మానవ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ముఖ్యమైనవే. దేని ప్రాధాన్యం దానిదే! ఈసారి ‘పలుకుబడి’లో భాగంగా నోటి గురించి తెలుసుకొందాం. అసలు పలుకుబళ్ళనైనా, పదబంధాలనైనా, పదాలనైనా, సామెతలనైనా పలుకాలంటే నోరు తప్పనిసరిగా ఉండాల్సిందే! ఈ నోటికి సంబంధించిన కొన్ని పలుకుబళ్ళు తెలంగాణేతర తెలుగుకన్నా తెలంగాణలో భిన్నంగా కన్పించడం ముఖ్యమైన విషయం. తెలుగులో ‘ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి’ అనే ఒక పదబంధం వుంది. దీని అర్థం ఎదుటివాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా సంభాషించాలి అని, లేక పోతే మనం మాట్లాడిన తప్పుడు మాటలువిన్న వాళ్ళు మనతో కయ్యానికొస్తారు, గొడవ జరుగుతుంది. అందుకే ‘ఒళ్ళు’ దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. ఈ పలుకుబడి తెలంగాణలో కొంత మార్పుతో ఉంది. అదేమిటంటే-‘నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుడు’ అని, మనం అవతలి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ‘నోరు’ దగ్గరగా పెట్టుకొవాలన్నమాట. అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి, నియంత్రించుకోవాలి. లేకుంటే పేచీలొస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ్డంకన్నా నోరు దగ్గర పెట్టుకొని, మాట్లాడ్డమే సమంజసంగా ఉంది. కారణం మాట్లాడేది నోరే కదా! ఆ నోటిలోవున్న నాలుకే కదా! అందుకే ‘నాలుకా నాలుకా వీపుకు తాకే’ అని తెలుగుసామెత. నోరు మంచిదవుతే ఊరూ మంచిదే!
తెలంగాణలో ‘నోట్లె బెల్లంగడ్డ పెట్టుకున్నట్లు ఏం మాట్లాడతలేవేందీ’ అంటారు. మనం ఎంతగా కదిపినా పలుకరించినా ఎదుటివ్యక్తి మౌనంగా వున్నాడనుకోండి-అలాంటప్పుడు ‘ఏంది నోట్లె బెల్లంగడ్డ పెట్టుకున్నవా?’ అని ప్రశ్నిస్తారు. నోటినిండా బెల్లంగడ్డ పెట్టుకున్నపుడు మాట్లాడడం కుదరదు. ఈ పదబంధానికి సమానార్థకంగా తెలుగులో ‘బెల్లంకొట్టిన రాయిలా అలా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నావేమిటి?’ అని వుంది. బెల్లంతో రాయిని కొడితే అది కదలకుండా మెదలకుండా ఉంటుందా? ఏమో… దీనికి అర్థం సరిగా చెప్పటం కష్టమే!
తల్లిదండ్రుల లక్షణాలూ, గుణగణాలూ, అందచందాలూ, రూపురేఖలూ అన్నీ, బిడ్డకు నూటికినూరుపాళ్లు అచ్చుకొట్టినట్లు వచ్చిన సందర్భాల్లో తెలంగాణలో ‘వీడు అయ్యవ్వల నోట్లెకెల్లి ఊశి పడ్డట్లు’ అచ్చం అట్లనే వున్నడు అంటున్నారు. నిజానికి బిడ్డ నోటి నుండి పుట్టడు. తల్లి తన మాతృగర్భంనుండి శిశువును ఎలా ప్రసవిస్తుందో తెలుసు మనకు. అయినా బిడ్డకు తల్లి పోలికలు అన్నీ వచ్చినప్పుడు నోట్లెకెల్లి ఊశిపడ్డట్లు వున్నడు అనేది తెలంగాణ మాట. మరి కొందరు ‘నోట్లెకెల్లి దుసి పడ్డట్లు వున్నడు అని కూడా అంటున్నారు.
ఇక… తెలుగులో ‘గొంతు చించుకొని అరవడం’ ఒక పలుకుబడి. దీన్ని తెలంగాణలో ‘నోరంత పోంగ ఒర్రుడు అని వ్యవహరిస్తున్నారు. గొంతు చించుకొని అరవడం అంటే బాగా గట్టిగా అరవడం-కేకలేయడం-మాట్లాడడం, గొంతులో స్వరపేటిక ఉంటుంది. ఆ పేటికలో ఉన్న పొరలూ, స్వరాలూ అన్నీ పగిలిపోయేలా, చిరిగి పేలికలయ్యేలా గొంతు బొంగురు పోయేలా ఆ గొంతును చించుకొని అరిచి గీ పెట్టడమే గొంతు చించుకోవడం. మరి ఈ పదబంధం తెలంగాణలో ఎలా వుంది? ‘నోరంత పోంగ ఒర్రుడు’ అనే రూపంలో ఉంది. గొంతుకు బదులు నోరు, చించుకోవడానికి పర్యాయం పోంగ. అరవడం తెలుగు ఒర్రుడు తెలంగాణలో. గట్టిగా మాట్లాడడం అంటే నోరు పోయేంత వరకు అని. బొంగురు పోవడమేకాదు ఏకంగా అరచీ అరచీ నోరే పోవడం అని అర్థం.
