magaగాంధీ దవాఖానాకు గవర్నర్‌ ప్రశంస

వైద్యం కోసం గాంధీకే రండి!! గాంధీ మనందరి దవాఖానా. నేను కూడా ఇక్కడే చికిత్స తీసుకున్నాను. తీసుకుంటాను కూడా. తెలంగాణ వచ్చిన మొదట్లో గాంధీ అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది… అన్ని సదుపాయాలూ అందుబాటులోకి వచ్చాయి.. నేను నమ్మకంగా హామీ ఇస్తున్నాను. వచ్చే ఒకటి రెండేళ్ళల్లో తెలంగాణలో వైద్య ముఖచిత్రం సమూలంగా మారుతుంది.

వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న మార్పులు ‘ఆరోగ్య తెలంగాణ’ సాధన లక్ష్యంగా ఉన్నాయని, అది మరో ఒకటి రెండేళ్ళల్లోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌. అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానా ఎమర్జెన్సీ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన 65 పడకల అత్యాధునిక ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, పౌర సమాజ సమాచార యంత్రం, డిజిటల్‌ రేడియోగ్రఫీ, సిటి స్కాన్‌, సెంట్రల్‌ డయాగ్నసిస్‌ ల్యాబరేటరీని గవర్నర్‌ ప్రారంభించారు. ఒక్కో పరికరం, దాని వినియోగం, దాని విలువ వంటి అనేక అంశాలను గవర్నర్‌ వైద్యులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”వైద్యం కోసం గాంధీకే రండి!! గాంధీ మనందరి దవాఖానా. నేను కూడా ఇక్కడే చికిత్స తీసుకు న్నాను. తీసుకుంటాను కూడా. తెలంగాణ వచ్చిన మొదట్లో గాంధీ అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది…అన్ని సదుపాయాలూ అందుబాటులోకి వచ్చాయి” అని అన్నారు.

ఐసియూలో అధునాతన సాంకేతిక హై ఎండ్‌ మెషనరీ పెట్టారు. సమస్య లుంటాయి. వాటిని పరిష్కరించాలి. విమర్శించడం కాదు… భాగస్వాములు కావాలి అని హితవు పలికారు. వైద్యుల మీద బాధ్యత పెరిగింది…నెల నెలా సమీక్షలు నిర్వహించాలి. రోగులు, వైద్యులు, ప్రభుత్వానికి సహకరించాలి. సెన్సేషన్‌ కాదు, మీడియా వైద్యాన్ని సున్నితంగా చూడాలి. చిన్న చిన్న సమస్యలు సహజం..వాటిని పెద్దవిగా చూపొద్దు. అంటూ మీడియాకి సహితం సూచించారు. చాలా ఎక్కువగా జనాభా ఉన్న రాష్ట్రం. ఆరోగ్య సమస్యలతో దవాఖానాల సామర్థ్యానికి మించి రోగులు వస్తున్నారు. ప్రజలందరికీ మంచి వైద్యం అందేలా ప్రయత్నించాలి. రోగులు కూడా వైద్యులకి సహకరించాలి. బాధ్యతగా వ్యవహరించాలి. అని చెప్పారు.

”నేను నమ్మకంగా హామీ ఇస్తున్నాను. వచ్చే ఒకటి రెండేళ్ళల్లో తెలంగాణలో వైద్య ముఖచిత్రం సమూలంగా మారుతుంది. మంచి అద్భుత వైద్యం అందుతుంది. తెలంగాణ వచ్చి 38 నెలలు అవుతున్నది. మొదటి ఏడాది అన్నీ సర్దుకోవడానికే సరిపోయింది. రెండో ఏడాది నుంచి పని ప్రారంభమైంది. మూడో ఏడాదికల్లా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్యశాలల విషయంలోనూ ఉంది. ఎందుకంటే వైద్యం అత్యంత అవశ్యమైన అవసరం. దీన్ని తీర్చాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. ఆ పని ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నది. ఇందులో వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి నేతృత్వంలో వైద్యశాఖ అద్భుతంగా పనిచేస్తున్నది. మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నది. అందుకు మంత్రిని, సిబ్బందిని అభినందిస్తున్నాను” అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.

”ఏడాది క్రితం నేను గాంధీ దవాఖానాకు వచ్చాను. ఇలా వచ్చి అలా వెళ్ళాను. ఎవరినీ కలవలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. గవర్నర్‌ గాంధీ దవాఖానాకు వచ్చి వెళ్ళారని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ అసెంబ్లీలో చెప్పారు. తర్వాత గాంధీ దవాఖానాలో ఎంతో మార్పులు చోటు చేసుకున్నాయి. మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. 65 పడకల ఐసియూ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను ప్రారంభించుకున్నాం. మంచాలు, పరుపులు, చద్దర్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్‌లు, ఆయాలు ఇలా అనేక మార్పులు వచ్చాయి. . ఇవన్నీ మంచి సదుపాయాలని కల్పిస్తున్నాయి. ఇక ప్రభుత్వం చేయాల్సినంతా చేసింది. ఇంకా చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ఇక బాధ్యత వైద్యులు, సిబ్బంది, ప్రజల మీద ఉంది. గాంధీని సొంత దవాఖానాలా చూసుకుంటూ, ప్రజలందరికీ మంచి వైద్యం అందించేలా కృషి జరగాల్సి ఉంది” అని గవర్నర్‌ చెప్పారు.

‘ప్రభుత్వ దవాఖానాలు కేవలం పేదల కోసమే కాదు. అందరి కోసం. నేను కూడా ఇక్కడే గాంధీ దవాఖానాలోనే చికిత్స చేయించుకున్నాను. సర్జికల్‌ ఇంటర్వెన్షన్‌ కోసం ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు హాయిగా ఉన్నాను. అదీ నమ్మకం అంటే…. ప్రభుత్వ వైద్యశాలల మీద నమ్మకం పెంచుకోవాలి. నాకైతే గాంధీ వైద్యశాల మీద నమ్మకం ఉంది. ఇక ప్రభుత్వ దవాఖానాల్లో పిపిపి (పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌) మాడల్‌ కాదు… జిపిపి (గవర్నమెంట్‌, పబ్లిక్‌ పార్టిసిపేషన్‌) రావాలి” అని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. నగర మేయర్‌కి కూడా ఒక సూచన చేస్తున్నాను. గాంధీ దవాఖానా పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలి. మిగతా అన్ని దవాఖానాల చుట్టూ కూడా మంచి వాతావరణం ఉండే విధంగా చూడాలి’ అంటూ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కి చెప్పారు.

మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ఓపీ, ఐపీ పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. గవర్నర్‌ సూచనలు, సీఎం కేసీిఆర్‌ ఆశీస్సులతో, అందరి సహకారంతో గాంధీ దవాఖానాను తీర్చిదిద్దామని, మంచి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఎంతో చేశాం. రాష్ట్రమంతా ఇలాగే చేస్తాం. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్‌ పర్యాద కృష్టమూర్తి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీ, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి వేణుగోపాల్‌, చీఫ్‌ ఇంజనీర్‌ లక్ష్మణ్‌రెడ్డి, డిఎంఇ రమేశ్‌రెడ్డి, గాంధీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంజుల, సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates