తెలంగాణ జనపదాల్లో పుట్టిందే
తెలంగాణ జానపద సాహిత్యం. జనపదం అంటే పల్లె. పల్లెటూళ్లో పుట్టిన సాహిత్యమన్నమాట. మరి ఆ పల్లెటూరి ప్రజలు మండలాలకు వెడితే, పట్టణాలకు వెడితే, నగరాలకు వెడితే, అక్కడ కూడా ఈ సాహిత్యమున్నట్టే కదా! అందుకే జానపద విజ్ఞాన శాస్త్రవేత్తలు పల్లె ప్రజలు ఎక్కడుంటే అక్కడ జానపద విజ్ఞాన మున్నట్టే అన్నారు.
ఇంకా కొంత ముందుకు వెళ్లి గుంపు మనస్తత్త్వంతో ఏది నిర్మాణమవుతుందో అదంతా జానపదమే అన్నారు. అందుకే జానపద విజ్ఞానమంతా సామూహిక సృష్టే అని తీర్మానించారు. జానపద విజ్ఞానంలో జానపదుల మౌఖిక సాహిత్యం, భౌతిక సంస్కృతి, జానపద సాంఘికాచారం, జానపద ప్రదర్శన కళలు, జానపద భాష, మొదలైనవి ఉంటాయని జానపద విజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ అంశాలన్నిటిమీద పరిశోధనలు జరిగాయి. ఆ కారణంగా ప్రపంచభాషలన్నింటిలో లక్షల పుటల జానపద వాజ్ఞయం ఆవిర్భవించింది.
అంతేగాక జానపద సంస్కృతి, జానపద ఉత్సవం, జానపద విశ్వాసం, జానపద క్రీడలు, మొదలైన వాటిపై వచ్చిన సమాచారం కూడా హిమాలయమంత మూల సంపదగా కనిపిస్తుంది. వీటన్నిటిపై తెలంగాణాలోనూ అధ్యయనం జరిగింది. విచిత్రమేమంటే తెలంగాణాలో వచ్చిన మొట్టమొదటి తెలుగు పరిశోధన గ్రంథం (ఉస్మానియా విశ్వవిద్యాలయం 1952లో) తెలుగు జానపద గేయ సాహిత్యం. ఆచార్య బి. రామరాజు అపూర్వ పరిశోధన ఇది. ఇందులో తెలంగాణ జనపదమేకాదు, తెలుగు వారి జానపద గేయా లెక్కడివైనా అవన్నీ స్పృశించారు. ఆ సంద ర్భంలో వారు సేకరించిన తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు ప్రత్యేకంగా సంపుటాల రూపంలో ప్రచురించారు.
ఆ తర్వాత ఎందరో తెలంగాణ జానపద గేయాల్ని, గేయ గాథల్ని, వచన కథల్ని, పొడుపు కథల్ని, సామెతల్ని, జాతీయాల్ని, ఆచారాల్ని, క్రీడల్ని.. వాటి విశేషాల్ని సంకలనం చేశారు. వాటిపై అధ్యయనం చేశారు. ఎంఫిల్ చేశారు; పీహెచ్‌డీలు చేశారు. వ్యాసాలు వ్రాశారు; సమీక్షలు చేశారు; అనేక గ్రంథాల్ని ప్రచురించారు. దాదాపు 300మంది రచయితలు ఏదోవిధంగా జానపద విజ్ఞానాన్ని లోకార్పణం చేసిన ఈ పవిత్ర కార్యక్రమంలో ఈ శతాబ్దింబావు (2001 నుంచి 2017 వరకు) కాలంలో పాల్గొన్నారు. ఇందుకు వారెన్నుకున్న కాలం-పరిధియేమైనాఉండవచ్చుగాక! తెలంగాణ జానపద సాహిత్యాన్ని విహంగ వీక్షణం ద్వారా ఇలా ఆలోచించవచ్చు.
తొలిదశలో జానపదం
జానపదానికి తొలిదశ అంటే తెలంగాణాలో తెలుగు మాటాడిన కాలం. క్రీ.పూ. ఆవిర్భవించిన గాథాసప్తశతిలో కనిపించిన అత్త, పిల్ల, పొట్ట వంటి తెలుగుపదాలనుబట్టి అప్పటికే తెలుగు ఇక్కడ మాటాడుతు న్నారని భాషా సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అంతేగాక గాథా సప్తశతిలోని అనేక గాథల్లో జానపదుల జీవనచిత్రణం కనిపించింది.
అయితే శాతవాహనుల కాలంలో తెలుగులో పాటగానీ, వచనం గానీ లభించలేదు. ఆ తర్వాత తెలంగాణలో వేసిన శాసనాల్లో వాక్యాలూ- పద్యాలు ఉన్నా అవి శాసన సాహిత్యంక్రిందనే పరిగణించారు.
