ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావులేకుండా 2017-18 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం సేకరణ పాలసీని పౌరసరఫరాలశాఖ పకడ్బందీగా రూపొందించింది. గతంలో విడుదల చేసిన పాలసీలో అనేక మార్పులు చేర్పులను చేపట్టింది. ముఖ్యంగా బియ్యం నాణ్యత, పరిమాణాల విషయంలో, గోదాములపై ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణతోపాటు థర్డ్‌పార్టీ వెరిఫికేషన్. కొనుగోలు కేంద్రాలనుంచి గోనె సంచులు బయటికి తరలివెళ్ళకుండా, అలాగే మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయింపులు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించి మిల్లర్ల లావాదేవీలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావడంలాంటి అంశాలను పాలసీలో పొందుపరిచింది. దీంతోపాటు రైతు సమస్యలు, కనీస మద్ధతు ధర తదితర విషయాల్లో ఫిర్యాదులకోసం రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో 28 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 25 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి కనీసం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఇది తాత్కాలిక నిర్ణయమేనని, అంతకంటే ఎక్కువ ధాన్యం మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు చేసేలా పౌర సరఫరాలశాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. 2017-18 సంవత్సరానికి ధాన్య సేకరణ విధానాన్ని పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. రైతులకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ధాన్య సేకరణ వ్యవహారం లక్షలాదిమంది రైతులతోకూడిన అంశం కావడంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్‌కంటే ఈసారి దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా వస్తుందనే అంచనాతో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిన్నచిన్న అక్రమాలకు, పొరపాట్లకు కూడా తావులేకుండా ధాన్య సేకరణ పాలసీని రూపొందించామని కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది వరి ధాన్యం కనీస మద్దతు ధరలు, సాధారణ రకం క్వింటాలుకు రూ. 1470 నుంచి రూ. 1550కి, గ్రేడ్-ఎ రకం క్వింటాలుకు రూ. 1510 నుంచి రూ. 1590కి పెరిగాయి. ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరను తప్పనిసరిగా చెల్లించాలి. కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలి. ఖరీఫ్‌లో ఐకెపి, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 2846 కొనుగోలు కేంద్రాలద్వారా 27.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు జాబ్ చార్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ప్రతి కేంద్రంలో ఐదుమంది ఉండాలి. ధాన్యం ఎంత కొనుగోలు చేశాం, ఎంత తిరస్కరించింది, చెల్లింపులు వంటి వాటిని ఆన్‌లైన్‌లో ఏ రోజుకారోజు పొందుపరచాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర, రేషన్ బియ్యం పంపిణీ ఇతర ఫిర్యాదులకోసం హైదరాబాద్‌లోని పౌరసరఫరాలభవన్‌లో టోల్ ఫ్రీ నంబర్ 1800 42500 333తోపాటు 1967 నెంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
కనీస వసతుల ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులను చైతన్యపరచాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా దిగుబడి ఎంత వస్తుందో క్షేత్రస్థాయిలో సంయుక్త కలెక్టర్ల ద్వారా అంచనాలు రూపొందించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా వాటిలో సరిపడా గోనె సంచులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు వాటిని విక్రయించేందుకు వేచి
ఉండాల్సిన పరిస్థితి రాకుండా ప్రణాళికను రూపొందించు కోవాలి. మద్దతు ధరలో ఒక శాతం మార్కెటింగ్ ఫీజు చెల్లిస్తున్నా కూడా గతేడాది పిపిసిల్లో తేమకొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్స్, విన్నోవింగ్ మిషన్లు అవసరం వున్నా కూడా మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేయలేదు. ఈసారి వీటితోపాటు తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులపై సంయుక్త కలెక్టర్ సమీక్షించాలి.
ధాన్య సేకరణ కమిటీలు
సంయుక్త కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయిలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలో వ్యవసాయ మార్కెటింగ్, పౌరసరఫరాలు, రవాణా, డీఆర్‌డీఏ, ఐటీడీఏ, ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీ, సీడబ్ల్యూసీ విభాగాల జిల్లాస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. కొనుగోలు కేంద్రాలు, ధాన్య సేకరణ రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం, తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ధాన్య రవాణా, పర్యవేక్షణ, రైతులకు కనీస మద్దతు ధర, ఇతర ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
స్టేజ్-1 బఫర్ గోదాములవద్ద అవకతవకల నివారణకు నిఘాను పెంచుతాం. ఈ గోదాముల్లో బియ్యం క్వాలిటీ, క్వాంటిటీపై పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. వీరితోపాటు ఆర్డీవోలు, డీసీఎస్‌వోలు, జిల్లా మేనేజర్లు కూడా తరచుగా తనిఖీలు నిర్వహించాలి. ఇవేకాకుండా ఈ బఫర్ గోదాముల్లో థర్డ్ పార్టీతో వెరిఫికేషన్ చేయిస్తాం. వీటిల్లో జరిగే ప్రతి లావాదేవీలను సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఈఎం)లో ఎంట్రీలు తప్పకుండా చేయాలి.
సామర్థ్యం మేరకు కేటాయింపులు
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం సామర్థ్యం మేరకు రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపాలి. రాష్ట్ర జిల్లా మిల్లర్ల సంఘాలతో సంప్రదించి ఒక క్రమపద్ధతిని పాటించాలి. సెప్టెంబర్ 2016నాటికి రీసైక్లింగ్, పీడీఎస్ బియ్యం దారి మళ్లింపు, క్రిమినల్ కేసులు, బ్లాక్ లిస్టు కావడం, 6ఏ కేసులు నమోదైన మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరుపకూడదు. రెండు టన్నుల సామర్థ్యం ఉన్న మిల్లులకు 1000 మెట్రిక్ టన్నులు, 4 టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి 2000 మెట్రిక్ టన్నులు, 6 టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి 3000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించాలి. ఆయా జిల్లాల్లో మిగులు ధాన్యాన్ని పక్క జిల్లాలకు కేటాయించే విషయంలో రవాణా ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని పాత జిల్లాలకు ప్రాధాన్యతనివ్వాలి.
ఆన్‌లైన్ పరిధిలోకి రైస్ మిల్లర్లు
రైస్ మిల్లర్లకు సంబంధించిన అన్ని లావాదేవీలను సైతం ముఖ్యంగా ధాన్యం కేటాయింపులు, అప్పగించిన బియ్యం, చెల్లింపులు, తదితర అన్ని వివరాలను ఆన్‌లైన్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం) పరిధిలోకి తీసుకువచ్చారు. పౌరసరఫరాలశాఖ ఎంత ధాన్యాన్ని కేటాయించింది, తర్వాత మిల్లర్లు తిరిగి ఏ రోజు ఎంత బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించింది… తదితర అన్ని వివరాలను ఆన్‌లైన్ చేశారు. దీనిని రైస్ మిల్లర్లు కచ్ఛితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాలశాఖ నిర్ణయించింది.
రబీలో కొనుగోలు చేయనున్న ధాన్యం 25 మెట్రిక్ టన్నులు
మొత్తం రెండు సీజన్లలో 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఇది తాత్కాలిక నిర్ణయమే.. అంతకంటే ఎక్కువ ధాన్యం మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– పౌర సరఫరాలశాఖ