maga

ఆకుపచ్చని తెలంగాణ సాధనే లక్ష్యంగా మొదలైన తెలంగాణకు హరితహారం మూడో ఏట అడుగుపెట్టింది. ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరో సామాజిక ఉద్యమం చేస్తోంది . అదే ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వప్నించిన కల తెలంగాణకు హరితహారం. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలి అనే ఉద్యమం ఇప్పుడు మూడో ఏట అడుగు పెట్టింది. ఈ యేడాది వరుణుడి కరుణ బాగానే ఉండటం, అనుకూలమైన వాతావరణం ఉండటంతో 40 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాం.

గత రెండేళ్ల అనుభవాల నుంచి నేర్చిన పాఠాలతో ఊరూ వాడా జూలై పన్నెండు నుంచి మూడో విడత హరితహారంలో పాల్గొంటోంది. కరీంనగర్‌ పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి హరితహారం లక్ష్యాలు,ఉద్దేశ్యాలను మరోసారి ప్రజలకు వివరించారు. కన్న బిడ్డల్లాగా మొక్కలను ఎందుకు సాకాలి అన్న విషయాన్ని విడమరిచి చెప్పారు. మన పిల్లలకు ఆస్తులు, సంపద ఇవ్వటం ముఖ్యంకాదు. మంచి వాతావరణంలో బతికేలా చేయాలి. ఇచ్చిన ఆస్తులను అనుభవించే వాతావరణం, పర్యావరణం ఇస్తేనే సార్థకత అని కే.సీ.ఆర్‌ చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. మొక్కలను పెంచే ప్రాధాన్యతను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పటం కోసం కరీంనగర్‌ ఆడబిడ్డలకు దండం పెట్టి , పాదాభివందనం చేసి చేప్తున్నా హరిత తెలంగాణ సాదిద్దాం అంటూ అభ్యర్థించారు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి మొక్కలను నాటండి, చెట్లు పెంచండి అంటూ ఇలా చెప్పటం గతంలో భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీనో, ఆ తర్వాత చేసిన వాగ్థానాన్నో నెరవేర్చడంలో ఆలస్యం అయితే.. ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రజలు ప్రశ్నించటం చూస్తుంటాం. రేషన్‌ కార్డు రాలేదనో, ఇల్లు మంజూరు కాలేదనో, పెన్షన్‌ ఇంకా పెండింగ్‌ అనో అసంతృప్తులు చాలా సార్లు మనందరమూ గతంలో చూసి ఉంటాం. ఇలాంటివి రాలేదనే కారణంతో ఓటు వేయడాన్ని నిరాకరిస్తున్నాం అంటూ చెప్పిన సందర్భాలూ చూశాం. కానీ మొక్క నాటలేదు, చెట్టు పెంచలేదనే వాదనలు ఎప్పుడూ వినలేదు. అలా అని ఎవరూ అడగలేదు కూడా.

కానీ ఎన్నికలకు ముందు టి.ఆర్‌.ఎస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు, ఆ తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం.. తెలంగాణ సమాజపు మంచి భవిష్యత్తును, భావి తరాలు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలనే విశాల ఆకాంక్షను కోరుకుంటున్నది. అందుకే తెలంగాణకు హరితహారం అనే వినూత్న పథకాన్ని చేపట్టింది. ఇతర ప్రభుత్వాలు, రాష్ట్రాలు తలుచుకుంటేనే దడపుట్టే లక్ష్యాన్ని తనకు తానుగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 2015లో ముఖ్యమంత్రి తెలంగాణకు హరితహారానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి 40 కోట్ల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. ఈ భూమిపై 33 శాతం పచ్చదనం ఉంటే ప్రకృతి సమతుల్యం సాధ్యం అన్న సూత్రం ఆధారంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 24 శాతం పచ్చదన్నాన్ని 33 శాతానికి పెంచటమే హరితహారం లక్ష్యం. క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్టు అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వే ప్రకారం కెనడాలో అత్యధికంగా మనిషికి 8,953 చెట్లుంటే, రష్యాలో 4,461, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉన్నాయి. కానీ భారత చేశంలో మాత్రం మనిషికి సగటున 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టి పర్యావరణ పరంగా మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అర్థం అవుతోంది.