ఇక పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, బసవ పురాణ గ్రంథాల్లో జనం పాడుకొనే పాటల (పదముల) ప్రసక్తి ఉంది. ఇవే జానపదగీతాలుగా ఆచార్య బి. రామరాజు ప్రభృతులు నిర్ణయించారు.
మదినుబ్బి సంసార మాయా స్తవంబు
పదములు తుమ్మెద పదముల్, ప్రభాత
పదములు పర్వత పదములానంద
పదములు శంకర పదములు నివాళి
పదములు వాపేశు పదములు గొబ్బి
పదములు వెన్నెల పదములు సంజ
వర్ణన మరి గణవర్ణన పదము
లర్ణవఘోష ఘార్ణిల్లుచునుండ
పాడుచునాడుచు పరమహర్షమున
కూడి సద్భక్త సంకుల మేగుదేర..
(పండితారాధ్య చరిత్ర)
పండితారాధ్య చరిత్రలోని ఈ పదాలన్నీ ఆనాటి జానపద గేయాలే. అయితే ఇవి ఎలా ఉండేవి అనే ప్రశ్న వేసుకొని పాల్కురికిపై పరిశోధన చేసిన డా|| వేనరెడ్డి ఆయా పదాల పేరుతోనే ఇవి ప్రచారంలో ఉన్నాయని కొన్ని ఆధారాలతో నిరూపించారు. తుమ్మెదా, పర్వతా, ఆనందా, శంకారా, నివాళీ, వాపేశా, గొబ్బియ్యలో, వెన్నెలా అనే ఆవృత పదాలతో పాడేవారన్నారు. దానికి శివశివయనమేలు తుమ్మెదా…” వంటి పాదాలనుదాహరించారు.
దేశీ ఛందస్సయినా తరువోజ, ద్విపద, సీసం, ఆటవెలది, గీతం, రగడ మొదలైనవన్నీ జానపదుల గీతాలద్వారానే నిర్మాణమయ్యాయని పరిశోధకుల అభిప్రాయం. అంటే ఆశువుగా, అలవోకగా పాడుకొన్న గేయాలకు ఛందశ్శాస్త్రవేత్తలు ఓ రూపమిచ్చారన్నమాట. అందుకే జానపద గీతాలకు ద్విపద మాతృక అనేమాట రూఢి పడింది.
పాల్కురికి తర్వాత జానపదుల కల్పనలెన్నింటినో తన రామాయణంలో కలుపుకొని, వాల్మీకిని అనుసరిస్తూనే గోన బుద్ధారెడ్డి శ్రీరంగనాథ రామాయణాన్ని రచించారు. ఈ ద్విపద
రామాయణమే తెలంగాణలో చాలా సంగ్రహంగా బతుకమ్మ రామాయణంగా అవతరించింది. ఈ ద్విపదే తెలంగాణాలో ఉయ్యాలపాటగా, వడ్లుదంపుడు పాటగా, జోలపాటగా, తందనాన పాటగా, విసుర్రాయి పాటగా జన జీవితంలోకి వెళ్ళిపోయింది. అంతేగాకుండా ఈ రామాయణం పుట్టిన ప్రాంతంనుండి అటు రాయలసీమ వైపుగా పయనించి తోలుబొమ్మలాటకు మూలాధారంగా నిలించింది. కోలాట ప్రదర్శనలకూ ఈ ద్విపదే మూలమైంది. మరో విధంగా చెప్పాలంటే అనేక బాణీల్లో జనపదాల్లో వినబడే అంశాలనే, బాణీలనే గ్రహించి గోన బుద్ధుడు రంగనాథ రామాయణాన్ని నిర్మించాడనాలి. అందుకు కారణం జానపదులు చేసిన ఈ క్రింది కల్పనలే అనాలి.
ఇంద్రుడు కోడై కూయడం, అహల్య రాయి కావడం, రాముడు బాల్యంలో మందరను గాయపరచడం, ఆ కారణంగానే మందర పగబట్టడం, అరణ్యకాండలో జంబుమాలి వృత్తాంతం, యుద్ధకాండలో సులోచన సహగమన వృత్తాంతం, కాలనేమికథ, అరణ్యకాండలో లక్ష్మణరేఖ, కిష్కింధలో తార ఎత్తి పొడుపు, ఉడతాభక్తి, రావణుని సభలో ఆంజనేయ స్వామి వాలం పెంచడం, ఇంద్రజిత్తు-కుంభకర్ణుల వధానంతరం రావణాసురుడు రాక్షసగురువు శుక్రాచార్యులవారితో సంప్రదింపులు కొనసాగించి ఆయన సలహాలు తీసుకోవడం, రావణుని నాభిస్థానంలో అమృతభాండం ఉందని విభీషణుడు శ్రీరామునికి చెప్పడం, యుద్ధకాండ చివర లక్ష్మణదేవర నవ్వు.. ఇలా లెక్కకుమిక్కిలి కల్పనలు తెలంగాణ జానపదులు చెప్పుకొన్నవే శ్రీరంగనాథ రామాయణకర్త గ్రహించాడు.
