంటని ఆలోచించాను. ప్రభుత్వంనుంచి సహాయం అందే పరిస్థితి లేదు. అప్పుడు నేను పూనుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రూ. 50 లక్షలను సిరిసిల్ల కార్మికులకోసం పంపాను. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరమున్న వారికిచ్చి ఆదుకున్నది. మరో సందర్భంలో పోచంపల్లిలో కూడా ఏడుగురు కార్మికులు మరణించారనే వార్త చూసిన. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల బాధలు చూసి ఏడ్చిన. నేనే స్వయంగా భిక్షాటన చేసిన. నాలుగు లక్షలు జమచేసి పోచంపల్లిలో మరణించిన నేత కార్మికుల కుటుంబాలకు అందజేసిన. అలాంటి బాధ తెలంగాణలో ఇక కొనసాగవద్దనేది నా ఆకాంక్ష. అందుకోసమే ఈ ప్రయత్నం” అని ముఖ్యమంత్రి అన్నారు.

సమావేశానికి హాజరైన పద్మశాలి సంఘం నాయకులు, నేత పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను స్వాగతించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పిలిచి సమావేశాలు పెట్టలేదని వారన్నారు. నూలుతో తయారుచేసిన దండను, వస్త్రాలను, చేనేత మగ్గాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేత పరిశ్రమ ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

చేనేతకు ప్రత్యేక విధానం

రాష్ట్రంలో నేత వృత్తిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఓ ప్రత్యేక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఈ వృత్తిని నమ్ముకుని జీవించేవారని, కానీ కాలక్రమంలో చేనేత వస్త్రాల వాడకం తగ్గడంతో వారి బతుకులు కూడా చితికిపోయాయని సీఎం అన్నారు. చాలామంది చేనేత వృత్తి వదులుకున్నారని, మరో పనిచేయలేక జీవితం చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది కార్మికులు పవర్‌లూమ్‌ కార్ఖానాల్లో దినసరి కూలీలుగా జీవితం వెళ్లదీస్తున్నారని చెప్పారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగు నింపేలా కార్యక్రమం రూపొందించాలని ఆదేశించారు.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ హ్యాండ్లూమ్‌, పవర్‌ లూమ్‌ కార్మికుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌, సలహాదారు హెచ్‌.కె. చారి, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీడీ రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

‘చేనేత కార్మికుల బతుకులు చాలా దీనంగా ఉన్నాయి. నమ్ముకున్న కుల వృత్తి కడుపునిండా అన్నం పెట్టడంలేదు. మరో పని చేయలేక కూలీలుగా మారుతున్నారు. అయినా జీవితం గడపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలి. వారు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్‌ కల్పించాలి. వారికి ప్రభుత్వం తరఫునే ఆర్డర్లు ఇయ్యాలి. స్కూలు పిల్లల యూనిఫారాలు, హాస్పిటళ్లు, హాస్టళ్లలో చద్దర్లు, పండుగలప్పుడు ప్రభుత్వం తరఫున పేదలకు పంచే దుస్తులు, పోలీస్‌ యూనిఫారాలు తదితర ఆర్డర్లన్నీ చేనేత కార్మికులకివ్వాలి. పవర్‌ లూమ్‌లకు కూడా కావాల్సినంత పనివ్వాలి. ముడి నూలును సబ్సిడీపై అందించాలి. ఇప్పటికే నేసి ఉన్న స్టాక్‌ను కొనుగోలు చేయాలి. చేనేత వృత్తిని వదులుకుని ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుందామనుకునే వారికి కూడా చేయూతనివ్వాలి. అందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమం సమగ్రంగా ఉండాలి. ప్రభుత్వం తమను బతికిస్తుందనే నమ్మకం వారిలో కలగాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘నారాయణపేట, గద్వాల, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో కళాత్మకమైన పట్టు వస్త్రాలు నేస్తారు. వాటికి అంతర్జాతీయ మార్కెట్‌ ఉంటది. వాటిని ప్రోత్సహించాలి. అవసరమైన చేయూతనివ్వాలి. ఆ కళ తెలంగాణకు ప్రత్యేకం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్‌లో సిద్దిపేట గొల్లభామ చీరలను ప్రత్యేకంగా అమ్మేవారు. అలాంటి ప్రత్యేకతలున్న వస్త్రాలకు పూర్వ వైభవం రావాలి. దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. నేత వృత్తిని నమ్ముకుని జీవించే వారికి భరోసా ఇవ్వడానికి, వారిని ఆదుకోవడానికి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పవర్‌లూమ్‌లకు కూడా కావాల్సినంత సాయం అందిస్తాం. అయితే ఆ సాయం అందులో కూలీలుగా పనిచేస్తున్న కార్మికులకు మేలు చేసేదిగా ఉండాలి. ఇందుకోసం విధానం రూపొందించుకోవాలి’ అని సీఎం చెప్పారు.

Other Updates