అభివృద్ధి విస్తరణ పేరుతో అడవులను, చెట్లను నరికేస్తూ వెళ్తున్న మనం ఒక్క మొక్కను నాటడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదు. మనను పెంచి పోషించే ప్రాణవాయువును ఇచ్చే చెట్టును పెంచటంలో మనకు కనీస అవగాహన ఉండటంలేదు. రానున్న రోజుల్లో ఇది ఎంత ప్రమాదకరమో ఊహించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ భవిష్యత్‌ తరాల కోసం తెలంగాణకు హరితహారాన్ని స్వప్నించారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా, రోడ్ల వెంట ప్రయాణం చేసినా అడవిలో వెళ్లినట్లుగా, నందనవనంలో విహరించినట్లుగా ఉండాలనే సంకల్పాన్ని తీసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ కల కొంతమేర సాకారమైంది. ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది సరిపోదు.. ప్రజలు, సమాజం, అన్ని సమూహాలు మరింత చైతన్యవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటడమే కాదు, అవి బతికేలా సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అందుకే హరిత తెలంగాణ కోసం మీరు, మేము, మనందరమూ కలిసి పనిచేయాలనేది కెే.సీ.ఆర్‌ ఆకాంక్ష. తన స్వప్నాన్ని, హరిత తెలంగాణ సాధన లక్ష్యాన్ని అవకాశం ఉన్న ప్రతీసారీ ఆయన అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు నూరిపోస్తున్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లోనే తెలంగాణకు హరితహారం మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం. గోబి ఎడారి విస్తరణను అడ్డుకునేందుకు చైనా గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ చైనా పేరిట 4,500 కిలోమీటర్ల పొడుగునా భారీ స్థాయిలో మొక్కల పెంపకాన్ని చేపట్టింది. ఇక బ్రెజిల్‌ లో అమెజాన్‌ అడవుల్లో నరికివేసిన చెట్లకు పరిహారంగా కోటి మొక్కల పెంపకాన్ని ఆ దేశం మొదలుపెట్టింది. ఇక మూడోది తెలంగాణ తల్లికి ఆకుపచ్చని హారం వేయాలనే సంకల్పంలోంచి పుట్టిన తెలంగాణకు హరితహారం.

ఇంతటి భారీ ప్రాజెక్టును తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తొలి రెండేళ్లలో మంచి ఫలితాలనే రాబట్టింది. 230 కోట్లలో 120 కోట్లను అడవి కాకుండా బయట ప్రాంతాల్లో నాటాలనే లక్ష్యం. అదే విధంగా అటవీ భూముల్లో 100 కోట్ల మొక్కలు నాటడం, లేదంటే సహజ సిద్ధమైన అటవీ పర్యావరణాన్ని కాపాడుతూ అటవీ విస్తరణకు అవసరమైన మొక్కలు, చెట్ల పునరుత్పత్తి జరిగేలా చూడటం. ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతూ, కాంక్రీట్‌ జంగిల్‌ గా మారుతున్న రాజధాని హైదరాబాద్‌ ను మళ్లీ పచ్చదనం లోగిలిగా మార్చేందుకు జి.హెచ్‌.ఎం.సి, హెచ్‌.ఎం.డి.ఎ ల పరిధిలో పది కోట్ల మొక్కలు నాటేలా పథకం రూపకల్పన జరిగింది. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ యేటా ఒక్కో గ్రామంలో 40 వేల మొక్కలు, ప్రతీ నియోజక వర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలనేది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. దీనిలో భాగంగా 2015లో 15.86 కోట్ల మొక్కలు నాటారు. ఆ యేడాది ప్రకృతి పెద్దగా అనుకూలించక పోవటం, వానలు లేకపోవటంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇక రెండో యేడాది 2016లో 31.67 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. ఈ రెండేళ్లలో నాటిన మొక్కల్లో చాలా వరకు పెరిగి పచ్చదనాన్ని విస్తరిస్తున్నాయి. ఈయేడాది 2925 నర్సరీల్లో 42 కోట్ల మొక్కలను అటవీ శాఖతో పాటు గ్రామీణాభివృద్ది, హార్టీ కల్చర్‌ శాఖలు సిద్ధం చేశాయి. వానలు రావాలి, వనాలు పెరగాలి, కోతులు మళ్లీ వనాలకు వాసప్‌ పోవాలనే నినాదంతో మొదలైన హరితహారం, ఫలితాలు ఇచ్చే దశ ఈ యేడాది నుంచే ఆరంభం అని చెప్పుకోక తప్పదు.

