జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు ఎక్కువ మేలు చేసే విధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణపై సెప్టెంబరు 3న క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి లభ్ధిదారుడి వివరాలు కలెక్టర్లు కంప్యుటర్ లో అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజిటలైజేషన్ లో అనుభవం, అర్హతలున్న ఇంజనీర్లను కలెక్టర్లకు సహాయపడే విధంగా నియమించా లన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవలక్షణాలేవీ లేకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖలను పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ఉన్న పద్ధతులు, సంప్రదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను ఏ విధంగా చేరువ చేయాలనే సంకల్పంతో శాఖల డిజైన్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించే క్రమంలో అన్ని శాఖలకు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవడానికి అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విషయంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రజలే నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించే విధంగా ప్రణాళిక రూపొందిచాలని సూచించారు. గతంలో మాదిరిగా ఉద్యోగులంటే వాళ్లను దొంగల్లా భావించే పద్ధతి ప్రభుత్వంలో ఉండకూడదని సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో వాళ్లు కూడా భాగస్వాములేననే విషయాన్ని మరిచి పోకూడదన్నారు. దురదష్టవశాత్తు గత సమైక్య పాలనలో ఉద్యోగులను చిన్న చూపు చూసే పరిస్థితి ఉండేదన్నారు. పునర్విభజన ప్రక్రియలో వీలైనంత వరకు అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చిన్న చిన్న అనుబంధ శాఖలన్నింటిని ఒకే గొడుగు క్రిందకు తీసుకురావాలని సీఎం సూచించారు. ఇరిగేషన్, వ్యవసాయం వంటి కీలక రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం వివరించారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండాల్సిన ప్రాంతం… గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 58 ఏండ్ల చరిత్రలో ఒకే ఒక్క ఏడాది మాత్రమే ఇరిగేషన్‌కు 15,500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని అదే ఎక్కువ కేటాయింపులన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి 25 వేల కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని అన్నారు. గతంలో ఏపీకి 13 మంది ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు ఉంటే నేడు ఒక్క తెలంగాణకే 15 మంది సీఈలు ఉన్నారని పేర్కొన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలో మొత్తం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వ్యవసాయ గిడ్డంగులు మాత్రమే ఉంటే… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే 21 లక్షల టన్నుల గిడ్డంగులు నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని, ఇప్పుడు వాటి నిర్మాణం వేగంగా జరుగుతు న్నదని సీఎం వివరించారు.
నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన విషయమని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నేరాలను పూర్తి స్థాయిలో అదుపు చేసే చర్యలను తీసుకోవాలని, దానిలో భాగంగానే కొత్తగా ఏర్పడే మండల కేంద్రాలలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమైన సిబ్బంది నియామకం జరగాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలందరూ పూర్తి సంతోషంగా ఉండేలా కొత్త జిల్లాల ప్రక్రియ అమలు కావాలన్నారు. దసరా రోజు తానూ కొత్తగా ఏర్పడే సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి, తనతో పాటు మంత్రులు, చీఫ్ సెక్రెటరీ, డిజీపి వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో పరిపాలన ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్‌రావు, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సిఎం అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతకుమారి, సిఎంఓ అధికారులు స్మితాసభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్న చిన్న అనుబంధ శాఖలన్నింటిని ఒకే గొడుగు క్రిందకు తీసుకురావాలి.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించే క్రమంలో అన్ని శాఖలకు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకోవడానికి అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.
పునర్విభజన ప్రక్రియలో వీలైనంత వరకు అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.