మేయర్‌లకు శ్రీ కేసిఆర్ ఉద్భోధ
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమీషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఫిబ్రవరి 14న నగరంలోని టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపు నిచ్చారు. నగరాలలో, పట్టణాలలో పేదల బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయని వారికి దశలవారిగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పట్టణాలు, నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు మంచినీరు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు, ప్రతి మనిషికి 135 లీటర్ల నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నీటిని పంపే బాధ్యత మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉండే సమస్యల అధ్యయనానికి కాబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సి.ఎం. చెప్పారు. మున్సిపల్ చైర్మన్‌గా ఒక్కసారి ఎన్నికైతే ఐదేళ్లవరకు తొలగించకుండా చట్టం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న, ఇంద్రకరన్ రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శులు జలగం వెంకట్రావు, శ్రీనివాస్ గౌడ్, వినయ్ భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎం.జి. గోపాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.