మూడో యేడాది ఇప్పటికే మంచి వర్షాలు పడుతుండటం, అనుకూల వాతావరణంలో పెట్టుకున్న 40 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఊరూ, వాడా పచ్చటి రణం చేస్తున్నాయి. గత రెండేళ్లలో మొక్కల సంరక్షణలో కొన్ని ప్రాంతాల్లో విఫలం అయ్యారనే సమాచారం రావటంతో ఈ సారి పకడ్బందీగా ప్రభుత్వం ముందుకు పోతోంది. మొక్క పెట్టుడు, లెక్కలు రాసుడు అనే మైండ్‌ సెట్‌ నుంచి బయటపడి పెట్టిన ప్రతీ మొక్క బతికేలా చర్యలకు ఈ సారి ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరమైతే బహిరంగ ప్రాంతాల్లో ఒకే చోట భారీ మొక్కలు నాటే బ్లాక్‌ ప్లాంటేషన్‌ లాంటి వాటికి ప్రత్యేకంగా నిధులు ఇస్తూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు, దారుల వెంట నాటే మొక్కల రక్షణ కోసం తప్పని సరిగా ట్రీ గార్డులను మొక్కనాటిన వెంటనే ఏర్పాటు చేయాలనే నియమాన్ని పెట్టుకున్నారు. ఉపాధి హామీ కూలీలను, నిధులను భాగస్వామ్యం చేస్తూ ముళ్ల కంచెలు, లభ్యత ఉన్న చోట వెదురు గార్డులను ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రహదారులకు ఇరువైపులా అభివద్ది చేస్తున్న ఎవెన్యూ ప్లాంటేషన్‌ గురించి. తెలంగాణలో ఏ ప్రాంతానికి రోడ్డు మార్గంలో వెళ్లినా ప్రకృతిలో ప్రయాణం చేసినట్లుగా ఉండాలనేది సీ.ఎం ఆదేశం. దీనిని అమలు చేస్తోంది అటవీ శాఖ. ఎవెన్యూ ప్లాంటేషన్‌ను అటవీశాఖ ఫేస్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌గా చెప్పుకుంటూ పనిచేస్తోంది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రాజీవ్‌ రహదారి, హైదరాబాద్‌ నుంచి విజయవాడ, హైదరాబాద్‌ – బెంగుళూరు జాతీయ రహదారుల్లో ఈ ఎవెన్యూ ప్లాంటేషన్‌ ఇప్పుడు చూడ చక్కగా మారుతోంది. మరికొన్ని సంవత్సరాల్లో ఈ పచ్చదనం, రంగురంగుల పూలతో తెలంగాణ రోడ్లు మరింత శోభాయమానంగా మారటం మనం చూడబోతున్నాం. క్రమంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను రాష్ట్ర రహదారుల్లో కూడా చేపట్టేందుకు అటవీ శాఖ సిద్ధమౌతోంది.

రామాయంపేట దగ్గర 20 కిలో మీటర్ల మేర చేపట్టిన ప్లాంటేషన్‌ మొదటి యేడాదిలోనే చక్కగా పెరిగి ఆకట్టుకుంటోంది. రోడ్ల వెంట ప్రయాణంలో నీడను ఇవ్వటంతో పాటు, రంగు రంగుల పూల మొక్కలతో ప్రయాణీకులకు అహ్లాదాన్ని పంచటం కూడా ఈ ఎవెన్యూ ప్లాంటేషన్‌ ప్రత్యేకత. ఇక హైదరాబాద్‌ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాక్‌లను అలాగే వదిలి వేయకుండా, అటవీ శాఖ చూడచక్కని అర్బన్‌ స్పేస్‌లుగా వాటిని అభివద్ధి చేసింది. నిత్యం బిజీగా, ట్రాఫిక్‌ రణగొణధ్వనుల మధ్య ఉండే నగర వాసి ఉదయం, సాయంత్రం నడకకో, కాసేపు సేద తీరేందుకో వీటిలో అడుగు పెడితే పచ్చని ప్రకతి, అందమైన లాన్లు స్వాగతం చెప్పటం ఖాయం. ఈ పనులకు తగినట్లుగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించింది. తెలంగాణలో గతంలో 28 ఫారెస్ట్‌ డివిజన్లు ఉంటే వాటిని 52కు పెంచింది. రేంజ్‌ లను 106 నుంచి 186కు, అటవీ సెక్షన్లను 469 నుంచి 831కి పెంచారు. ఫారెస్ట్‌ బీట్లను 1428 నుంచి 3132కు పెంచారు. ఇక అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేయటంతో పాటు పెరిగిన అవసరాల కోసం కొత్తగా 67 రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు, 90 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు, 1857 బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు, మరో 44 ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది.

