రేవానదీ తీరంలో తపస్సు,

కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం,

గోదావరి నదిలో స్నానమాచరించడంవల్ల జీవితానికి అర్థం,

పరమార్థం లభిస్తాయన్నది పెద్దల మాట.
గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.

దేవగురువైన బృహస్పతి మేషాది రాశులలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించగానే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. మొత్తం 12 రాశులు వుండటంవల్ల ఆయా జన్మ రాశులకు సంబంధించిన 12 నదులలో ప్రతీ నదీమతల్లికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి.

ఆ విధంగా గురువు (బృహస్పతి) సింహరాశిలోకి ప్రవేశించగానే గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఏ నదికి పుష్కరకాలం ప్రాప్తిస్తుందో, ఆ నదిలో పుష్కరతీర్థుడు ప్రవేశిస్తాడు. పుష్కరకాలంలో మూడుకోట్ల 50 లక్షల తీర్థాలు పుష్కరునితోపాటు పుష్కర నదిలో లయించి వసిస్తాయి.

ఇంతటి పుణ్యతీర్థాలలో స్నానమాచరించడం ఎంతో శ్రేయోదాయం. ఇదే పుష్కరస్నాన వైశిష్ట్యం.

basaపుష్కరాలలో ప్రధానంగా పాటించే అంశాలు రెండు. ఒకటి పుష్కరస్నానం. పుష్కరాలలో నదీ స్నానం చేస్తే సకల నదులకుగల పుణ్యశక్తి లభిస్తుంది. అన్ని నదులు తమ శక్తిని పుష్కరాలు జరిగే నదికి ఇస్తాయి గనుక ఆ సమయంలో ఆ నదీ స్నానం అత్యంత పుణ్యప్రదం.

ఇక రెండవ అంశం, చనిపోయిన పితృ, పితామహ, ప్రపితామహ, వృద్ధపితామహులంతా పుష్కరాల సమయంలో సూక్ష్మరూపంలో ఆ నదిని ఆశ్రయిస్తారు. కనుక వారిని సంతృప్తిపరిస్తే, వారి ఆశీర్వాదాలు కూడా మనకి లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. అందుకోసమే పుష్కర సమయంలో తర్పణం, నదీతీరంలో పిండ ప్రదానానికి అంతటి ప్రాధాన్యత వుంది.

అదేవిధంగా పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధరకాల దానాలు చేయడం, సమీపంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.

మూడు రాష్ట్రాలలో ప్రవహిస్తున్న గోదావరి

శివభక్తుడైన గౌతమ మహాముని ఘోర తపస్సు చేసి శివుని జటాజూటంలోని గంగను భూమి మీదకు తెచ్చాడు. ఆ ప్రాంతాన్నే త్రయంబకం అంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్‌కు సమీపంలోవుంది. అక్కడగల త్రయంబకేశ్వరస్వామి ఆలయం పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం.

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టిన గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం కందకుర్తివద్ద మన రాష్ట్రంలోనికి ప్రవేశిస్తోంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల మీదుగా ప్రవహించే గోదావరి నదీమ తల్లి ఖమ్మం జిల్లా భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. ఆ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలనుంచి ప్రవహించి తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది.

భారతదేశంలో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి. అందులో గోదావరినది ఒకటి. శ్రీ సీతారామచంద్రస్వామి వనవాసకాలంలో ఎక్కువకాలం దండకారణ్య ప్రాంతంలోని గోదావరి నదీ తీరానే గడిపినట్టు చరిత్ర చెపుతోంది.
2003 సంవత్సరంలో జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు గోదావరికి పుష్కరాలు నిర్వహించారు. తిరిగి 12 సంవత్సరాల తరువాత ఈ ఏడాది జూలై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఆనాటినుంచి 12 రోజులపాటు, అంటే జూలై 25వ తేదీ వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత వచ్చిన తొలి పుష్కరాలు గోదావరి పుష్కరాలు. అందువల్ల ఈ పుష్కరాలను గతంలో కంటే భిన్నంగా ‘కుంభమేళా’ తరహాలో భారీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు.

గోదావరితీరంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు గతంలోకంటే అధిక సంఖ్యలో పుష్కరఘాట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రవాణా, వైద్య, తదితర సకల సౌకర్యాలను కల్పించడానికి వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

పుష్కరాల సమయంలో గోదావరి నదీ తీరానికి భక్తులు చేరుకోవడానికి వీలుగా ఆయా రోడ్డు మార్గాలను పునరుద్ధరించడంతోపాటు ప్రత్యేక బస్సుల నిర్వహణ చేపట్టనుంది. అలాగే, గోదావరీ నదీ తీరాలలోని ఆలయాలను ముస్తాబు చేసేందుకు కూడా ప్రణాళికలు రచించింది.

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ప్రవహిస్తున్న ప్రదేశాలలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు వున్నాయి. మహారాష్ట్ర నుండి నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం కందుకుర్తివద్ద గోదావరినది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తోంది.

తెలంగాణలోని గోదావరి నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలు…

బాసర

basaraaబాసర చదువుల తల్లి చల్లని సన్నిది. ఇక్కడ వేదవ్యాసునిచే ప్రతిష్ఠ చేసిన జ్ఞాన సరస్వతి దేవాలయం వుంది. భారతదేశంలో కేవలం రెండుచోట్ల మాత్రమే ప్రసిద్ధ సరస్వతీదేవి దేవాలయాలు వున్నాయి.అందులో ఒకటి బాసర కాగా, రెండవది కాశ్మీర్‌ ప్రాంతంలో వుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు బాసరకువచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ తల్లి చల్లని నీడలో అక్షరాభ్యాసం చేస్తే, వారికి విద్యాబుద్ధులు చక్కగా అబ్బుతాయన్నది భక్తుల విశ్వాసం.

పూర్వం ఈ ప్రాంతం ప్రశాంతమైన తపోభూమి. ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, విష్ణువు, శంకరుడు మొదలైనవారు ఇక్కడ తపస్సుచేసినట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ ప్రాంతం పరమ పవిత్ర క్షేత్రంగా భాసిల్లింది. గోదావరి నదికి ఒక కిలోమీటరు దూరంలోనుండి వేదవ్యాసుడు గంగాస్నానంచేసి, చేతిలో ఇసుకను తెచ్చి, కుప్పగాపోసి, సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్టించాడట. అందువల్లే, అమ్మవారి అనుగ్రహం కోరుకునే భక్తులు బాసరలోని ప్రశాంత వాతావరణంలో ధ్యానం, జపం చేస్తూ జీవన సార్థకతను పొందుతున్నారు.

basaraబాసర పుణ్యక్షేత్రం నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలోవుంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా నిజామాబాద్‌ మీదుగా బాసరకు బస్సులు ఉన్నాయి. హైదరాబాదునుంచి రైలు సౌకర్యం కూడా వుంది. ఇక్కడ అనేక సత్రాలు, వసతి గృహాలు, ప్రయివేటు లాడ్జిలు భక్తులకు అందుబాటులో వున్నాయి. దేవస్థానంవారి వసతి గదులు కూడా ఉన్నాయి.

సరస్వతీ దేవాలయం చుట్టుప్రక్కల దర్శనీయ స్థలాలు చాలానే వున్నాయి. సరస్వతీదేవి ఆలయానికి తూర్పుభాగాన దత్తమందిరం, పశ్చిమభాగం మహాకాళి దేవాలయం, దక్షిణ దిశలో వ్యాసమందిరం ఉన్నాయి. ఇక్కడ వేదవతి అనే ఒక శిల వుంది. దీనిని చిన్న రాయితో కొడితే విచిత్రమైన ధ్వని వస్తుంది.

