కవులున్నారు కవిప్రకాండులకు సత్కారమ్ము కల్పించ భూధవులున్నారు ఫణీశగౌతమ కణాద వ్యాసముఖ్యోక్త, శాస్త్ర విచారమ్ముల వైరిగెల్చెడి బుధేంద్ర స్వాములున్నారు తక్కువ యేమున్నది మాకు రాష్ట్రమునమాకుం తెల్గు నేర్పింతురే ఇది తెలంగాణా కవుల గర్జన.
సాహిత్య చరిత్ర పేరుతో వివక్ష చూపిస్తున్న చరిత్రకారులకొక కనువిప్పు. ఇక్కడివారికి తెలుగురాదు, ఇక్కడ కవులు లేరు అనుకునేవారికి, అనేవారికి ఇదొక హెచ్చరిక. పద్య కవులు పూజ్యమన్న దానికి స్పందించి 354 మంది పద్య కవులతో శాస్త్రీయ పద్ధతిలో గోలకొండకవుల సంచికను వెలువరించిన ఘనుడు
సురవరం ప్రతాపరెడ్డి. ఇది వెలువడేనాటికి తెలుగు సాహిత్యంలోనే ఇటువంటి గ్రంథం రాలేదు. 1934లో వెలుగుచూసిన ఈ సంచికలో అప్పుడు తెలంగాణాలో మారుమూలల్లో ఉన్న పద్యకవుల రచనలను చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. నాటి సమాజ జీవితంలోని అనేక పార్శ్వాలను స్పృశించడం గమనిస్తే నాటి తెలంగాణా పద్యకవులలోని సామాజిక నిష్ఠ ఎంతటిదో తెలుస్తుంది.
ఇందులో చోటు చేసుకున్న ”సుమ విలాపం” అనే పద్యఖండిక కరుణశ్రీ ”పుష్ప విలాపం” భూమిక ఎక్కడుందో తెలుస్తుంది. అన్ని కులాల్లోనూ పద్యం పాదులున్నాయని సాక్ష్యాధారాలతో సంకలనం చేసిన ‘గోలకొండ కవుల సంచిక’ తెలంగాణా పద్యప్రాభవానికి ఎత్తిన సూచిక. తెలుగు సాహిత్యాన్ని నాటినుంచి నేటి వరకు ఏలుతున్న ”పద్యం” ఎంత శక్తివంతమైందో ఇక్కడి పద్య కవిత్వం ఋజువులు చూపింది.
ఎక్కడనున్న సద్గుణము లేనియు నౌదలదాల్చుటందు వే
ఱొక్కరిగాంచి ముందర నహోయని, వెన్కల వెక్కిరింప కే
మక్కువ భ్రాతృవత్సలత, మత్సరమున్ విడనాడి యుండుటల్
నిక్కపు టొజ్జబంతులయి నిల్చెదరీ తెలగాణ సత్కవుల్
(వానమామలై వరదాచార్యులు)
ఇంతటి సద్గుణ సంపన్నత, ఇంతటి భ్రాతృవత్సలత, మాత్సర్య రాహిత్యం వంటి గుణాలవల్ల తెలంగాణ సత్కవులకు ప్రశంసలు దక్కినా సాహిత్య చరిత్ర మాత్రము చాలా వరకు చిన్నచూపే చూసింది.
ఆదికవిగా సంభావింపబడే నన్నయభట్టు కన్నా దాదాపు 50 సంవత్సరాలకు ముందే ఇక్కడ ఛందోగ్రంథమే (కవిజనాశ్రయము- మల్లియ రేచన) రావడం, అదీ కంద పద్య నమన్వితంగా రావడం దేశ కవిత్వపు జిలుగులు వెదజల్లడం సాహిత్య చరిత్ర విస్మరించి దాని కర్తృత్వాన్ని గూడా మార్చే ప్రయత్నాలు చేయడం బాధాకరం. నన్నయకన్నా ముందే ఇక్కడి కుర్క్యాల శాసనంలో కందపద్యాలు, విరియాల కామసాని గూడూరు శాసనంలో వృత్త పద్యాలు చూస్తే ఈ ప్రాంతం పద్యానికి వేసిన పెద్దపీట ఏమిటో తెలుస్తూనే ఉంది. హాలుడు, పంపకవి, భవభూతి వంటి వివిధ భాషా కవుల జన్మస్థలమైన తెలంగాణము పద్యాన్ని ఎత్తి నిలబెట్టిన సారవంతమైన సాహిత్య మాగాణము. నాటినుండి నేటివరకు నవ్యసాహితీ ప్రవాహం సజీవంగా కొనసాగడం ఒక ప్రత్యేక గుణం. ఉద్యమాలను కూడా మోస్తూ మిగిలిన సాహిత్య ప్రక్రియలైన కథ, నవల, వచన కవితవంటి వాటికి దీటుగా, పద్యం తన ప్రాభవాన్ని నేటికీ ప్రదర్శిస్తూనే ఉంది.
తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, తన ప్రాభవాన్ని తెలుపుకున్న తెలుగు పద్య కవిత్వం అనేక విషయాల్లో మొదటగా నిలిచింది. పద్య కవిత్వ శాఖలుగా విస్తరిల్లిన శతకప్రక్రియలో మొదటి శతకంగా వృషాధిపశతకాన్ని అందించిన పాల్కురికి సోమనాథుడే మరో పద్య ప్రక్రియ ఉదాహరణ కావ్యాలకూ తొలికవిగా నిలబడ్డాడు. అంతేకాదు కావ్యవస్తువుగా మరేవో పురాణాల మీదో, ఇతిహాసాలమీదో ఆధారపడకుండా తనకన్నా కొంతకాలం ముందువాడైన బసవేశ్వరుని ఘనతను బసవ పురాణంగా, తమకు గురుస్థానీయుడైన పండితారాధ్యుల చరిత్రను పండితారాధ్య చరిత్రగా రచించి వీధి మానిసిని కూడా సాహిత్య వేదికలు ఎక్కించిన ఘనుడు. తెలంగాణా కవుల స్వతంత్ర ప్రవృత్తికి ఇది గొప్ప నిదర్శనం. పైగా రెండు ప్రధాన గ్రంథాలలోనూ పాడుకోవడానికి అనువైన ద్విపదను ఉపయోగించడమేకాక, భావి ద్విపద కవులకొక మార్గదర్శిగా నిలిచిన కవి. తెలుగు పద్య చరిత్రలో తొలి పద్య కవిగా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగిన పాల్కురికి సోమనాథుడు పోతనవంటి మహాకవులను కూడా ప్రభావితం చేసిన ప్రతిభామూర్తి.
ఆచార్య సినారె అన్నట్టు ”జానపదుల నోళ్ళలో, రోళ్ళలో, రోకళ్ళలో తిరుగుళ్ళు..” పడిన గీతాలకు కావ్యస్థాయి కల్పించిన పండితకవి. పలు భాషలలో పాండిత్యం కలిగి ఉన్నా ”సరసమై బరిగెడిజాను తెనుగు”లో కమనీయ కవిత్వం చెప్పిన కవితావతంసుడు.
అనేక విషయాల్లో ఆద్యులై నిలిచిన తెలంగాణా పద్యకవులపట్ల సాహిత్య చరిత్ర చూపవలసినంత ఆదరం చూపకపోవడం శోచనీయం. ఏనాడూ ప్రభుతకో అధికారానికో ఆశపడక పోవడం నాటి పాల్కురికి, బమ్మెర పోతన మొదలుకొని మరింగంటి కవుల వరకు కూడా కొనసాగుతూ రావడం ఇక్కడి పద్యకవుల విశిష్టత. తొలి అచ్చ తెనుగు నిరోష్ఠ్యాది రచనలు చేసిన కవులున్న యీ నేలపై యీ విశిష్ట గుణం కొనసాగి వస్తూనే ఉంది.
పాలమూరు జిల్లా బూదపుర శాసనం మొదలుకొని అంతకు పూర్వమున్న కుర్క్యాల, గూడూరు శాసనాలతోబాటు నల్లగొండ జిల్లాలోని నిడుమూరు మండలానికి చెందిన ఊటూరు శాసనంవంటి వాటిలో పద్యాలు చోటు చేసుకోవడమేకాక చిత్త, బంధకవిత్వాలతో కూడిన పద్యాలుండడం ఈ ప్రాంతపు పద్యకవుల ప్రాభవానికి నిదర్శనం. వరంగల్లులోని ఉర్సుగుట్టలోని ఒక శాసనం పూర్తిగా సంస్కృత శ్లోకాలు చోటుచేసుకున్న ”సిద్ధోద్వాహమ్” అనే ఒక లఘు కావ్యమే కావడం వీరి ప్రతిభా పాటవాలకు గొప్ప ఉదాహరణ. నృసింహర్షి రచించిన ఈ శాసనకావ్యం పరమ సుందరరచన. జనగామలోని బెక్కల్లులో వేయించిన మల్లారెడ్డి శాసనంలోని వృత్త పద్యాలు తదనంతర కావ్యాలకు ఒజ్జబంతులుగా ఉన్నాయి.
