నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడి నాయకత్వంలో ఈ ఐదేండ్లలోసాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఐదేండ్లలో మనం సాధించింది ఎంత? ఇంకా సాధించుకోవలసినది ఎంత? మన ప్రజల సాగునీటి ఆకాంక్షలు ఎంత వరకు నెరవేరాయి? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణా ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయిన సాగునీటి రంగంపై దష్టి సారించింది. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని సోర్సుల ద్వారా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు, మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు తయారు చేసుకున్నది. కృష్ణా, గోదావరీ నదీ జలాల్లో తెలంగాణా వాటా సుమారు 1400 టిఎంసిల నీటిని పూర్తిగా వినియోగంలోకి తేవాలని సంకల్పించింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం నాలుగంచల వ్యూహాన్ని అనుసరించింది.
కోటి ఎకరాల మాగాణం దిశలో ప్రయాణం
1)తెలంగాణ గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు అనాది ఆధారాలుగా ఉన్న 46,500 చెరువులను దశల వారీగా పునరుద్ధరించడం.
2)గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వలన పూర్తి కాకుండా పెండింగ్ లో పడిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, వాటిలో కొన్నింటిని తెలంగాణా అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం.
3)గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం
4)గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురికాబడి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం.
పైన వివరించిన నాలుగంచెల వ్యూహం ఈ ఐదేండ్ల కాలంలో ఎట్లా అమలు అయినదో, వాటి ఫలితాలు ఎట్లున్నవో సమీక్షించుకుందాం.
మిషన్ కాకతీయ : చెరువుల పునరుద్ధరణ
చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మిషన్ కాకతీయ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం 20 శాతం చెరువులని రాజకీయాలకు అతీతంగా అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో, అన్ని మండలాల్లో మిషన్ కాకతీయ అమలు కావాలని ఇంజనీర్లకు ఆదేశాలిచ్చింది. స్థానిక ప్రజలను, ప్రజా పతినిధులను సంప్రదించి వారికి అవసరమైన చెరువులను పునరుద్ధరణకు ఎంపిక చేయడం జరిగింది. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసింది. జిల్లాకు ఒక సర్కిల్ (సూపరింటెండెంట్ ఇంజనీర్) కార్యాలయాన్ని, ప్రతీ రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక డివిజన్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయాన్ని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయాన్ని, ప్రతీ మండలానికి ఒక సెక్షన్ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కనుక మైనర్ ఇరిగేషన్‌కు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను నియమించింది. టెండర్ల ప్రక్రియను 90 రోజుల నుండి 15 రోజులకు కుదించడం జరిగింది. చెరువుల పునరుద్ధరణ ఎస్టిమేట్లకు పరిపాలనా అనుమతులను వేగంగా మంజూరు చెయ్యడం జరిగింది. చెరువుల ఎంపిక దగ్గర నుంచి అమలు దాకా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి పెట్టింది. పూడిక మట్టి పొలాల్లో చల్లుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై రైతాంగానికి అవగాహన కల్పించడం జరిగింది. వ్యవసాయ, రెవెన్యూ, అటవీ, మత్స్య, భూగర్భ జల శాఖల సేవలను ఈ కార్యక్రమంలో సమర్థవంతంగా వినియోగించుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఈ అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటిలను ఏర్పాటు చేసి ఆయా శాఖల పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సమన్వయ విధానాల కారణంగా మిషన్ కాకతీయ అమలు ప్రక్రియ వేగవంతం అయ్యింది. వేలాది మంది ప్రజలు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమం నిజమైన ప్రజా ఉద్యమంగా మారింది. రైతులు తమ స్వంత ఖర్చులతో పూడిక మట్టిని తరలించుకుపోయి తమ పొలాల్లో చల్లుకున్నారు. మెరుగైన దిగుబడి సాధించుకున్నారు. రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గింది. తెలంగాణా ప్రాంతంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇన్‌లాండ్ చేపల ఉత్పత్తి చేస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణా చోటు సంపాదించింది. నాలుగేండ్లలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలు సాధించిన సంగతిని నాబార్డ్ వారి అధ్యయనం తేటతెల్లం చేసింది. దేశవ్యాప్తంగా అందరి చేత ప్రశంసలు అందుకున్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్, దేశంలో వ్యవసాయ విప్లవానికి పితామహుడిగా పేరున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్, నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగారియా లాంటి ప్రముఖులు మిషన్ కాకతీయను కొనియాడారు. సెంట్రల్ బోర్డ్ అఫ్ ఇరిగేషన్, పవర్ (సిబిఐపి) వారు మిషన్ కాకతీయను ఉత్తమ పథకంగా ఎంపిక చేసి అవార్డును ప్రదానం చేశారు. మిషన్ కాకతీయ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఏ ఫలితాలను, ఏ మార్పులను ఆశించిందో అవి సాకారం అయినాయి.
మిషన్ కాకతీయ నాలుగు దశల పురోగతి :
మిషన్ కాకతీయలో మొదటి దశలో 7968 చెరువుల పునరుద్ధరణ పూర్తి కాగా వాటి కింద 6.83 లక్షల ఎకరాలు , రెండవ దశలో 7796 చెరువుల పునరుద్ధరణ పూర్తి కాగా వాటి కింద 5.01 లక్షల ఎకరాలు, మూడవ దశలో 3398 చెరువుల పునరుద్ధరణ పూర్తి కాగా వాటి కింద 1.59 లక్షల ఎకరాలు, నాలుగవ దశలో 1030 చెరువుల పునరుద్ధరణ పూర్తి కాగా వాటి కింద 37 వేల ఎకరాలు, నాలుగు దశల్లో కలిపి మొత్తం 20,192 చెరువుల కింద 13.80 లక్షల ఆయకట్టు స్థిరీకరణ పొందింది. చెరువుల్లో 8.04 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యం పునరుద్ధణ జరిగింది. 1.05 లక్షల ఎకరాలు చెరువుల కింద కొత్తగా సాగులోకి వచ్చాయి. 165 చిన్న నీటి ఎత్తిపోతల పథకాల కింద గడచిన నాలుగేండ్లలో కొత్తగా 1.23 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం, 27 వేల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించడం జరిగింది.
పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి:
తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ప్రాజెక్టుల పెండింగ్ సమస్యలను విశ్లేషించింది. ప్రాజెక్టులు నత్తనడక సాగడానికి ప్రధాన అవరోధమైన భూసేకరణ సమస్యని పరిష్కరించి ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ జి.ఒ. 123 తేదీ 30 జూలై 2015ని ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత 2013 భూసేకరణ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చర్యలు మంచి ఫలితాలని ఇచ్చాయి. దశాబ్ద కాలంగా అవరోధంగా ఉన్నభూసేకరణ సమస్య సమసిపోయింది. ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖ, రోడ్డు భవనాల శాఖల నుండి 11 ప్రాజెక్టుల క్రాసింగ్‌లకు క్లియరెన్స్ లు పొందడంతో క్రాసింగ్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నవి. కేంద్రం నుంచి రావలసిన అటవీ, పర్యావరణ, ఇతర అనుమతులని సాధించడం జరిగింది.
ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో మహారాష్ట్రతో పదేండ్లుగా అపరిష్కతంగా ఉన్న అంతర రాష్ట్ర వివాదాలను తెలంగాణా ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించింది. ముఖ్యమంత్రి కె సి ఆర్ స్వయంగా ముంబాయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో చర్చించారు. ఈ చర్చల అనంతరం ప్రాణహిత, గోదావరి, పెన్ గంగా నదులపై ప్రాజెక్టులని నిర్మించుకోవడానికి మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసారు. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరిని విడనాడి ఇచ్చి పుచ్చుకునే విధానం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నందు వలన ఈ ఒప్పందం దేశానికి ఆదర్శంగా మారింది. ఈ ఒప్పందం ఫలితంగా ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద, గోదావరిపై మేడిగడ్డ వద్ద, పెన్ గంగా నదిపై చనాక కోరాట వద్ద బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ బ్యారేజీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరంలో మేడిగడ్డ, చనాక కోరాట బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తి పోయడానికి పనులు ప్రణాళికా బద్దంగా జరుగుతున్నాయి.
ఈ ఐదేండ్లలో కల్వకుర్తి, డా. బి ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత, కాళేశ్వరం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(చిన్న కాళేశ్వరం), పాలమూరు రంగారెడ్డి , పెన్ గంగ కాలువ , చనాక కోరాట బ్యారేజీ, తుపాకులగూడెం, సీతారామా లాంటి కీలక ప్రాజెక్టులకు అటవీ , పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు సాధించడం చెప్పుకోదగిన విశేషం. గతంలో ప్రాజెక్టులకు అనుమతులు తేవడం ఓ ప్రహాసనం. అయితే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు సాధించే క్రమంలో కేంద్ర సంస్థలను పరుగులు పెట్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సంవత్సరంలోనే 10 కీలక అనుమతులు పొందడం ఒక రికార్డు.
ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నెలల పాటు ఇంజనీరింగ్ నిపుణులతో , రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్ ఇండియావారి మ్యాపులు , గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ సహాయంతో అధ్యయనం చేసిన అనంతరం ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి , ఖమ్మం జిల్లాలో చేపట్టిన రాజీవ్ దుమ్ముగూడెం , ఇందిరా సాగర్ , ఎస్సారెస్పీ వరద కాలువ , దేవాదుల , కాంతనపల్లి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసి, కొత్త ప్రతిపాదనలతో ప్రాజెక్టుల పనులను కొనసాగుతున్నాయి.
ఈ ఐదేండ్లలో తెలంగాణా ప్రభుత్వం 12 పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసింది. మరో 11 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంది. వీటి ద్వారా కొత్తగా 16.65 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం, మరో 2.97 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్) ఎత్తిపోతల పథకాల కింద 2016-17 సంవత్సరంలో 4.5 లక్షల ఎకరాలకు, 2017-18 సంవత్సరంలో 6.50 లక్షల ఎకరాలకు, 2018-19 సంవత్సరంలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినందున, 700 పైబడి చెరువులని నింపినందున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన ఫలితాలు కానవస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగుబడి రైతులకు వచ్చింది. జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయి. వలసలు వెళ్ళిన వారు స్వంత ఊర్లకు తిరిగి వస్తున్నారు. జిల్లాలో ఒక స్పష్టమైన ఆర్ధిక, సామాజిక మార్పు కనబడుతున్నది. ఇదంతా తెలంగాణా ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై చూపించిన శ్రద్ధ వల్లనే సాధ్యమయ్యింది. 2018 సంవత్సరంలో మొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఆర్‌డిఎస్ కింద 60 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి గత డిసెంబర్‌లో ఆర్‌డిఎస్ కాలువలోకి నీటిని ఎత్తిపోయడం జరిగింది.
సింగూరు కాలువలను పూర్తి చేసి మెదక్ జిల్లాలో 2017 లో 30 వేల ఎకరాలకు, 2018 లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాలో నీరివ్వడం ఇదే తొలి సారి.
కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసం సమస్యలను పరిష్కరించి , రాయపట్నం బ్రిడ్జ్ ని నిర్మింపజేసి 20 టిఎంసి ల పూర్తి స్థాయి నిల్వ సాధించగలిగాం. ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా 25 వేల ఎకరాలకు, చెరువులను నింపినందున మరో 37,000 ఎకరాలు స్థిరీకరణ జరగింది. 2016 లో ఎస్.ఆర్.ఎస్.పి రెండవ దశ కాలువల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలకు నీటిని తరలించి వందలాది చెరువులను నింపడం జరిగింది.
ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 100 చెరువులను నింపడం, శ్రీరాంసాగర్ రెండో దశలో ఉన్న డిబిఎం-60 కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కాలువ కింద ఉన్న మొత్తం 58 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలేరు పాత కాలువను 4 నెలల్లో పునరుద్దరించి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది.
ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల మరమ్మతు, ఆధునీకీకరణ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. జూన్ నెలాఖరుకు ఈ పనులు పూర్తి చేసి కాళేశ్వరం నీళ్ళను వరదకాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాశయానికి రివర్స్ పంపింగ్ చేయడానికి ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ఎస్ ఆర్ ఎస్ పి నుంచి దిగువ మానేరు వరకు ఉన్న 5 లక్షల ఎకరాలకు , దిగువ మానేరు కింద ఉన్న 4 లక్షల ఎకరాలకు, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశలో ఉన్న 4 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 40 వేల ఎకరాలకు, లక్ష్మి కాలువ కింద ఉన్న 25 వేల ఎకరాలకు, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఒక లక్ష ఎకరాలకు, సదర్ మాట్ ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాలకు ఈ సంవత్సరం నికరంగా నీరు అందుతుంది. మిడ్ మానేరు జలాశయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి 25 టిఎంసిల నీటి నిల్వకు సిద్ధం చేయడం జరిగింది. కాళేశ్వరం నీరు మిడ్ మానేరుకు ఈ సంవత్సరం చేరుతాయి కనుక మిడ్ మానేరు కింద 70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరుతుంది.
నాగార్జునసాగర్ ఎల్‌ఎల్‌సి పంపు హజ్ పనులు పూర్తి అయిన కారణంగా 2018 లో అనేక చేరువులని నింపి చెరువుల కింద ఆయకట్టును కాపాడడం జరిగింది. ఎల్‌ఎల్‌సి కింద 50,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో కాలువ పనులు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ఈ సంవత్సరం నీటి సరఫరాకు సిద్దం అవుతున్నది. ఈ పథకంలో కీలకమైన బ్రాహ్మణ వేల్లెమ్ల జలాశయం, పంప హౌజ్, సర్జ్ పూల్, టన్నెల్ నిర్మాణం పూర్తి అయినాయి. కాలువల తవ్వకం కొనసాగుతున్నది. త్వరలోనే ఈ ప్రాజేక్యు ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులను నింపడానికి, 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు పనులు సాగుతున్నాయి.
కాళేశ్వరం / పాలమూరు రంగారెడ్డి / డిండీ / సీతారామా ఎత్తిపోతలు:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 2008 లో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పడే నాటికి మహారాష్టాతో అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు, అటవీ సమస్యలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు. ఇలా అనేక సమస్యల్లో కూరుకుపోయి ఈ ప్రాజెక్టు అటకెక్కింది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని కూలంకషంగా సమీక్షించింది. తొలుత మహారాష్ట్రాతో అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కషి చేసింది. అయితే మహారాష్ట్ర్ట తమ భూభాగంలో ముంపును అనుమతించలేమని, తుమ్మిడిహట్టి బ్యారేజి ఎఫ్‌ఆర్‌ఎల్ ని 152 మీ ల నుంచి 148 మీ కు తగ్గించమని కోరింది. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద 165 టిఎంసిల నీటి లభ్యత మాత్రమే ఉందని, అందులో కూడా భవిష్యత్తులో పై రాష్ట్రాలు వాడుకునే 63 టిఎంసి ల నీరు కలిసి ఉందని కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. తుమ్మిడిహట్టి వద్ద నుంచి తరలించగలిగే నీటి పరిమాణాన్ని పునః సమీక్షించుకొమ్మని ప్రాజెక్టు అధికారులకు సూచన చేసింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం చాలా తక్కువగా ఉందని, ప్రాజెక్టు అవసరాలకు తగినంత ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, మరికొన్ని కత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలని కూడా కేంద్ర జల సంఘం సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల దష్ట్యా ప్రభుత్వం తెలంగాణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాలు తగ్గిపోయిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ ఆయకట్టుని స్థిరీకరించడానికి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ అవసరమయ్యింది. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వద్ద బ్యారేజిలు, పంపు హౌజ్‌లు నిర్మించి రోజుకు 2 టిఎంసి ల నీటిని ఎత్తిపోసి యెల్లంపల్లికి చేర్చడం, అక్కడి నుంచి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ తదితర జలాశయాలకు నీటిని తరలించి 13 జిల్లాల్లో 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు , 18.80 లక్షల స్థిరీకరణకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. దీనికి తోడు హైదారాబాద్ నగరానికి, దారి పొడుగునా ఉన్న వందాలది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు న భూతో నా భవిష్యత్ అన్న రీతిలో మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి.
సుమారు 50 వేల మంది కార్మికులు, వందలాది మంది ఇంజనీర్లు ప్రాజెక్టు పనుల్లో శ్రమిస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, పంప్ హౌజ్ , సర్జ్ ఫూల్స్, టన్నెళ్ళు, గ్రావిటీ కాలువలు, పైప్ లైన్లు , గేట్ల తయారీ, బిగింపు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ లైన్లు .. ఇట్లా ఏక కాలంలో ప్రాజెక్టుకి సంబందించిన అనేక పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1, లింక్ 2 పనులని జూన్ నెలాఖరు కల్లా పూర్తి చేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు జలాశయానికి నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు 2019 లోనే నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పంపుల వెట్ ప్రారంభ అయ్యింది. లింక్ 2 లో ఉన్న ప్యాకేజి 6 లో ఏర్పాటు చేసిన 125 మెగావాట్ల 4 భారీ పంపుల వెట్ రన్ జయప్రదం అయింది. మే నెల 18 న ముఖ్యమంత్రి స్వయంగా మేడిగడ్డ బ్యారేజి, కన్నేపల్లి పంప్ హౌజ్ పనులని పరిశీలించి జూలైలో గోదావరి నీటిని ఎత్తిపోయడానికి ప్రాజెక్టుని సిద్ధం చేయమని ఆదేశాలు ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న వరుస బ్యారేజిల వలన 150 కి మీ గోదావరి నది సజీవం కాబోతుంది. గోదావరి నదిలోనే 56 టిఎంసిల నీటి నిల్వ ఉంటుంది. వ్యవసాయం, చేపల పెంపకం, టూరిజం, జల రవాణా, పరిశ్రమల స్థాపన వంటి రంగాలలో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు గ్రోత్ ఇంజన్ లాగా మారబోతున్నది. నిజాం హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పని చేసిన లియాఖత్ అలీ ఖాన్ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ గా మార్చాలని కలగన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కలని నిజం చేయబోతున్నది.
మహబూబ్ నగర్ , రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు, తాగునీరు అందించడానికి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోంది. రాబోయే రెండేండ్లలోఈ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. పాలమూరు ప్రాజెక్టుకు నిదులను సమకూర్చడానికి పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ తో సంప్రదింపులు జరుపుతున్నది.
ప్రాజెక్టుల ఆధునీకరణ :
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కాలంలో తెలంగాణ ప్రాజెక్టులు దారుణమైన నిర్లక్ష్యానికి లోనై నిర్వహణ లేక కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆయకట్టు సగానికి సగం పడిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. కాలువల్లో పూర్తి మోతాదులో డిస్చార్జ్ పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్దరించాలని, ప్రాజెక్టుల్లో పెరిగిపోతున్న ఈ గ్యాప్ ఆయకట్టుని తగ్గించాలని సంకల్పించింది. నాగార్జున సాగర్, నిజాంసాగర్, ఘన్ పూర్ ఆనకట్ట కాలువల ఆధునీకీకరణ పనులని పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరందించడం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకీకరణ కోసం ప్రభుత్వం 1000 కోట్లను నిధులను మంజూరు చేసింది. శ్రీరాం సాగర్ రెండో దశ కాలువల లైనింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. సదర్ మాట్ ఆనకట్ట ఆధునీకీకరణ, సాత్నాల, చెలిమేలవాగు, స్వర్ణ ఆధునీకీకరణ పనులు పూర్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 ప్రాజెక్టుల ఆధునీకీకరణ కోసం ప్రధాన మంత్రి కషి సీంచాయి యోజన పథకంలో ఒక భాగమైన ఇన్సెంటివైజేషన్ స్కీంలో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయానికి ప్రతిపాదించడం జరిగింది. 34 డ్యాముల పునరుద్దరణ కోసం డ్రిప్ (డ్యాం రిహాబిటిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్) పథకంలో 675 కోట్ల అంచనా వ్యయం తో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయానికి ప్రతిపాదించడం జరిగింది.
సాగునీటి శాఖలో సంస్కరణలు :
సాగునీటి శాఖలో ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. రాష్ట్ర అవసరాలను ద ష్టిలో ఉంచుకొని శాఖను పునర్ వ్యవస్థీకరించింది. కొన్ని కొత్త చీఫ్ ఇంజనీర్ల యూనిట్లను ఏర్పాటు చేసింది. ఈపిసి కాంట్రాక్ట్ పద్ధతిని, మొబిలైజేషన్ అడ్వాన్సులను రద్దు చేసింది. క్వాలిటి కంట్రోల్, డిజైన్స్ విభాగాలని పటిష్టం చేసింది. సాగునీటి శాఖలో అంచనాల అనుమతులు పొందే ప్రక్రియను సరళతరం చేసింది. వివిధ స్తాయిల్లో ఇంజనీర్ల అధికారాలను పెంచింది. ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా 4 విడతల్లో 600 పైగా సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ల నియామకాలు జరిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సంస్థలైన ట్రిపుల్‌ఐటి, ఐఐటిహెచ్, బిట్స్, ఇస్రో, నాబార్డ్, ఇక్రిసాట్ తదితర సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. సెక్రెటరియట్‌లో ఫైళ్ళ సత్వర పరిష్కారానికి ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ ని వినియోగించడం, మిషన్ కాకతీయ పథకాన్ని మొత్తంగా ఆన్ లైన్ లోనే పారదర్శకంగా నిర్వహించడం, చెరువులన్నింటిని జియో ట్యాగింగ్ చేయించడం జరుగింది.
ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం :
మిషన్ కాకతీయ విజన్ జయప్రదం కావాలంటే చెరువుల్లో కనీసం 10 నెలల పాటు నీరు నిలువ ఉండాలి. రెండు పంటలకు నీరు అందాలి. భూగర్భ జలాలు పైకి రావాలి. ఇందుకు చెరువులను భారీ మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేసినప్పుడే సాధ్యం అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగేండ్ల పాలనా కాలంలో అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి చేసుకొని 2019 జూన్ / జూలై నెలల్లో నీరు సరఫరాకు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణాకు జీవ ధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు 2019 లోనే అందుబాటులోకి రానున్నాయి. 2019 సంవత్సరాంతానికి మరిన్ని ప్రాజెక్టులు నీటి సరఫరా సిద్దం అవుతాయి. వీటిని చెరువులతో అనుసంధానం చేయడం ద్వారా చెరువులన్నీ రెండు పంటలకు నీరివ్వగలిగే స్థితి వస్తుంది. మైనర్ ఇరిగేషన్ కోసం గోదావరి బేసిన్ లో 165 టిఎంసిలు, కష్ణా బేసిన్‌లో 90 టిఎంసిలు , మొత్తం 255 టిఎంసిల నీటిని పూర్తిగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసారు. మొదటి దశలో ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి 3 వేల తూముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. జూలై నెలాఖరు వరకు తూముల నిర్మాణం పూర్తి చేయాలని ప్రాజెక్టుల ఇంజనీర్లను ఆదేశించింది.
వాగుల పునర్జీవన పథకం :
చెరువుల అనుసంధానంతో పాటూ తెలంగాణా రాష్ట్రంలోని ఆన్ని ప్రధాన వాగులు, వంకలు పునర్జీవనం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తి అవుతున్న కారణంగా దాదాపు రాష్ట్రమంతా (కొన్ని ఎత్తైన ప్రాంతాలు మినహా) కమాండ్ ఏరియాగా మారబోతున్నది. ఈ ప్రాజెక్టుల ద్వారా భూములకు సాగునీరు అందుతుంది. వారి నుండి వచ్చే పడవాటి నీరు (రీజనరేటెడ్ వాటర్) తిరిగి ఈ వాగుల్లోకి చేరుతాయి. వీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసుకోగలిగితే ఆ ప్రాంతాల్లో ఆ వాగులు పునర్జీవనం చెంది భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో పాటు అనేక రకాలుగా ఈ నీరు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంలోనికి రానున్నాయి. ఈ పడవాటి నీటిని, వర్షపు వొడిసి పట్టడానికి చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ, పంచాయతిరాజ్ శాఖ వారు వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను చెక్ డ్యాంలతో సహా నిర్మించాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చినందున ఆ శాఖలు కూడా చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టినాయి.
ముఖ్యమంత్రి సూచించిన ఈ రెండు కార్యక్రమాల అమలు కోసం సాగునీటి శాఖ విస్త త అధ్యయనం చేసింది. సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాపులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) వారి ఉపగ్రహ చిత్రాల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ విజయ్ ప్రకాశ్, కాడా కమీషనర్ మల్సూర్ నేతత్వంలో ఇంజనీర్ల బృందం క్షేత్ర స్థాయిలో మైనర్ ఇరిగేషన్, ప్రాజెక్టుల ఇంజనీర్లతో సమాచార సేకరణ సేకరణ చేసి విశ్లేషణ జరిపినారు. ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానికి సమగ్రమైన మార్గ నిర్దేశాలను తయారుచేసి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజనీర్లకు అందజేసినారు. ప్రతీ మండలానికి ఒక ఇరిగేషన్ చిత్రపటాన్ని రూపొందించి క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు అందజేయడం జరిగింది. తూముల నిర్మాణానికి, ఫీడర్ చానళ్ళ పునరుద్ధరణకు అంచనాలు రూపొందించే పని జరుగుతున్నది. రాష్ట్రం మొత్తంలో ఉండే నదులను, వాగులను, వంకలను 8 స్థాయిల్లో (ఆర్డర్స్) వర్గీకరించడం జరిగింది. 4 నుంచి 8 స్థాయి కలిగిన వాగులను పెద్ద వాగులుగా పరిగణించాలి. ఇవి రాష్ట్రంలో 683 ఉన్నట్టు, వారి పొడవు 12,183 కిలోమీటర్లు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. పూర్తి అయిన ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉండే వాగులపై ప్రథమ ప్రాధాన్యతలో చెక్ డ్యాం లను ప్రతిపాదించాలని సూచించడం జరిగింది. రెండవ దశలో ఒకటి రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోబోతున్న ప్రాజెక్టుల కమాండ్ ఏరియాల్లో ఉండే వాగులపై చెక్ డ్యాంలను ప్రతిపాదించాలని సూచించారు. మొదటి దశలో 1200 చెక్ డ్యాం ల నిర్మాణం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 వేల తూములు, 1200 చెక్ డ్యాం ల నిర్మాణానికి 4296 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జి ఓ నంబరు 8 ని జారీ చేసింది.
ప్రాజెక్టుల నీటి నిర్వహణ / యాజమాన్యం :
ప్రాజెక్టుల కాలువల కింద ఒక టిఎంసి నీటికి ఎన్ని ఎకరాలు సాగు అవుతాయి? తరి పంటలకైతే 5 నుంచి 6 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకైతే 10 వేల ఎకరాలు అనేది అందరికీ తెలిసిన జవాబు. కానీ ప్రపంచంలో నీటి నిర్వాహణలో అనేక సాంకేతిక పద్దతులు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక టిఎంసి కి 13 వేల ఎకరాల పైబడి తరి పంటలను, 15 వేల నుంచి 20 వేల ఎకరాల ఆరు తడి పంటలను పండించడం సాధ్యం అవుతున్నది. మెరుగైన నీటి యాజమాన్య పద్దతులు అమలు చేయడం, వరి సాగులో పంట కాలం తక్కువగా ఉండే వరంగల్, జగిత్యాల, శ్రీ వరి లాంటి వంగడాలని ప్రోత్సహించడం, ఆయకట్టులో మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అవలంభించే విధంగా రైతులను చైతన్య పరచడం, ఆరుతడి పంటలను, కూరగాయల సాగును ప్రోత్సహించడం, పూలు, పండ్ల తోటలను పెంచేందుకు ప్రోత్సహించడం తదితర చర్యల ద్వారా ఒక టిఎంసికి 13 వేల ఎకరాలను సాగు చెయ్యడం అసాధ్యం ఏమీ కాదు. మహారాష్ట్రా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైప్డ్ ఇరిగేషన్ పద్ధతిని అవలంబించి ఒక టిఎంసికి 15 నుంచి 20 వేల ఎకరాల సాగు సాధిస్తున్నారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత మూడు ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్ కాలువల కింద వారాబంది (ఆన్ & ఆఫ్), కింద నుంచి పైకి (టైల్ టు హెడ్) పద్ధతులని సమర్ధవంతంగా అమలు చేసినందున వరి పంటకే ఒక టిఎంసికి 13 వేల ఎకరాలు సాగుబడి సాధ్యం అయింది. పంట దిగుబడి పెరిగింది. టెయిల్ టు హెడ్ పద్ధతిన నీటి సరఫరా చేసినందువలన గత 20 ఏండ్లుగా ఎన్నడూ నీరు పారని చిట్ట చివరి భూములకు నీరు పారించగలిగినారు. ఎకరానికి 35 బస్తాలు వరి పండించే పరిస్థితి నుంచి ఎకరాకు 50 బస్తాలు పైచిలుకు వరి దిగుబడిని రైతులు సాధించారు.
