మా వేములవాడ కథలు
రాజరాజేశ్వరుని ఊరు. ఊరినిండా రాజేశ్వర్ రాజన్న, రాజేందర్‌లాంటి పేర్లు ఎక్కువగా ఉండేది. భక్తులు చాలా మంది వచ్చేవాళ్ళు. వాళ్ళని వినోద పరచడానికి మా ఊళ్ళో రెండు సినిమా టాకీసులు వుండేవి. అవి గోకుల్ టాకీస్, ప్రకాశ్ టాకీస్. చుట్టూ తడకలు, గుంజలు, పైన రేకులు. అవీ మా సినిమా టాకీసుల పరిస్థితి. ప్రొజెక్టర్ వున్న స్థలం మాత్రం ఓ రూంలా వుండేది. ఇవి రెండూ జాతర గ్రౌండ్‌లో వుండేవి.
మా సినిమా టాకీసుల్లో మూడు తరగతులు వుండేవి. అవి నేల టికెట్, బేంచి టికెట్, కుర్చీ టికట్. స్క్రీన్‌కి దగ్గరలో నేల టికెట్ వుండేది. దాని తర్వాత బేంచి టికెట్, ఆ తరువాత కుర్చీ టికెట్. ఈ మూడు తరగతుల తరువాత ఓ చిన్న పిట్ట గోడ, ఆ తరువాత ఎత్తైన స్థలం. అందులో కూడ తరగతులు వుండేవి. అవి స్త్రీలకు కేటాయించిన తరగతులు. మగవాళ్ళ ద్వారాలు ఎడమ వైపున, ఆడవాళ్ళ ద్వారం కుడివైపున వుండేవి. టికెట్ కౌంటర్లు కూడా వేరుగా వుండేవి.
మా రాజేశ్వర స్వామి గుడి ముందు చంద్రభాగ గాజుల దుకాణం, దాని ప్రక్కన ఓ స్టీల్ దుకాణం వుండేది. పై అంతస్తుల్లో వాళ్ళు నివాసం వుండేవాళ్లు. ఆ అంతస్తు ముందు భాగంలో పెద్ద తడకలు రెండు వుండేవి. వాటి వీద సినిమా పోస్టర్లు అతికించేవారు. అప్పుడు నడుస్తున్న సినిమాలతోబాటు రాబోయే సినిమా పోస్టర్లని కూడా అతికించేవారు.
మా బాల్యం ఈ సినిమాలతో ముడిపడి వుంది. మేం చిన్నపిల్లలుగా వున్నప్పుడు జానపద సినిమాలు చూడటానికి ఎక్కువ ఇష్టపడే వాళ్ళం. ఎన్టీఆర్, కాంతరావు సినిమాలు వస్తే వాటిని చూడకుండా వదిలిపెట్టేవాళ్ళం కాదు. మా అభిమాన దర్శకుడు విఠలాచార్య.
అప్పుడు నేలటికెట్ ముప్పై పైసలు. బేంచి టికెట్ ధర అరవై పైసలు. కుర్చీ టికెట్ ధర తొంభై పైసలు. మేం నేల టికెట్‌లోనే సినిమాలు చూసేవాళ్ళం. కొత్త సినిమా విడుదల అయితే డప్పులు మ్రోగిస్తూ సినిమా గురించి ప్రచారం చేసేవారు. ఓ చిన్న మైకు కూడా అప్పుడప్పుడు ఉపయోగించేవారు. ప్రతిరోజూ సైకిల్ మీద ఓ వ్యక్తి ఊరంతా తిరుగుతూ ప్రచారం చేసేవాడు. సైకిల్ వెనుక వైపున రెండు వైపులా రెండు తడకల మీద సినిమా పోస్టర్లు వుండేవి. వెనక చక్రం దగ్గర ఓ వింత ధ్వని వచ్చే విధంగా ఓ రేకులాంటి వస్తువుని పెట్టేవాళ్లు. ఆ వింత ధ్వని వినగానే మేం పిల్లలం బయటకు వచ్చి ఆ సినిమా పోస్టర్ వైపు చూసేవాళ్ళం.
