ఆరోగ్య బీహార్ కోసం తెలంగాణకు వచ్చాను. ఇక్కడ అమలు అవుతున్న వైద్య ఆరోగ్య పథకాలు అద్భుతంగా ఉన్నాయి. వీటిని మా రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తాం. అలాగే మహిళలు, పిల్లల కోసం చేపట్టిన పథకాలు బాగున్నాయి. ట్రామా సెంటర్లు కూడా. కేసీఆర్ కిట్ల పథకం అద్భుతంగా ఉంది. ఒక కిట్‌ని నా వెంట తీసుకెళుతున్నా. అన్నారు బీహార్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే. తెలంగాణలో అమలవుతున్న వివిధ పథకాలను పరిశీలించడానికి వచ్చిన పాండేకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా బీహార్ మంత్రి కేసీఆర్ కిట్ ప్రాజెక్ట్‌పై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రణాళికలు, అమలు చేస్తున్న వివిధ పథకాల, కేసీఆర్ కిట్ల పథకం అమలు, నిధులు, విధులు వంటి పలు అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు జరిగాయి. కాగా, ఒక్కో పథకం, రూపకల్పన, అమలు తీరుని సునిశితంగా పరిశీలించారు బీహార్ వైద్య శాఖ మంత్రి మంగళ పాండే. తమ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను వివరిస్తూ, సరిపోల్చుకుంటూ మన రాష్ట్రంలో అమలు అవుతున్న వైద్య ఆరోగ్య శాఖ పథకాలను అభినందించారు. హాస్పిటల్స్, డాక్టర్లు, వైద్య, విద్య, నర్సింగ్, మందులు, తయారీ, వితరణ, మందుల బడ్జెట్ వంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, టీకా బండి, అమ్మ ఒడి, 102 వాహనం, 108 వాహనం, పార్థివ వాహనాలను మంత్రి మంగళ్ పాండే పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా మార్చడానికి అనేక రాష్ట్రాలు రకరకాల వైద్య ఆరోగ్య పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. మా బీహార్లోనూ రకరాల పథకాలు అమలు అవుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ మధ్య వినూత్న పథకాలు అమలు అవుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఒకసారి వాటిని పరిశీలిద్దామని హైదరాబాద్ వచ్చామన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ఆరోగ్య పథకాలను తెలుసుకున్నామన్నారు. ఇక్కడ పథకాలు నిజంగా బాగున్నాయి. వీటిలో కొన్నింటిని మేం కూడా మా రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. అయితే, పిల్లలు, మహిళల కోసం చేపట్టిన పథకాలు చాల బాగున్నాయన్నారు. ఈ మధ్య రూపొందించిన కేసీఆర్ కిట్ల పథకాన్ని బీహార్ వైద్య ఆరోగ్యమంత్రి మంగళ్ పాండే అభినందించారు. ఆ పథకం ఏ విధంగా రూపొందించారు? మహిళలు, పిల్లలు ఏ విధంగా ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారనే అంశాలను తెలుసుకున్నామన్నారు. ఈ సందర్భంగా తాను ఒక కేసీఆర్ కిట్‌ను వెంట తీసుకెళుతున్నట్లు మంత్రి చెప్పారు.
అధ్యయనానికి త్వరలో హైదరాబాద్‌కు బీహార్ అధికారుల బృందం
తెలంగాణలో అమలవుతున్న వైద్య ఆరోగ్య పథకాలను లోతైన అధ్యయనం చేయడం కోసం బీహార్ అధికారుల బృందాన్ని త్వరలో హైదరాబాద్‌లో పర్యటించనున్నదని బీహార్ మంత్రి తెలిపారు. ఆ బృందం మరింత లోతుగా ఆయా పథకాలను పరిశీలిస్తుందన్నారు.
బీహార్ మంత్రికి మొదట వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ చార్మినార్ జ్ఞాపికని, ఇక్కడి ఫేమస్ ఉస్మానియా బిస్కట్లని కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సిఇఓ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, ఇజెహెచ్‌ఎస్ సిఇఓ డాక్టర్ పద్మ, డిఎంఇ రమేశ్‌రెడ్డి, కెసిఆర్ కిట్ల ప్రత్యేకాధి కారి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.