తెలంగాణా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఈ వినూత్న ప్రయోగం సఫలం కావడం శుభ సూచకం. గతంలో రైతులు కూడా వరి పంటకు పొలంలో నిలువ నీరు ఉండాలన్న తప్పుడు అవగాహనతో ఉండేవారు. కాని ఆన్ & ఆఫ్ పద్ధతిలో కూడా వరి పంట చేయవచ్చునని, అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. నీటి కొరత ఉన్న ఈ కాలంలో దుబారాను తగ్గించి పొదుపుగా వాడుకోవడం, నీటి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా, కాలువలను తెగ్గొట్టకుండా క్రమశిక్షణ పాటించగలిగితే సాగునీటి ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు చివరి భూములకు కూడా నీరు అందించడానికి కషి చేస్తారు. అది వారు శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నిరూపించి చూపారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఎత్తిపోతల పథకాల నుంచి ఖరీదైన నీటి సరఫరా జరుగుతుంది కనుక ఆయకట్టు రైతులు ఈ క్రమశిక్షణ పాటించాలి. ఇంజనీర్లు మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులను అవలంభించాలి.
సాగునీటికి బడ్జెట్ కేటాయింపులు / నిధుల సమీకరణ / నీటి కేటాయింపులు
బడ్జెట్‌లో సాగునీటి శాఖకు గత మూడు సంవత్సరాలుగా 25 వేల కోట్ల అత్యధిక నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టుల పనులను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టులకు జాతీయ బ్యాంకుల ద్వారా నిధులు సమకూరుస్తున్నది. దేవాదుల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 38 టిఎంసి ల నుంచి 60 టిఎంసిలకు పెంచింది. కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులను 25 నుంచి 40 టిఎంసి లకు పెంచింది. గోదావరిలొ తెలంగాణ వాటా 954 టిఎంసిల నీటిని సంపూర్ణంగా వాడుకోవడానికి ప్రణాళికలు తయారు చేసి ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. కష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీం కోర్టు ముందు వాదనలు కొనసాగిస్తోంది.
ఐదేండ్లలో సాగునీటి ప్రగతి సూచికలు :
సాగునీటి రంగంలో ప్రగతిని, ఉమ్మడి రాష్ట్రంలో 2004 -14 వరకు పదేళ్ల పాలనలో జరిగిన ప్రగతితో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయంలో సాగునీటి ప్రాజెక్టుకు చేసిన ఖర్చు, సాధించిన ప్రగతి కింది పట్టికలో చూడవచ్చు
ప్రాజెక్టులకు నిధుల ఖర్చు చేసిన వివరాలు.
ప్రాజెక్టు కేటగిరి నిధుల ఖర్చు(కోట్లలో) నిధుల ఖర్చు(కోట్లలో)
సంవత్సరం 2004-2014 2014-2019
మేజర్ 44447.90 73805.95
మీడియం 1868.39 641.55
మైనర్ 4010.06 6300.03
ఇతర ఖర్చులు 1762.73 1196.22
మొత్తం 52,036.55 81662.20
ఆయకట్టు పట్టిక
ప్రాజెక్టు కేటగిరి కొత్త ఆయకట్టు
( లక్షల ఎకరాలు) ఆయకట్టు స్థిరీకరణ
( లక్షల ఎకరాలు ) కొత్త ఆయకట్టు
( లక్షల ఎకరాలు) ఆయకట్టు స్థిరీకరణ
(లక్షల ఎకరాలు)
సంవత్సరం 2004-2014 2004-2014 20014-18 2014-2018
మేజర్ 5.39 0.93 10.37 2.04
మీడియం 0.32 0.00 0.58 0.00
మైనర్ 0.00 0.00 0.60 13.80
టీఎస్‌ఐడీసీ 0.00 0.00 1.23 0.27
మొత్తం 5.71 0.93 12.78 16.11
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గడచిన ఐదేండ్లలో సాగునీటి రంగంలో గొప్ప విజయాలు చేకూరినాయి. తెలంగాణా ప్రజల సాగునీటి ఆకాంక్షలు నెరవేరే దారిలో ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. తెలంగాణా కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు. ఆ దిశలో ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో సాగునీటి శాఖ ముందుకు సాగుతున్నది.