మొత్తంమీద పుట్టినప్పుడు ఊయల, చనిపోయినప్పుడు పాడే రెండూ కట్టెతోనే తయారవుతాయి.. దీన్ని బట్టే చెట్టుతో మనిషికున్న బంధం అర్థం అవుతుంది. అభివద్ది పేరుతో చెట్లను నరుకుతూ పోతే.. మనం చెప్పుకుంటున్న అభివద్ది కూర్చున్న చెట్టును నరుక్కోవడమే. ఆ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు మన చుట్టూ ప్రపంచాన్ని పచ్చగా చేసుకోవటంతో పాటు, రానున్న తరాలకు ఆకు పచ్చని తెలంగాణాను బహుమతిగా ఇవ్వాలని చెబుతున్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరూ జాగృతంగా ఉండాలని నూరిపోస్తున్నారు. హరితహారంలో పాల్గొని పచ్చదనం కోసం పాటుపడే వ్యక్తులను, సంస్థలను ప్రోత్సహించేందుకు హరిత మిత్ర అవార్డులను ఈ యేడాది భారీ సంఖ్యలో ప్రకటించారు. 15 కోట్ల రూపాయలతో విభిన్న రంగాల్లో 523 హరిత అవార్డులకు రంగం సిద్ద్ధమైంది. వ్యక్తిగతంగా లక్ష రూపాయలు మొదలు సంస్థలకు 15 లక్షల రూపాయల దాకా నగదు ప్రోత్సాహకాలు హరిత తెలంగాణ కోసం పనిచేసేవారికి ఇవ్వనుంది ప్రభుత్వం.

అందుకే మానవ ప్రగతికి అభివద్ది, సంక్షేమం ఎంత ముఖ్యమో హరితం కూడా అంతే ముఖ్యం. దీనికోసమే తెలంగాణకు హరితహారం. మీరు, మేము, మనందరం కలిసి మొక్కలు నాటుదాం. వాటిని రక్షిద్దాం. హరిత తెలంగాణ సాధిద్దాం.

maga

మనిషికి రెండు మొక్కలు నాటాలి

హరితహారం ప్రారంభసభలో సి.ఎం.

వేదికను అలంకరించిన పెద్దలు, ప్రజా ప్రతినిధులు, సభకు హాజరైన అందరికీ ఆకుపచ్చ హరితాభివందనాలు. ఏదో ఉపన్యాసం లాగా మాట్లాడితే తమాషాలాగా ఉంటది. మనిషికి రెండు చెట్లు పెట్టి రాష్ట్ర మంతా పచ్చగా ఉండేలా చేయాలి. మానేరు డ్యామ్‌ నుంచి వేలాది మంది నాకు స్వాగతం చెప్పారు. మేధో సంపత్తి గల గడ్డ కరీంనగర్‌. రచయితలు, విద్యార్థులు, మేథావులకు కరీంనగర్‌ పెట్టిందిపేరు. ఈ పట్టణానికి చాలా చరిత్ర ఉంది. ఈ మీటింగ్‌ టీవీల్లో లైవ్‌ టెలికాస్ట్‌ వస్తోంది. కరీంనగర్‌ బిడ్డలకు , అక్కాచెల్లెళ్లకు నేను దండం పెట్టి, పాదాభివందనం చేసి చెప్తున్నా.

ఇంట్లో పిల్లల్ని పెంచినట్లు, ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి, మన పిల్లలకు మనకున్నఆస్తి ఇవ్వడంతోనే సరిపోదు. ఆ ఆస్తితోపాటు బతికే పరిస్థితి కూడా కల్పించాలి, ఆస్తిని అనుభవించే వాతావరణం పర్యావరణం కూడా మనం ఇవ్వాలి. లేకపోతే జీవితాలు వ్యర్థంఅవుతాయి. మొక్కలు పెంచడం అంటే మన సొంతపని, ఇంటిపని అనుకోవాలి. మనిషి జీవితమంతా అడుగడుగునా చెట్టుతోనే పెనవేసుకుని ఉంది. మనం పుట్టినప్పుడు కట్టే ఊయల, చనిపోయినప్పుడు మోసే పాడే కూడా కట్టెతోనే చేస్తారు. వాతావరణ శాఖ చెప్పినదాన్ని బట్టి అద్భుతమైన వర్షాలు పడతాయి. చాలా సంతోషం, ప్రకతిని పూజిస్తేనే మనకు దీవెన. చెట్లు ఎక్కడుంటే అక్కడ ప్రకృతి హర్షిస్తుంది, వర్షిస్తుంది.

కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ హరితహారం కార్యక్రమం తప్పకుండా ప్రకృతి దీవెనలతో రాబోయే పదిరోజులు వర్షాలు పడి చెరువులు నిండి, వాగు వంకలు నిండి మనం పెట్టే ప్రతి మొక్కా బతుకుతుందని ఆశిస్తున్నా. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌రెడ్డిలు మంచి శ్రద్ధ తీసుకుని హరితహారం నిర్వహిస్తున్నారు. పట్టణంలో 25 వేల మొక్కలను నాటుతున్న పోలీసులను అభినందిస్తున్నా. నేను మాట్లాడుతుంటే ఇక్కడ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ , ఎమ్మెల్యే కమలాకర్‌, కార్పొరేటర్లు చప్పట్లు కొడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచినవారు నేలవిడిచిసాముచేయడం సరికాదు. ప్రజాసేవ అంటే ఎక్కడో ఆకాశంలోంచి చేయరు. ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకుంటే కరీంనగర్‌ పచ్చబడదా? ప్రతి ఇంట్లో తల్లిని, చెల్లిని, ఇంట్లో ఎందరుంటే అందరితో చెట్లు నాటించాలి. ఈటల రాజేందర్‌ను కోరుతున్నా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరిట మొక్కలు ఇవ్వండి. వాళ్లే ఆ మొక్కలు సాదాలి. వాటి బాధ్యత ఆ కుటుంబానిదే. రెండేళ్లలో కరీంనగర్‌ లో ఎక్కడ చూసిన పచ్చదనం కళ్లకు కనపడాలి. మళ్లీ నేను హెలీకాఫ్టర్‌లో వస్తే ఊరు కంటే ఎక్కువగా చెట్లే కనబడాలి. చెట్లు పెంచటం అంటే ఆషామాషీగా చేయొద్దు. చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి. నేను కరీంనగర్‌ నుంచి ఏ పని చేపట్టినా విజయం సాధించాం. ఎవ్వరూ రాదనుకున్న తెలంగాణను పట్టుబట్టి సాధించినం. ఇగ పచ్చదనం తెచ్చుకోలేమా. నా పని కాదు ఇది, గవర్నమెంటోళ్లదిఅని ఎవరూ అనుకోవద్దు. చెట్లు పెంచటం ఒక బాధ్యతగా తీసుకోవాలి. వచ్చే జూన్‌ నాటికి అత్యధికంగా లాభపడే జిల్లా కరీంనగర్‌. దేశంలోనే గొప్పగా కరీంనగర్‌ తయారౌతుంది. అతి తక్కువ సమయంలోనే కరెంట్‌ సమస్యను అధిగమించాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఏటా రెండు పంటలు పండుతాయి. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం. భూమిలో తేమశాతం పెరగాలి, చెట్లు పెరగాలి, పశు పక్ష్యాదులు పెరగాలి. కరువు నివారణ కోసమే హరితహారం.

తెచ్చుకున్న తెలంగాణ బాగుపడాలంటే పునాదుల నుంచే కార్యక్రమం ప్రారంభం కావాలె. పచ్చదనం లేకపోతే, మీరంతా చూస్తున్నారు ఎండాకాలంలో 45, 46డిగ్రీల టెంపరేచర్‌కు పోతోంది. ఇది మానవాళి మనుగడకు మంచిది కాదు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమం, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం పట్టుబడితే తెలంగాణను పచ్చబర్చాలంటే ప్రతిజ్ఞ చేయాలి. సమాజంపై శ్రద్ధ ఉన్నవారంతా దీనికి పూనుకోవాలి. ప్రతీ ఊరికి గ్రీన్‌ బ్రిగేడ్‌ ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామంలో, ప్రతీ పట్టణంలో, ప్రతీ వార్డులో గ్రీన్‌ బ్రిగేడ్‌ ఉండాలి. ఈ బ్రిగేడే మొక్కలు నాటడం, పెంచటం బాధ్యత తీసుకోవాలి. పచ్చదనాన్ని బాధ్యతగా తీసుకుని హరితహారం చేపట్టిన వారికి 523 హరిత మిత్ర అవార్డులు అందిస్తాం. దీనిలో ఉత్తమ గ్రామ పంచాయితీకి రూ.5 లక్షలు, ఉత్తమ మండలానికి రూ.8 లక్షలు, ఉత్తమ వార్డుకు రూ. 5 లక్షలు, ఉత్తమ ప్రాథమిక పాఠశాలకు రూ.2 లక్షలు, ఉత్తమ ఉన్నత పాఠశాల రూ.2లక్షలు, ఉత్తమ కాలేజీలు, ప్రభుత్వ శాఖలకు కూడా తలా రూ.2 లక్షల అవార్డు ఇస్తాం.