పద్యం తెలంగాణాలో ఆదినుంచి పరిపుష్టి చెందిందే. పద్య కవిత్వం పోయిన పోకడలకు మూలాలు ఇక్కడి కవిత్వంలో కనిపిస్తున్నాయి. అచ్చ తెనుగేకాదు ద్వర్థి కావ్యాలకూ ఇక్కడే బీజంపడ్డది. పింగళి సూరన చెప్పినట్టు ”భీమన తొల్లి జెప్పె నను మాటయె కాని..” అన్నప్పుడే వేములవాడ భీమకవి తొలినాళ్ళలోనే ద్వర్థి కావ్యానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా కొఱవి గోపరాజు ”సింహాసన ద్వాత్త్రింశిక”ననుసరించి ”ఆంధ్రకవితా పితామహుడన్న” బిరుదం కొఱవి సత్యనారయణకు ఉన్నట్టు ఈ పద్యం ప్రమాణమై నిలుస్తున్నది.
”రామాయణకృతియై, తామెఱయుచు నాంధ్ర కవితాపితామహుడనగా
భూమినిమించిన భీమన, నామంబున బరగ సత్యనారన ఘనుడై”
(కొఱవి గోపరాజు)
ఈ బిరుదు వినగానే స్ఫురించే కవి అల్లసాని పెద్దనే కావచ్చు. కానీ తొలి ‘ఆంధ్ర కవితా పితామహుడు” తెలంగాణా పద్య కవి కొరవి సత్యనారయణయేనన్నది నిస్సంశయ సత్యం.
ఇక్కడి పద్యకవుల సమన్వయదృష్టి ఆశ్చర్యం కలిగిస్తుంది. పోతన కవీంద్రుడు ”కొందరకు తెనుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు…” అంటూనే ”నేనందరమెప్పింతు”నంటూ చూపిన సమన్వయ దృక్పథం వులకు మార్గదర్శకం. తన భాగవత రచనలో గంగన, సింగన, నారనలకు కూడా భాగస్వామ్యం కలిగించిన ప్రజాస్వామ్యవాది పోతన. ఇది భావి కవులకు పథ దర్శనం అవుతుందనడంలో వివ్రతిపత్తి లేదు.
ప్రాచీన కవిత్వంలో పద్యానికి పెద్దపీటవేసి పద్యసాహిత్య వైవిధ్యానికి బాటలుచూపి అనేక విశిష్ట రచనలు తెలంగాణా పద్యకవులు అందిస్తే, ఆధునిక తెలంగాణాలో కూడా పద్యవులు తమ ప్రతిభతో-తెలుగు పద్యప్రాభవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా రచనలు వెలువరిస్తూనే
ఉన్నారు. రాయలసీమలో శివభారత, ప్రతాప సింహచరిత్ర వంటి పద్య రచనలు నవ్య సంప్రదాయమార్గంలో వెలువడితే ఇక్కడ వానమామలై వారి పోతన చరిత్రము, జగన్నాథాచార్యులవారి రైతు రామాయణము వెలువడి పద్య ప్రతిష్ఠను పతాకస్థాయిలో నిలిపాయి. ఒకటి భాగవత గ్రంథానికి దీటైన పద్యాలను అందిస్తే మరొకటి కర్షకుని శ్రమజీవన సౌందర్య పరాకాష్ఠను భగవత్స్వరూపంగా భావించే రీతిలో పద్యాలను అందించింది.
రాచరిక పాలనకు చివరి ఆనవాళ్ళైన సంస్థానాలకు తెలంగాణా ఒక నిలయం. గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు మొదలైన సంస్థానాలు ఏర్పాటు చేసిన అవధానాల కారణంగా పద్యం సామాన్యులను కూడా ఆకర్షించింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన అందరు కవులను సమదృష్టితో ఆదరించి పద్యం పదిమందికి చేరే మార్గాలు అన్వేషించారు. వనపర్తి, గోపాలపేట మొదలైన సంస్థానాలు కూడా పద్య సాహిత్యానికి పెద్దరికాన్ని కట్టబెట్టాయి. సంస్థానాధీశులైన సురభి మాధవరాయలు ”చంద్రికా పరిణయ”మనే ప్రౌఢప్రబంధాన్ని అందిస్తే, ప్రాగటూరు పాలకుడైన బిజ్జల తిమ్మ భూపాలుడు మురారి రచించిన సంస్కృత నాటకాన్ని తెలుగు పద్య కావ్యంగా ”అనర్ఘరాఘవము” అనే పేర అందించాడు. పద్యప్రాభవాన్ని నిలబెట్టే విషయంలో తెలంగాణా సంస్థానాలది మొదటి స్థానమే.
