శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే,

tsmagazine

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ జలాశయం నిల్వ సామర్థ్యంపై , మల్లన్నసాగర్‌ జలాశయం ప్రాంతంలో భూమి లోపలి పొరల్లో పగుళ్లు ఉన్నాయని,పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టి ఎం సి జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శకులు. 50 టి ఎం సి ల నీటిని నిలిపినందున ఆ బరువుకు భూకంపాలు రావచ్చునని సిద్ధాంతాలు వండి వారుస్తున్నారు.

విమర్శిస్తున్నవారు వారు ఈ రకమైన నిర్ధారణకు ఏ భూభౌతిక పరిశోధనల ఆధారంగా వచ్చినారో కానీ పేర్కొనలేదు. ఇది కూడా వారి ఊహాగానమే తప్ప శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి చేసిన నిర్ధారణ కాదు. వారు చెప్పినట్లు కూడెల్లి వాగు మల్లన్నసాగర్‌ డ్యాంకు బయట నుంచి సాగి పోతున్నది. డ్యాంలైన్‌ కి అతి దగ్గరగా ఉన్నప్పుడు దూరం 300 మీటర్లు ఉంటుంది. అదికూడా 34 కి మీ పొడవున ప్రవహించే కూడెల్లి వాగుకు ఈ స్థితి 5 కిమీ మాత్రమే ఉంటుంది. దీనివలన మల్లన్నసాగర్‌ డ్యాంకు ఏ ప్రమాదమూ లేదు.

డ్యాంని డిజైన్‌ చేసేటప్పుడు నీటి ఒత్తిడితో పాటు భూకంపాల నుండి విడుదల అయ్యే శక్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.డ్యాం నిర్మించేటప్పుడు పునాది (COT -Cut Off Trench) తవ్వుతారు. సమగ్రమైన భూభౌతిక పరిశోధనల అనంతరం సి ఒ టి ఎంత లోతుకు తవ్వాలో నిర్ధారిస్తారు. తవ్విన పునాదిలో నీటిని అతి తక్కువగా పీల్చుకునే గుణం కలిగిన మట్టినే నింపుతారు.ఆ తర్వాత అటువంటి మట్టితోనే Hearting/Core Zone ని నిర్మిస్తారు. 98 శాతం సాంద్రత (Procter Density) వచ్చేవరకు రోలర్స్‌ తో తొక్కిస్తారు. ఆ తర్వాత పైన గ్రావెల్‌ మట్టితో మిగతా మట్టికట్టను నిర్మించడం జరుగుతుంది. నీరుండే వైపున గ్రానైట్‌ రాళ్ళతో Revetment ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సాగునీటి శాఖ ఇంజనీరు మట్టి పరీక్షలు నిర్వహించి మట్టికట్ట నిర్మాణానికి పనికి వచ్చే క్వారీలను నిర్ధారిస్తున్నారు. డ్యాం లైన్‌ లో బోర్‌ హోల్‌ డాటాను సేకరించారు. ఈ డాటా ఆధారంగా సి ఒ టి ఎంత లోతుకు తవ్వాలో నిర్ధారించారు. మట్టికట్ట డిజైన్‌ ని నిర్ధారించారు. సి ఒ టి తవ్వకం మొదలైన తర్వాత బోర్‌ హోల్‌ డాటాతో సరిపోల్చుకుంటారు. ఎవైనా తేడాలు వస్తే డిజైన్లో మార్పులు జరుగుతాయి. ఇవన్ని జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారి అనుభవజ్ఞులైన జియాలజిస్టుల పర్యవేక్షణలోనే జరుగుతాయి. మల్లన్నసాగరే కాదు అన్ని డ్యాంలు , బ్యారేజీలు , చిన్న చెరువుల నిర్మాణం కూడా ఇదే పద్దతిలో జరుగుతుంది.

మల్లన్నసాగర్‌ మట్టికట్ట ఎత్తు 50 మీ పైనే ఉంటుంది కనుక ఇంజనీర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో ఇటువంటి ఎత్తైన మట్టికట్టల నిర్మాణం జరిగిన ప్రాజెక్టులకు వెళ్ళి అధ్యయనం చేసినారు. గతంలో రాయలసీమలో నిర్మించిన బ్రహ్మంగారి మఠం జలాశయాన్ని సందర్శించి వచ్చినారు. ఈశాన్య భారత జల విద్యుత్‌ కార్పోరేషన్‌ వారు మిజోరంలో తురియల్‌ నదిపై నిర్మిస్తున్న తురియల్‌ డ్యాంను సందర్శించి వచ్చినారు. ఎత్తైన మట్టికట్ట వలన ఉత్పన్నం కాబోయే సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి వాటిని అధిగమించడానికి ఇంజనీర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక డ్యాంకు సమాంతరంగా పగుళ్ళు కనిపిస్తున్నాయని మరో విమర్శ. మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతం మధ్యలో ఉన్న వేములఘాట్‌ గ్రామంలో ఉన్న కోమటి చెరువు, దాని కింద ఉన్ననల్ల చెరువులో ఈ పగుళ్ళ కారణంగా పెద్ద ఎత్తున నీరు బయటకు పోయి చెరువుల్లో నీటి నిల్వ వేగంగాతగ్గిపోయిన అనుభవాలు గతంలో ఎప్పుడూ లేవు. కాబట్టి ఇది ఊహాగానమే, అనుమానమే తప్ప వాస్తవం కాదు.

సాగునీటి శాఖ ఇంజనీర్లు ఏ ప్రాజేక్టునైనా మొదట సర్వే ఆఫ్‌ ఇండియా వారి చిత్ర పటాల (Topo Sheets) పైననే నిర్ధారిస్తారు. డ్యాం ఎత్తు, డ్యాం నిల్వ సామర్థ్యం, ముంపు ప్రాంతం ఎంత, ఏ ప్రాంతాలు ఆయకట్టు పరిధిలోకి వస్తాయి, కాలువల మార్గం , డ్యాం లైన్‌ తదితర ప్రాథమిక సాంకేతిక అంశాలు అన్నీ కూడా ఈ టోపో షీట్ల పైననే నిర్ధారిస్తారు. ఇప్పుడు వాటికి తోడూ గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌ వేర్‌ ని కూడా వినియోగిస్తున్నారు. ఆ తర్వాత సమగ్ర సర్వే నిర్వహించి ఆ సాంకేతిక అంశాలని స్థిరపరు స్తారు. ఆ సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనల్లో అవసరమైన మార్పులు, చేర్పులు జరుగుతాయి. మల్లన్నసాగర్‌ జలాశయం విషయంలో కూడా ఇదే పద్దతిలో ఇంజనీర్లు ప్రాజెక్టు ప్రతిపాదనల్ని రూపొందించి అధ్యయనం చేసినారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ చేత Reconnaisance LIDAR సర్వే నిర్వహించింది ప్రభుత్వం.వారి సర్వేలో ఎక్కడా జలాశయం ప్రాంతంలోగాని , కూడెల్లి వాగు పరివాహక ప్రాంతంలో గానీ పగుళ్ళు ఉన్నట్టు తేలలేదు.

డ్యాం ముంపు ప్రాంతంలో పగుళ్ళు ఉన్నదీ లేనిదీ పరిశీలించడానికి ప్రభుత్వానికిఎవరు చెప్పినా చెప్పక పోయినా డ్యాం నిర్మిస్తున్న స్థలంలో భూభౌతిక పరీక్షలు నిర్వహించడం ఒక తప్పనిసరి ప్రక్రియ. భూమి లోపల పగుళ్ళని రూల్‌ అవుట్‌ చేయడానికి మల్లన్నసాగర్‌ జలాశయం ప్రాంతంలో, బెంగళూరు లోని నేషనల్‌ ఇన్స్టిట్యుట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (NIRM), పూణే లో ఉన్న సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసర్చ్‌ స్టేషన్‌ (CWPRS) వారిచే సాగునీటి శాఖసమగ్ర సర్వే జరిపించింది. వారి పరిశోధనల్లో ఎటువంటి పగుళ్ళు లేవని తేలింది. డ్యాం నిర్మిస్తున్న స్థలంలో భూమి లోపలి పొరలు డ్యాం నిర్మాణానికి అనువుగా ఉన్నాయని వారు తెల్చినారు.

ఇక దేశంలో భూకంపాల చరిత్రను పరిశీలిస్తే తెలంగాణలో భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు. హిమాలయ పర్వత ప్రాంతం, వింధ్య పర్వతాలకు ఆవల ఉత్తరాన ఉండే ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ కనుమలు దేశంలో భూకంపాలకు నిలయంగా ఉన్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న దక్కన్‌ పీఠభూమిలోపల గట్టి రాతి పొరలతో నిర్మితమైన Sub Strata ఉన్నదని భూభౌతిక శాస్త్ర వేత్తలు నిర్ధారించినారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తవ్వుతున్న పంపు హౌజ్‌లు, సొరం గాల నుంచి బయటపడుతున్నగట్టి సాంద్రత కలిగిన గ్రానైట్‌ రాళ్ళు ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

భూకంపాలని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు దేశాన్ని మొత్తం 5 జోన్లుగా వర్గీకరించినారు. దక్కన్‌ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు లేనందున ఈ ప్రాంతాన్ని భూకంప ప్రాంతాల వర్గీకరణ చేసినప్పుడు అతి తక్కువ అవకాశాలు ఉన్న జోన్‌ 1,2,3లో చేర్చి నారు.అందులో 80 శాతం తెలంగాణా జోన్‌ 1,2 లో వుంటే 20 శాతం జోన్‌ 3 లో ఉన్నది. అత్యధిక భూకంపాలు సంభవించే అవకాశాలు జోన్‌ 4, 5 లోనే ఉన్నాయి. దేశంలో భూకంపాల చరిత్ర కూడా అదే నిరూపిస్తున్నది.