మా ఇల్లు చాలా పెద్దది. మా ఇంట్లో వున్న ఐదు కుటుంబాలు కిరాయకు వుండేవాళ్ళు. ఏదో మామూలు కిరాయి. ఆ ఇల్లు మరమ్మతులకి ఉపయోగపడే విధంగా ఆ కిరాయి వుండేది. ఒక ఇంట్లో మా మిత్రుడు రాజేందర్ మరో ఇంట్లో బాపురెడ్డి, మరో ఇంట్లో రఫీక్ వాళ్ళు వుండే వాళ్ళు. రాజేందర్ తమ్ముడు కవి, మా అన్నయ్య కొడుకు శివప్రసాద్, మా ఇంటి దగ్గర్లో వున్న మిత్రుడు రవీందర్, శ్రీను మా హెడ్మాస్టర్ కొడుకు యుగంధర్ ఇంకా కొంత మందిమి కలిసి సాయంత్రాలు ఆటలు ఆడుకునేవాళ్లం. మేమందరం ఆడుకుంటున్న సమయంలో సినిమా సైకిల్ శబ్దం విన్పించింది. అందరమూ ఇంటి బయటకు వచ్చి చూశాం. అది ఆఖరి రోజు. కాంతారావు సినిమా. అందరమూ మా ఆటలు బంద్ చేసి ఎవరి ఇంట్లోకి వాళ్ళం పరుగెత్తుకెళ్ళాం. అందరమూ కలసి ఆ రోజు సినిమా చూడాలని మా ఉద్దేశ్యం.
అరగంటలో అందరమూ వచ్చేశాం. అందరి ముఖాల్లో ఏదో విజయం సాధించినంత ఆనందం. ఒక్క బాపురెడ్డి మాత్రమే కొంచెం బాధగా, కోపంగా కన్పించాడు.
‘ఎందుకు వున్నావని’ అందరమూ ఒకేసారి అడిగాము.
‘మా బాపు ఊళ్ళో లేడు. మా అమ్మతో ఎంత లొల్లి చేసినా కూడా ఆమె పైసలు లేవని అన్నది. ఉపయోగం లేకుండా పోయింది. నేను రాను. మీరు వెళ్ళండి” అన్నాడు బాపురెడ్డి.
వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్. అప్పుడు ఊళ్ళో లేడు. మాకు ఏం చేయాలో తోచలేదు. మా ఉత్సాహం నీరు కారిపోయింది. నా దగ్గరా, మా అన్నయ్య కొడుకు శివప్రసాద్ దగ్గర నలభై పైసలు వున్నాయి. సినిమా టికెట్ ముప్పై అయిదు పైసలు. ఇంటర్వెల్‌లో ఏమైనా కొనుక్కొవడానికి మిగతా ఐదు పైసలు.
ఆ విషయమే మా మిత్రులతో చెప్పాను. అదృష్టవశాత్తు అందరి దగ్గరా నలభై పైసలు వున్నాయి. మేం ఏడుగురం, బాపురెడ్డితో కలిపి ఎనిమిది మంది.
‘ఇంటర్వెల్‌లో ఏమీ కొనుక్కోకపోతే సరిపోతుంది” అన్నాడు రవీందర్. నా
ఉద్దేశ్యాన్ని రవీందర్ బయటకు చెప్పాడు. అందరూ ఎగిరి గంతేశారు. మా ఉత్సాహం మళ్ళీ తిరిగి వచ్చింది.
బాధలో వున్న బాపురెడ్డి ముఖంలో కూడా ఆనందం కన్పించింది. అందరమూ కలిసి మొదటి ఆట సినిమాకు వెళ్ళాం. కాంతారావు కష్టాల్లో వున్నప్పుడు ఏడ్చాం. శాపవిముక్తి పొందినప్పుడు ఎగిరి గంతులు వేశాం. గుర్రం మీద స్వారీ చేస్తున్నప్పుడు మేమూ స్వారి చేసినంతగా ఆనందపడ్డాం. శుభం పడేదాకా సినిమాలో పరకాయ ప్రవేశం చేసి ఆ తరువాత వాస్తవలోకం లోకి వచ్చాం.
ఇది ఎప్పటి మాట. ఎప్పుడో మేం ఏడెనిమిది సంవత్సరాలు వున్నప్పుడు జరిగిన సంఘటన. ఆ తరువాత చాలా సినిమాలు చూశాం. ఈ సంఘటన మా స్మృతి పథంలో నుంచి తొలగిపోయింది.
కాలం పరుగెత్తింది. ఎవరి జీవన ప్రయాణంలో వాళ్ళం పరుగెత్తాం. చదువులు, పెళ్ళిల్లు ఉద్యోగాల వేట, ఉద్యోగాలు. అలా గడిచిపోయింది. చూస్తుండగానే ఓ ఇరువై సంవత్సరాలు గడిచాయి.
బాపురెడ్డి జగిత్యాలలో, రవీందర్ కరీంనగర్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అప్పుడు నేను న్యాయవాదిగా సిరిసిల్లా, కరీంనగర్లలో ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఓ రోజు కోర్టులో పని వుండి కరీంనగర్ వచ్చాను. కేసు మరుసటి రోజుకి వాయిదా పడింది. అందుకని కరీంనగర్‌లో వుండిపోవాల్సి వచ్చింది. శ్రీనివాసా థియేటర్లో సినిమా చూద్దామని నేనూ రవీందర్ వచ్చాం.