భావాభ్యుదయ కవిత్వాలు తెలంగాణేతర ప్రాంతాలలో ఉవ్వెత్తున
ఉద్యమాలుగా ఎగసిపడిన రోజుల్లోనూ ఇక్కడ ఠంయాలవారి అచ్చ తెనుగు ప్రబంధాలవంటి అనేక కావ్యాలు ఆవిర్భవించాయి. పరశురామ పంతుల లింగమూర్తి ”సీతారామాంజనేయ సంవాదము” వంటి తాత్త్విక పద్యకావ్యాలు కూడా ఇక్కడే వెలువడ్డాయి.
దారశథి కృష్ణమాచార్యతో తెలుగు సాహిత్యంలో పద్యం ఒక కొత్త రూపు సంతరించుకుంది. నిరంకుశత్వంపై అంకుశమై పద్యం పదునెక్కింది. ఆయన సాహిత్యరంగ ప్రవేశం భావ, అభ్యుదయ కవిత్వాల్ని వరదవలె తెలుగులోకి ప్రవహింపజేసింది. ”పీడిత ప్రజావాణికి మైక మర్చి..’ పద్యాన్ని ప్రజాపక్షం చేసిన దాశరథి తెలంగాణా అస్తిత్వానికి ప్రాణం పోయడానికి పద్యాయుధాన్ని ఆశ్రయించాడు. వచన, గేయ కవిత్వాల రచనలో అందెవేసిన వాడైనా పద్యాన్ని కూడా ప్రయోజనాత్మక రీతిలో ప్రయోగించాడు. ”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని గర్జిస్తూ నే ”మా నిజాం రాజు జన్మజన్మాల బూజు” అంటూ కర్కశ పాలనపై పద్య ఖడ్గం ఝుళిపించాడు. ”రైతుదే తెలంగాణము రైతుదే..” అంటూ తన పద్యం రైతు పక్షంలో పోరాడుతుందని స్పష్టంగా చెప్పాడు. ”కరకు రా చరికమ్మును కూలదోయగా..” పద్యం తోడైందని గాంఢంగా నమ్మిన కవి,
ఉద్యమకారుడు దాశరథి. కేవలం ఒకే దిశగా ఆలోచించని గొప్ప జాతీయవాది కనుకనే దాశరథి
జండా ఒక్కటె మూడువన్నెలది, దేశంబొక్కటే భారతా
ఖండాసేతు హిమాచలలోర్వర, కవీంట్కాండమ్ములో రవీం
ద్రుండొక్కండె కవీంద్రు డూర్జిత జగద్యుద్ధాలలో శాంతికో
దండోద్యద్విజయుండు గాంధియొకడే తల్లీ మహా భారతీ!”
అన్నాడు. తెలంగాణాలో కర్షకుల పక్షాన నిలిచి కవిత్వాన్ని పండించిన రెండు పద్య కావ్యాలు ”కాపు బిడ్డ”, ”గంగిరెద్దు”. ఇవి గ్రామీణ జీవిత దర్పణాలుగా నిలిచిపోయే పద్యవాక్యాలు. ఆంధ్రా ప్రాంతంలో భావ కవిత్వోద్యమంలో భాగంగా వచ్చిన ప్రకృతి కవిత్వం (పాస్టరల్ పొయొట్రీ) పాశ్చాత్య ప్రభావాన్ని కలిగిందైతే, తెలంగాణాలోని ప్రకృతి కవిత్వం ఇక్కడి భూమి భూమికగా పుట్టిన పద్య కవిత్వం కావడం విశేషం. గార్లపాటి రాఘవరెడ్డి, ఉదయరాజు శేషగిరిరావు, పల్లా దుర్గయ్య, గంగుల శాయిరెడ్డి, వంటి ఎందరెందరో పద్యకవులు తమ పద్యకవిత్వం ద్వారా పద్య కవితాలోకంలో చిరంజీవులై నిలిచారు.