అమాయకుడూ, వెర్రి బాగులోడూ అయిన మనిషిని తెలంగాణలో ‘నోట్లె నాలుక లేనోడు’ అని అంటున్నారు. ‘నోట్లె తడి లేనోడు’ అని కూడా వ్యవహారంలో వుంది. దశవిధ రూపకాల్లో ఒకటైన నాటకంలోలాగా ఎవరైనా ‘స్వగతం’గా మాట్లాడుకుంటే తెలంగాణలో ‘వాడు నోట్లె నోట్లెనే మాట్లాడుకుంటున్నడు’ అంటున్నారు. అంటే ఎవరికీ వినబడకుండా తనలో తనే మాట్లాడుకోవడం అన్నమాట. ‘తలలో నాలుక’ అనే జాతీయాన్ని తెలంగాణలో ‘వాడు అందరికీ నోట్లె పండు’ అని పేర్కొంటారు. అంటే అందరికీ యిష్టమైనవ్యక్తి అని అర్థం. ‘తమలం వేయని నోరు-కమలం లేని కోనేరు’ అనే సామెత తెలంగాణలో ‘నోట్లె పాన్-ఇంట్ల ఫోన్’ అని వుంది. తెలుగు తమలం తెలంగాణలో హిందీ లేదా ఉర్దూ ‘పాన్’ అయ్యింది. ఇంట్ల ఫోన్ అనేది ఆధునిక సామెత అని చెబుతున్నది. తెలుగులో ‘పీకల్దాకా లాగించడం’ అని తిండికి సంబంధించిన పలుకుబడి, తెలంగాణలో ‘నోట్లెకు వచ్చేదాకా తినుడు’గా అయ్యింది. ఆహారవాహిక నోటినుండి ప్రారంభమై పాయువుతో ముగుస్తుంది. వాడెవడో కుక్షింభరి, తిండిపోతూ అయ్యుంటాడు, అందుకే వాడు పీకల్దాకా (గొంతుల్దాకా) లేదా నోట్లెకు వచ్చేదాకా తినేశాడు. గొంతుల్దాకా తినడం కన్నా నోట్లెకు వచ్చేదాకా తినడం మరింత ఎక్కువ, కొందరు ‘ఏలు ఏస్తే అందేదాకా’ తింటారు. మనం వేలు వేసి చూసుకుంటే గొంతులో తిండి తగుల్తుంది. ఇంకా కొందరు ‘ముక్కులదాకా’ తింటారు. తిండి అప్పుడు ఆహారనాళంతోపాటు వాయునాళంలోని ముఖ్య భాగమైన ముక్కుదాకా చేరిపోతుంది.
కంఠతాపాఠం, కంఠేపాఠం అనే పదబంధం తెలంగాణలో ‘నోటికి వచ్చుడు’. ‘పచ్చిగంగ ముట్టలేదు’కు సమానార్ధకం ‘నోట్లె మంచి నీళ్లు పొయ్యలేదు’. తెలంగాణలో ‘నోట్లె రాయి వడ’ ఒక తిట్టు. ‘నాలుకా తాటిమట్టా?’ అనేది తెలంగాణలో ‘నోరా మోరా?’ అనే రూపంలో వుంది. మిత భోజనం చేయాలి అంటే ‘నోరు కట్టాలె’, మూగజీవులు అంటే ‘నోరులేని జీవాలు’ వరుసగా సమానార్థకాలు. చిత్రంగా ఆవులింతలకు ఒక ప్రత్యేకపదం ఉంది. అది ‘వాయిలింపు లు’. ‘వాయి’ అంటే నోరు (తమిళంలో). నోట్లోంచి వచ్చింది. కనుక వాయిలింపు అయ్యింది. ఇవాళ్టి అన్నం రేపటికి పాడుకాకుండా వుండడానికి పాత్రలపైన మూతలకు బదులు గుడ్డలు కట్టేవారు. ఇదే వాయికట్టుడు అంటారు.
డా|| నలిమెల భాస్కర్