ఇలాంటి అంశాలెన్నో ఆ తర్వాతి జానపద ప్రక్రియలైన కొరవండి, ఎరుకత, కోలాటం, బతుకమ్మ, వీధి భాగవతం, ఒగ్గు కథ, తోలుబొమ్మలు, శారదకథలు, హరికథలు, పురాణ ప్రవచనం, చిందు భాగవతం, యక్షగానం మొదలైన వాటిల్లోకి ప్రవహించడం ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది. ఈ విధంగా తొలిదశ జానపదాన్ని వివేచించుకొన్న తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న జానపద గేయ సాహిత్యాన్ని, జానపద గేయకథా సాహిత్యాన్ని, జానపద వచన కథా సాహిత్యాన్ని, జానపద ప్రదర్శన కళల్ని (కళారూపాల్ని), జానపద సాహిత్యంలోని సామెతల్ని, జానపదంలోని పొడుపు కథల్ని పరిశీలించాల్సి ఉంది.
జానపద గేయ సాహిత్యం
కథారహిత గేయంగా, లఘుగేయంగా, జానపద గేయం ప్రచారంలో ఉంది. ఓ వర్ణన, ఓ దృశ్యం, ఓ సన్నివేశం, ఓ సంభాషణ ఈ గేయాల్లో కనిపిస్తుంది. ఆచార్య బి. రామరాజు, కాళోజీ బర్రెమీద కూచుని పాడుకొంటున్న ఓ అబ్బాయి గీతాన్ని విన్నారు.
నే తొక్కునూరేదిక్కడా!
నా తొక్కులాటంతక్కడా!
నే కాటుకెట్టేదిక్కడా
నే కన్నుగీటే దక్కడా!
(తెలంగాణ పల్లెపాటలు, పీఠిక)
పైకి చూడ్డానికి శృంగారం అనిపిస్తున్నా, ఇందులో తత్త్వంవైపు దృష్టిసారించే ఆలోచన కనిపిస్తుంది. మనిషి పరమగమ్యం మోక్షం వైపు అన్నదే పరమార్థంగా సృష్టించబడ్డ లఘు గేయమిది. ఇలాగే వేలకొలది లఘుగేయాలను సేకరించి ప్రచురించారు. నాలుగు పాదాలనుండి 40 పాదాలవరకున్న వేలాది గీతాలు తెలంగాణ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.
ఈ సాహిత్యాన్ని పిల్లల పాటలుగా, కుటుంబ గీతాలుగా, శ్రామిక గీతాలుగా, వ్యావసాయిక గేయాలుగా, సామాజిక గీతాలుగా, ఉత్సవ గీతాలుగా, సంస్కార గీతాలుగా ఎందరో పరిశీలించారు; విశ్లేషించారు. పరిశోధించారు. గేయ సాహిత్యంలో జానపద గేయ గాథలు లేదా కథా గేయాలు కూడా ఉన్నాయి. ఇందులో పురా కథా గేయాలు, చారిత్రక కథా గేయాలు, సాంఘిక కథా గేయాలున్నాయి. తెలంగాణలో మొత్తం రామాయణం పురా కథా గేయంగా లభించింది. అలాగే భాగవత పురాణాది గ్రంథాల కథలెన్నో లభించాయి. చారిత్రక కథాగేయాల్లో సదాశివరెడ్డి, సర్వాయి పాపడు, రాణీశంకరమ్మ, పండుగ సాయన్న, హనుమప్ప నాయకుడు, సోమనాద్రి, బల్మూరు కొండల్రాయుడు మొదలైనవన్నీ తెలంగాణ వీరులకు సంబంధించినవే.
ఓ నారమ్మ కథ, బండోల్ల కురుమన్న కథ, ఎద్దులోల్ల పుల్లారెడ్డి కథ, అనుముల బ్రహ్మారెడ్డి కథ ఇవన్నీ సాంఘిక కథల క్రిందికి వస్తాయి. ఈ విధంగా తెలంగాణలోని జానపద గేయ సాహిత్యం విస్తృతంగా లభిస్తుంది.