గోదావరి నదీ తీరంలో ఓ శివాలయం వుంది. ఆలయానికి ఉత్తరంగా కొంత దూరంపోతే పాపహరేశ్వర ఆలయం, పశ్చిమాన కొండపై వ్యాసగుహ, గంగామాత విగ్రహం వున్నాయి.

ధర్మపురి

dharmapuriబాసర క్షేత్రం నుంచి గోదావరి నది శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు క్రిందనుంచి ధర్మపురికి చేరుతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రం ధర్మపురి. కరీంనగర్‌ జిల్లాలోని ఈ ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు బ్రహ్మదేవుడు, యముని ఆలయాలు కూడా వుండటం ఇక్కడ ప్రత్యేకత.
ధర్మాంగదుని పేరున ధర్మపురిగా వెలసింది. ఇక్కడి గోదావరి నదిలో స్నానం ఆచరించి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పూజించిన వారికి శాప, పాపాలు తొలగి సుఖాలను పొందుతారన్నది భక్తుల విశ్వాసం. ఈ ధర్మపురి క్షేత్రం కాల సర్పదోష శాంతికి, నివారణకు ప్రసిద్ధి.

ధర్మపురి పుణ్యక్షేత్రం హైదరాబాద్‌కి 250 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 80 కిలో మీటర్లదూరంలో వుంది. జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడికి బస్సు సౌకర్యం వుంది.
కోటిలింగాల క్షేత్రం…

ధర్మపురి నుంచి మంచిర్యాల పట్టణానికి దక్షిణాన గోదావరి తీరంలో ఈ కోటిలింగాల క్షేత్రం ఉంది. ఇది కరీంనగర్‌ జిల్లా కేంద్రంనుండి లక్సెట్టిపేట రోడ్డు మార్గంలో వెల్కటూరు మండలంలో వుంది.

వేయి సంవత్సరాల క్రితం శాతవాహనులకు ఈ ప్రాంతం రాజధానిగా ఉండేది. వారు కోటలో ఒక శివాలయం ప్రతిష్టించగా ప్రజలంతా ఆ కోటలోని శివలింగాన్ని పూజించేవారు. అది కాలక్రమంలో కోటిలింగాల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.

కోటిలింగాల నుంచి గోదావరినది గోదావరిఖని మీదుగా మంథనికి చేరుకుంటుంది.

మంథని…

mantaniమంథని అంటే కవ్వము మధించిన సారము. వెన్నలాంటి జ్ఞానం, వేద విద్యలు ఇక్కడ చిలకబడ్డాయి. మంథనికి నాలుగువైపులా నాలుగు ఈశ్వరలింగాలు ఉన్నాయి.

పూర్వం గౌతమమహారుషి ఇక్కడ పొలంలో విత్తనాలు చల్లి ఈశ్వర ఉపాసనతో మధ్యాహ్నం వరకు పంటను పండించి, నిరంతరం అన్నదానం చేసేవారట. గౌతమముని స్థాపించినది కనుక ఇక్కడి ఆలయాన్ని గౌతమేశ్వర దేవాలయంగా పిలుస్తారు. ఇంకా ప్రౌఢ సరస్వతీ దేవాలయం, భిక్షేశ్వర ఆలయం, ద్వాదశ హనుమదాలయం కూడా ఇక్కడ దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి.

మంథని నుంచి గోదావరిలో ఉపనది మానేరు నది కలుస్తుంది. అక్కడినుండి గోదావరి ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తుంది. ఇది అరుదైన విషయం. ఈ విధంగా ఉత్తరాభిముఖంగా ప్రవహించడం కాశీ క్షేత్రంలో మాత్రమే సంభవమైంది. ఇక్కడ అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం వుంది. ఇది అంబా అగస్త్యేశ్వర ఆలయంగా పూజలు అందుకుంటోంది.

ఈ ప్రదేశంలో స్నానం, దానం, పిండాదులు చేస్తే అనంతమైన కాశీ క్షేత్ర దర్శన ఫలం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం.

ఎక్కడైనా శివుడు లింగరూపంలో ఉంటాడుగానీ, అవయవాలు వుండవు. కానీ ఇక్కడ నాసికా రంధ్రాలు ఉండటం ప్రత్యేకత.

కాళేశ్వరం

kotilingaluకరీంనగర్‌ జిల్లాలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం కాళేశ్వరం. మహదేవపురం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న కాళేశ్వర క్షేత్రం ప్రాణహిత, గోదావరి నదుల సంగమ స్థలం. అంతర్వాహినిగా సరస్వతీనది కూడా ఇక్కడ కలవడంవల్ల ఇది త్రివేణీ సంగమమైంది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరాలను కలిపి త్రిలింగాలు అంటారు. ఆ విధంగా త్రిలింగాలలో ఒకటిగా కాళేశ్వరం ఖ్యాతి పొందింది.

కాళేశ్వర క్షేత్రం కరీంనగర్‌ నుంచి 142 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర, సరస్వతి, బిందుమాధవ, శ్రీవీరభద్రేశ్వరాలయాలు ఉన్నాయి.

ఇక్కడ గోదావరి నదిలో పుష్కరకాలంలో స్నానం, దానం, పిండ ప్రదానాలు చేస్తే త్రిజన్మ పాపాలు నశిస్తాయి కాశీక్షేత్రంలో యాదృచ్ఛికంగా మరణించినా ముక్తి లభించినట్లే. ఇక్కడి కాళేశ్వరుని అనుకోకుండా దర్శనం చేసుకున్నా ముక్తి లభిస్తుందన్నది పెద్దలమాట.

రామన్నగూడెం..

రామన్నగూడెం వరంగల్‌ జిల్లాలో వుంది. గోదావరి నది ఒడ్డునగల రామన్నగూడెంలో కూడా భక్తులు పుష్కర స్నానం చేస్తారు. రామన్నగూడెం సమీపంలో ఓరుగుల్లును పరిపాలించిన కాకతీయ రాజుల శిల్పకళా సౌరభాలకు ప్రతీక అయిన రామప్ప దేవాలయం, రామప్ప చెరువు దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి. సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే ప్రదేశం కూడా దీనికి సమీపంలోనే ఉంటుంది.

భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి ప్రవాహానికి చివరి క్షేత్రం భద్రాచల క్షేత్రం. అఖండ గోదావరి తీరాన దండకారణ్యంలో వెలసిన పుణ్యక్షేత్రమిది. ఖమ్మం జిల్లాలోని ఈ క్షేత్రానికి, రామాయణగాథకు దగ్గర సంబంధం వుంది. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీత, లక్ష్మణ సమేతుడై చాలాకాలం ఈ ప్రాంతంలో ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. భద్రాచల ప్రాంతం శ్రీ సీతారాముల పాదస్పర్శతో పునీతమైన పావన ప్రదేశం.

భక్త రామదాసుగా ఖ్యాతిపొందిన కంచర్ల గోపన్న నిర్మించిన రామాలయం భద్రాచలంలోనే ఉంది. దీనితోపాటు శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, రంగనాయక స్వామి ఆలయం, కల్యాణ మండపం, అభయాంజనేయస్వామి ఆలయం ఉన్నాయి. భద్రాచలానికి కొద్ది దూరంలో పర్ణశాల ఉంది. ఈ పర్ణశాల ప్రదేశం నుంచే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి. సీతాదేవిని అపహరించుకొని వెళ్తున్న రావణుని అడ్డగించి జటాయువు పోరాడినది, చివరకు రావణుని చేతిలో హతమైందీ ఇక్కడికి సమీపంలోనే. శ్రీ సీతారామచంద్రస్వామి నివసించిన ఈ పవిత్ర క్షేత్రంలోని గోదావరి నదిలో పుష్కర వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

ఈ గోదావరి పుష్కరాలను జయప్రదంగా నిర్వహించేందుకు, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది.

Other Updates