ఇక మల్లన్నసాగర్‌ నిర్మించబోతున్న సిద్ధిపేటజిల్లా జోన్‌ 2 లో ఉన్నదన్న సంగతి ప్రజలు గమనించాలి.(పటాన్ని చూడగలరు)ఇకపోతే, మహారాష్ట్రాలో సతారా జిల్లాలో నిర్మించిన కోయ్నా డ్యాం పగుళ్ళు ఉన్న ప్రాంతంలో నిర్మించినందున నీటి బరువుకు అక్కడ భూకంపం వచ్చిందన్నది మరో విమర్శ. అక్కడభూమి పొరల్లో స్వల్ప కదలికలు ఏర్పడిన మాట వాస్తవమే కాని ఆ కదలికలు నీటి నిల్వ కారణంగానే ఏర్పడిందని స్పష్టమైన నిర్ధారణకు శాస్త్రవేత్తలు రాలేదు. కోయ్నా డ్యాం పశ్చిమ కనుమల్లో ఉన్నది.కోయ్నా డ్యాం ఉన్న ప్రాంతం జోన్‌ 4 లో ఉన్నందున భూమి లోపల పొరల్లో కదలికల కారణంగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువే. అయితే ఆ ప్రాంతంలో 1967 లో వచ్చిన భూ కదలికల కారణంగా కోయ్నా డ్యాం బ్రేక్‌ కాలేదు. చిన్నపాటి పగుళ్ళు మాత్రమే వచ్చినాయి. ఆ పగుళ్ళను సిమెంట్‌ గ్రౌటింగ్‌ ద్వారా మూసివేసినారు.ఏ విపత్తు సంభవించలేదు. కోయ్నా డ్యాం నిశ్చలంగా 50 ఏండ్లుగా నిలబడి ఉన్నది. 1964 లో నిర్మాణం పూర్తి చేసుకున్న కోయ్నా డ్యాం 93 టి ఎం సి ల నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నది.మహారాష్టాకు 1960 మెగా వాట్ల జలవిద్యుత్‌ ను సరఫరా చేస్తున్నది. కోయ్నా డ్యాం ఉన్న పరిస్థితిని మల్లన్నసాగర్‌ ఉన్న భూభౌతిక పరిస్థితులకు పోల్చి ఇది ప్రమాదకరమైనదని చెప్పడం ప్రజలని అయోమయంలోనికి నెట్టివేయడమే.

డ్యాంలని నదికి అడ్డంగా నిర్మించడమే కాదు నది లేని చోట కూడా నిర్మించడం కొత్త ఏమీ కాదు. ఎక్కడో ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే నది లేని చోట ,లేదా చిన్నవాగులపై అవి సమకూర్చే నీటి పరిమాణం (Yeild) కంటే ఎన్నో రేట్లు ఎక్కువ నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయాలు రాయలసీమలో ఉన్నాయి. ఇంతకు ముందు పేర్కొన్న బ్రహ్మంగారి మఠం జలాశయం ఆ కోవలోనిదే. వాటి వివరాలు కింద పేర్కొంటున్నాను.

కండలేరు – 68 TMC గోరకల్లు – 10 TMC, వెలిగొండ – 41 TMC , వెలుగోడు -17 TMC, బ్రహ్మంగారి మఠం – 17 TMC, అవుకు – 7 TMC , అలుగునూరు – 3 TMC.
ఇవన్నీ నదులు లేని చోట నిర్మించినవి కావా? అవసరమైతే కృత్రిమ జలాశయాలు నిర్మించుకోవాలంటూ CWC  రాష్ట్ర ప్రభు త్వా నికి సూచన చేసింది.ఎత్తిపోతల పథకాలలో పెద్ద జలాశయాల నిర్మాణం అత్యంత అవసరం. సి డబ్ల్యు సి సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టులో ఆన్‌ లైన్‌ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 16 TMC ల నుండి 141 TMC లకు పెంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే మల్లన్నసాగర్‌ నిల్వ సామర్థ్యాన్ని 50ువీజలతో రీడిజైన్‌ చేయడం ప్రాజెక్టు అవసరాల రీత్యా తప్పనిసరి అయ్యింది. తెలంగాణాకు జీవధారగా మారనున్న కాళేశ్వరంప్రాజెక్టుని అడ్డుకునే ప్రయత్నాలను వమ్ము చేసి ప్రాజెక్టు లక్ష్యాలను సాధించే కృషిలో తెలంగాణా ఇంజనీర్లు తమ మేధస్సును, చెమటను ధారపోస్తున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తున్నది.

Other Updates