జానపద సాహిత్యంలో ప్రదర్శన కళలు
తెలంగాణలో కళా రూపాలెన్నో ఉన్నాయి. ఆటతోపాటు పాటా, మాటా ఉన్న కళారూపాలే ఇవన్ని. యక్షగానం, వీధి భాగవతం, చిందు భాగవతం, చిఱుతల రామాయణం, తందనాన రామాయణం, తోలుబొమ్మలాటలు, శారదకథలు, ఒగ్గు కథలు, జముకుల కథలు, హరికథలు, బుఱ్ఱకథలు, బొమ్మలాటలు, ఎఱుకల సోది, లత్కోరు సోది, ఏబూచిగాడు, బుడబుక్కల, జంగం దేవర, పిచ్చకుంట్లవారు, భజనకూటాలు, చెక్క భజన, తాళభజన, కాటి పాపడు, బతుకమ్మ, గోండు, ధింసా, కోయ, వీరభద్ర విన్యాసం, గొల్ల సుద్దులు, పాండవులవారు, చిన్న మాదిగలు, దొమ్మరాటలు, పండరి భజనలు, బోనాలు, పోతరాజులు, పాములవాళ్లు, సాధనాశూరులు, చిందులు, గంగిరెద్దులు, బంజారుల ఆటపాటలు, ఈ అన్నిట్లో సాహిత్యముంది. కొన్నిట్లో కొన్ని పదాలే ఉండవచ్చు; కేవలం ధ్వనులే ఉండవచ్చు; వాటి అర్థాలు వాటికుంటాయి.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇటువంటి జానపద కళారూపాల్లో కొన్ని ప్రత్యేకంగా వికసించి కొత్తపుంతలు తొక్కాయి. ఆటపాతదే అయినా, పాట కొత్తగా సింగారించుకొంది. దేశకాల పరిస్థితులనుసరించి ఇతివృత్తంలో మార్పు వచ్చింది. ఈ పాట సమష్టి భావంనుండే వచ్చిందయినా, పాటకు రచయిత ఉంటాడు. బాణీని అనుసరించి వ్రాసిందైనందువల్ల దీనిని అనువర్తిత జానపద సాహిత్యం అనాలని జానపద విజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
తెలంగాణలో అనువర్తిత జానపదం
భక్త రామదాసు, రాకమచర్ల వెంకటదాసు, మన్నెంకొండ హనుమద్దాసు, వేపూరు హనుమద్దాసు, బీబీపేట హనుమద్దాసు… ఇలాంటి వాళ్ళందరూ అనువర్తితాలు ప్రారంభించిన తొలిదశలోకి వస్తారు. ఆ తర్వాత జాతియోద్యమ సందర్భంలోనివారు, నైజాం వ్యతిరేక ఉద్యమంలోని వారు తదనంతర కాలానికి చెందినవారు, ప్రస్తుత ఉద్యమ కాలానికి చెందిన వారెందరో ఉన్నారు. యెల్దండ రఘుమన్న, చౌడూరి, కసిరెడ్డి, మందాడి, గోరెటి వెంకన్న, నాగరాజు, గద్దర్, అందెశ్రీ,రసమయిలాంటి వారిని పదుల మందిని చెప్పుకోవాలి. ఇక ఉయ్యాల పాటలు/బోనాల పాటలు/ ఉద్యమాలగీతాలు వ్రాసిన వారందరూ అనువర్తిత జానపద సాహిత్య స్రష్టల క్రిందికే వస్తారు.
జానపద వచన కథా సాహిత్యం
ఇక వచన కథల గురించి చెప్పుకోవాలి. తెలుగు జానపద సాహిత్యం-పురాగాథలు అనే తమ పరిశోధన గ్రంథంలో డా|| రావి ప్రేమలత ఎన్నో పురాగాథా కథల్ని ఉదాహరించి అపూర్వంగా విశ్లేషించారు. దానిలో తెలంగాణ కథలెన్నో ఉన్నాయి. ప్రధానంగా సామాజిక కథలెన్నో తమ పరిశోధనలో డా|| కె. సుమతి వివరించారు. ఇలా కథలమీద పరిశోధనలు కొన్ని జరిగాయి. అయితే సంకలనాలు ఒకటి రెండే వచ్చాయి. డా|| బుక్కా బాలస్వామివంటి వారు కొందరు ఆయా జిల్లాల జానపద కథల్ని సేకరించి పరిశోధించారు.
సామెతలు-పొడుపు కథలు
డా|| బి. దామోదరరావు సామెతలపై, ఆచార్య కసిరెడ్డి పొడుపుకథలపై పరిశోధన చేశారు. వీరి పరిశోధనల్లో అధికశాతం వస్తువు తెలంగాణాదే. ముఖ్యంగా ఆచార్య కసిరెడ్డి తెలుగు పొడుపు కథల్లో నూటికి 80శాతం పొడుపు కథలు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. ఇంకా సామెతలపై, పొడుపు కథలపై తెలంగాణ దృష్టితో అధ్యయనం చేయవలసి ఉంది.
ఆచార్య కసిరెడ్డి