జ్ఞానపీఠాధిష్ఠాతయైన ఆచార్య డా. సి. నారాయణరెడ్డి కూడా తొలి రోజుల్లో పద్య కవిత్వాన్ని వెలయించినవారే. అవధానాల ద్వారా పద్యాన్ని ప్రజా హృదయాల్లోకి తీసుకువెళ్ళిన ఘనులు శిరిశెనహల్ కృష్ణమాచార్య, అష్టకాల నరసింహరామశర్మ, గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ, అందె వెంకటరాజం, ఇందారపు కిషన్‌రావు, అయాచితం నటేశ్వరశర్మ, రాళ్ళబండి కవితాప్రసాద్, దోర్బల ప్రభాకరశర్మ మొదలైన పెద్దలు తెలంగాణాలో పద్యం అస్తిత్వానికి దోహదం చేశారు.
తొట్ట తొలిసారి ఉవ్వెత్తున లేచిన 1969 ప్రత్యేక తెలంగాణా
ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న ఆనాటి యువకవి జి. యాదగిరి విప్లవ ఢంగా మోగిస్తూ తన పద్యాల్లో తెలంగాణా కీర్తిని, ఔన్నత్యాన్ని తెలుపుతూనే తొలిసారి ”తెలంగాణ తల్లి”ని స్మరించాడు.
”కల్మషములేని నా తెలంగాణ తల్లి పరులకింటిలో చోటిచ్చి పాలనిచ్చి బక్కచిక్కెర, వారిచే బంధనముల చిక్కుకొన్నది తుదకెట్టి దిక్కులేక..” అంటూ ఆవేదన చెందారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో ”తెలంగాణ తల్లి” స్ఫూర్తికి బీజం వేసింది కూడా పద్యమే. ‘శిల్పి’ జీవితంలోని రెండో పార్శ్వాన్ని చూపిన అద్భుతమైన అపురూపపద్య కావ్యమైన ”శిల్పి”
జి. యాదగిరి రచనయే. ఒద్దిరాజు సోదరకవులు, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, అనుముల కృష్ణమూర్తి, వేముగంటి నరసింహాచార్య, శ్రీపెరుంబుదూరు రాఘవాచార్య, ఆచార్య రావికంటి వసునందన్, దుబ్బాకుల కృష్ణస్వామి, డా. వజ్జల రంగాచార్య, ఐతా చంద్రయ్య, జీవీ కృష్ణమూర్తి, డా. కోదండ రామాచార్య, మహ్మద్ హుస్సేన్, మధుసూదనరావు, వెలపాటి రామారెడ్డి, డా. బి. లక్ష్మయ్య, కావూరి పాపయ్య శాస్త్రి, రామోజు లక్ష్మీనరసయ్య, పెండ్యాల కిషన్‌శర్మ, డా. ఎన్వీ ఎన్ చారి, మడిపల్లి భద్రయ్య, హెచ్.ఎల్.వి. ప్రసాదబాబు, డా. పాతూరి రఘురామయ్య, మంథెన ఆండాళ్, రామక విఠల శర్మ, డా.తిరుమల శ్రీనివాసాచార్య, బాపురెడ్డి, భండారు సదాశివ రావు, ముదిగొండ శ్రీరామశాస్త్రి, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఫోతేదార్ కేశవరావువంటి ఎందరెందరో తెలుగు పద్యాన్ని తెలంగాణాలో నిలిపిన విశిష్ట వ్యక్తులు.
తొలినాళ్ళనుంచి పద్యాన్ని ప్రాణప్రదంగా భావించి దాని ప్రాభవాన్ని చాటడానికి తెలంగాణా పద్యకవులు చూపించిన ప్రతిభ అసామాన్యం. అందుకే నాటినుండి నేటివరకు తెలంగాణాలో పద్యం పరిమళిస్తూనే ఉంది.
(కేశవ పంతుల నరసింహశాస్త్రి)
స్వరమైత్రింబడి సాగివచ్చెడి మనోజ్ఞమ్మైన నా దమ్ము చె
చ్చెర రాగాకృతి దాల్చినట్టుల వచస్సీమంతినీ! నీ హృదం
తర సౌభాగ్యము భావనన్ బడి రసానంద స్థిరమ్మైన య
క్షర రమ్యాకృతి దాల్చి వేదమగు, శాస్త్రమ్మౌను కావ్యమ్మగున్
(అనుముల కృష్ణమూర్తి)