తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబరు 21న వరంగల్ జిల్లాలోని కొమురవెళ్ళి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మల్లికార్జునస్వామి కల్యాణం సందర్భంగా ప్రభుత్వం వైపు నుండి ముత్యాల తలువాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కురుమ భవన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మల్లికార్జునస్వామి దేవస్థానానికి భూమిలేదని, భూమి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇక్కడ భక్తులకు వసతి గృహాలు నిర్మించడానికి నిధులు మంజూరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని నగరంలో దొడ్డి కొమురయ్య పేర భవనం లేకపోవడం వెలితిగా ఉందన్నారు. ఆ వెలితిని తీర్చడానికి ఎకరం భూమిని నగరంలో కెటాయించడంతో పాటు రూ. 5 కోట్లతో భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. శంకుస్థాపన జరిగేరోజు హైదరాబాద్‌లో నగరమంతా ఒకటయ్యే విధంగా పెద్ద ఎత్తున ఊరేగింపుతో వెళ్ళి శంకుస్థాపన చేసుకోవాలన్నారు. కురుమలు రాజకీయంగా ఎదగాలన్నారు. వారిలో ఎంతో మేధాశక్తి దాగి ఉందన్నారు. దాన్ని వెలికితీసి సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. విద్య విషయంలో కూడా వెనకబడి ఉన్నారని, ఎక్కువమంది విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపిలు బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘గుట్ట’ అభివృద్ధి పనులు వేగవంతం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు డిసెంబరు 17న దేవాలయ అతిథి గృహంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు డిసెంబరు 18నుంచే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి కావలసిన రెండువేల ఎకరాల భూముల సేకరణ విషయంతోపాటు, అక్కడ నిర్మించతలపెట్టిన ధర్మశాలలు, అభయారణ్యం, జింకలపార్కు, ఉద్యానవనాలు, కల్యాణ మంటపాలు, రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకూ రోప్‌వే, రాయగిరి చెరువు కట్టను మినీటాంక్ బండ్‌గా తీర్చిదిద్దడం వంటి పలు అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
ప్రస్తుతం 20 అడుగులుగా ఉన్న ఆలయ గాలిగోపురాన్ని మరో 19 అడుగుల ఎత్తు పెంచి, స్వర్ణతాపడం చేయాలని, గర్భగుడిని మరింతగా విస్తరించాలని, యాదగిరిగుట్టపై భారీ ఎత్తున ఆంజనేయస్వామి, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు.
యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ సీఈవో కిషన్‌రావు, దేవాలయ ఈవో గీతారెడ్డి, ప్రధాన అర్చకులు నల్లం తీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, తదితరులతో ఆలయం లోపల, వెలుపల చేపట్టగల అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.