ఉత్తమ ప్రజాప్రతినిధికి రూపాయలు లక్ష

ఉత్తమ అటవీ అధికారి, ఉత్తమ గ్రామాభివృద్ది అధికారికి రూ. లక్షచొప్పున అవార్డు, ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రజలకు కూడా అవార్డులు ఇస్తాం. పచ్చదనం కోసం పాటుపడే అందరినీ ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో మొత్తం 15 కోట్ల రూపాయల విలువైన అవార్డులు ఇవ్వబోతున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కేటగిరీల్లో ఈ అవార్డులను అందిస్తాం.

భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలంతా నా మాట మన్నించి, నా వెంట నిలిచి రాష్ట్రం సాధించుకున్నాం. అందుకే శపథం చేసిన. కోటి ఎకరా లకు సాగునీళ్లు పారేదాకా ప్రభుత్వం నిద్రపోదు. అప్పుల్లో కూరుకుపోయిన రైతాంగం బాగుపడాలంటే ఒక్క రుణమాఫీమాత్రమే సరిపోదు. అందుకే వచ్చే యేడాది నుంచి ఎకరానికి రూ. 8 వేల చొప్పున పెట్టుబడి ఇవ్వ బోతున్నాం. ఇది విప్లవాత్మక నిర్ణయం. ఉమ్మడి రాష్ట్రంలో దగాపడిన రైతులు తమ చేతుల మీదుగా మళ్లీ గంగిరెద్దుల వాళ్లకు దానం చేసే పరిస్థితి రావాలి. రూ.43 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం, దీనితో తెలంగాణకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరిపోతుంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. 93 లక్షల మందికి రేషన్‌ కార్డులు అందించాం.ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గొర్రెల పంపిణీ చేపట్టాం. లక్షా 25 వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేయబోతున్నాం. పిల్లలను చెడగొట్టే మాదక ద్రవ్యాలను తరిమికొట్టే పనిపెట్టుకున్నాం.

ఎవరు ఏం చేసినా సరే.. మీ దీవెన ఉన్నంత కాలం ఏమీ కాదు. ఆకు పచ్చని తెలంగాణ సాధించేదాకా విశ్రమించేది లేదు. ఇక్కడ మంచి ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వాళ్ల సేవ తీసుకుని మీరంతా ముందుకు వెళ్లాలి. కరీంనగర్‌ కు మానేరు టూరిజం ప్రాజెక్టును మంజూరు చేసినం. కరీంనగర్‌ ను లండన్‌ చేస్తా అని గతంలో చెప్పిన అది వంద శాతం చేసి తీరుతా. ఈ పట్టణానికి ఆ అర్హత ఉన్నది. కరీంనగర్‌ కు ఒక టౌన్‌ హాల్‌ లేదు. త్వరలోనే 25 కోట్ల నిధులతో కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే కరీంనగర్‌ కళాభారతిని నిర్మిస్తాం. ఇది ఈ పట్టణానికి ఒక మంచి కానుక. కరీంనగర్‌ దీవెన తెలంగాణ తెచ్చేదాకా నన్ను నడిపించింది. ఇవాళ హరితహారానికి కూడా అలాంటి దీవెనే కావాలి. మంచి సంకేతం పోవాలే. మంచి పనులు కావాలే. రెండేళ్ల తర్వాత కరీంనగర్‌లో దిగుతుంటే అడవిలో దిగుతున్నామా అనే భావన రావాలె.

అక్క చెల్లెళ్లకు మరో సారి పాదాభివందనం చేసి చెప్తున్నా. మీ ఇంటి ముందు, వెనకాల మొక్కలు నాటుండ్రి. వాటిని చక్కగా పెంచి కరీంనగర్‌ ను హరిత కరీంనగర్‌గా మార్చండి. మిగతా రాష్ట్రమంతా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. హరిత హారం విజయవంతం ఇక్కడ నుంచే మొదలుకావాలి.

జై తెలంగాణ

శ్రీకాంత్ బందు

 

Other Updates