రవీందర్ క్యూలో నిల్చొని రెండు బాల్కనీ టికెట్లు తీసుకున్నాడు. సినిమాకి ఇంకా టైం వుందని అక్కడే నిల్చొని జనాలని చూస్తూ నిల్చునాం.
ఇంతలో ఓ వ్యక్తి క్యూ నుంచి బయటకు వస్తూ కన్పించాడు. కాస్త పరిశీలనగా చూశాం. అతను మా చిన్ననాటి స్నేహితుడు బాపురెడ్డి. అతను మమ్మల్ని చూడలేదు.
అప్పటికే టికెట్ కౌంటర్ మూసేశారు. బాపురెడ్డి ఎవరితోనో మాట్లాడుతూ కన్పించాడు. ఆ వ్యక్తి ఎవరో మామూలు వ్యక్తిలా కన్పించాడు. తన చేతిలో వున్న రెండు టికెట్ల నుంచి అతనికి ఒక టికెట్ ఇచ్చాడు. డబ్బులు తీసుకున్నట్టుగా కన్పించలేదు. కాని మాలో ఏదో ఆసక్తి కలిగింది.
రవీందర్ వెళ్ళి బాపురెడ్డిని పిలిచాడు.
రవీందర్‌ని చూసి బాపురెడ్డి పరుగు పరుగున వచ్చి కౌగిలించుకున్నాడు. రవీందర్ నన్ను చూపించాడు. రవీందర్‌ని వదిలి బాపురెడ్డి వచ్చి నా చేయిని పట్టుకున్నాడు.
చిన్ననాటి మిత్రులం – ముగ్గురం.
ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఆనందంతో అందరి కళ్ళూ వర్షించాయి.
”సినిమా టికెట్ ఎవరికో ఇచ్చావు. ఎవరైనా రావల్సిన వాళ్ళు రాలేదా?” అడిగాను.
బాపురెడ్డి నవ్వాడు. జవాబు చెప్పలేదు.
”జవాబు చెప్పవేమిటి” రవీందర్ అడిగాడు.
”అదేం లేదు. నేను ఎప్పుడు సినిమాకు వచ్చినా ఒక టికెట్ ఎక్కువ కొంటాను. ఎవరో టికెట్ కొనుక్కోలేని వ్యక్తి కోసం చూసి అతనికి ఇస్తాను” అన్నాడు కొంచెం బరువెక్కిన గొంతుతో.
నాకేమీ అర్థం కాలేదు. రవీందర్ వైపు చూశాను.
”డబ్బులు ఎక్కువయినవా?” ప్రశ్నించాడు.
”మీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడు ఒక రోజు నా దగ్గర సినిమాకు డబ్బులు లేకుంటే మీ అందరి దగ్గర వున్న అయిదు అయిదు పైసలు కలిపి నన్ను కాంతారావు సినిమాకు తీసుకొని వెళ్ళారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. నాలాంటి వాడు ఎవడన్నా ఇక్కడ వుంటాడేమోనని ఒక టికెట్ ఎప్పుడూ ఎక్కువ కొంటాను. అలాంటి వాడు కన్పిస్తే అతనికి, లేకపోతే ఎవరికో ఒకరికి ఇస్తాను. సినిమాకు వచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తాను” అన్నాడు కొంచెం బాధా – సంతోషం కూడిన గొంతుతో.
ఏం మాట్లాడాలో మా ఇద్దరికీ తోచలేదు.
ఆనాటి దృశ్యం మా కళ్ళముందు మెదిలింది.బాల్యం పడవై ప్రవహించింది.
బాపురెడ్డి చేయిని అలాగే ప్రేమపూర్వకంగా నొక్కి పట్టుకున్నాను.
ముగ్గురి కళ్ళల్లో ఓ చిన్న కన్నీటి తెర. అది ఆనందమో, బాధో అర్థం కాలేదు.
షనాకు బాపురెడ్డి మ¬న్నతంగా కన్పించాడు.
కాలం పరుగెత్తింది. ఎవరి జీవన ప్రయాణంలో వాళ్ళం పరుగెత్తాం. చదువులు, పెళ్ళిల్లు ఉద్యోగాల వేట, ఉద్యోగాలు. అలా గడిచిపోయింది. చూస్తుండగానే ఓ ఇరువై సంవత్సరాలు గడిచాయి. బాపురెడ్డి జగిత్యాలలో, రవీందర్ కరీంనగర్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అప్పుడు నేను న్యాయవాదిగా సిరిసిల్లా, కరీంనగర్లలో ప్రాక్టీస్ చేస్తున్నాను.