‘‘తెలంగాణ ఏక్‌గుల్ దస్తా హై ఉస్‌కో ఖాయం రఖ్‌నా హై’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. జామే నిజామియా ఇస్లామిక్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మౌలానా అన్వరుల్లాషా ఫారుఖీ 144వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాద్ పాతపట్టణంలోవున్న జామే నిజామియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ విద్యారంగంలో ఈజిప్టులోని కైరో యూనివర్సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండవస్థానంలో ఉండడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన మౌలానా అన్వరుల్లాషా పోస్టల్ కవర్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘నేను మీ బిడ్డను, నన్ను అడిగే హక్కు, డిమాండ్ చేసే అధికారం మీ అందరికీ ఉంది’ అని ముస్లిం సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఈ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడి జయంతి కార్యక్రమానికి రావడం, వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషంగా వుందన్నారు. ఈ విశ్వవిద్యాలయంనుండి పొందిన డిగ్రీలను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ లతో సమానంగా గుర్తించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృధ్ధి కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, అలాగే వక్ఫ్‌భూముల పరిరక్షణకు తాము కంకణబద్ధులమై ఉన్నామని పేర్కొన్నారు కేసీఆర్.
తెలంగాణ చరిత్ర అన్నా, నిజాం రాజు అన్నా అందరూ రజాకార్లే అనుకుంటారని, తానుమాత్రం నిజాం ప్రభువును మన ప్రాంతాన్ని పాలించిన రాజుగా భావిస్తానని అన్నారు. అందుకే తాను నిజాం సమాధిని సందర్శించడానికి వెళితే విమర్శించారని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో 9.60 కోట్లతో అత్యంత అధునాతన మూడంతస్తుల ఆడిటోరియం నిర్మిస్తున్నామని, ఇది పూర్తి కాగానే తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కైరో యూనివర్సిటీనుంచి సయ్యద్ మాజిద్, మజ్లిస్‌నేత అక్బరుద్దీన్ ఓవైసీ, పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీమ్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు, యూనివర్సిటీ ఛైర్మన్ మౌలానా అక్బర్ నిజాముద్దీన్, వైస్ ఛాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్, పోస్ట్ మాస్టర్ జనరల్ వీఎస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.