పాత నోట్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చనే అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా కేవలం 16రోజుల్లోనే 250కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేయడం ద్వారా దేశంలోనే ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పరొరేషన్‌ అగ్ర స్థానంలో నిలిచింది. పాత నోట్ల రద్దుతో దేశంలోని ప్రధాన పట్టణాలపై పన్నుల వసూళ్లపై పడ్డ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది సంస్థ సమీక్షించింది. దేశంలోని మొత్తం 22 నగరాలలో పన్నువసూళ్లను సమీక్షించగా ఈ మాసం 24వ తేదీ వరకు 250 కోట్ల రూపాయలను వసూలు చేయడం ద్వారా జీహెచ్‌ఎంసి తన పన్నుల వసూళ్లలో 350 శాతం పురోగతిని సాధించిందని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది శాఖ ప్రసంశించింది. పన్నుల వసూళ్లలో పురోగతిని కనబర్చిన 22 ప్రధాన నగరాల జాబితాను, అవి సాధించిన పన్నుల వసూళ్ల వివరాలను ప్రకటించింది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ అనంతరం మహారాష్ట్ర కళ్యాణ్‌ రెండవ స్థానంలో నిలవడం, అహ్మదాబాద్‌ నగరం తృతీయ స్థానం పొందగా అనంతరం చెన్నై నగరం 4వ స్థానంలో నిలిచింది. అయితే 2015 నవంబర్‌ మాసంలో జీహెచ్‌ఎంసికి పన్నుల రూపంలో కేవలం 9కోట్లు మాత్రమే లభించగా 2016 నవంబర్‌ 24వ తేదీ వరకు 250 కోట్లు పన్నులు లభించాయి. అంటే నవంబర్‌ మాసంలోనే 2,500 శాతం అధికంగా పన్నుల వసూళ్లు జరిగాయి.

పకడ్బందీ ప్రణాళికతోనే…

కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దుచేసి, ఈ నోట్లతో పన్నులు చెల్లించవచ్చని నవంబర్‌ 9వ తేదీ ప్రకటించిన మరు క్షణమే జీహెచ్‌ఎంసి కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి క్షేత్రస్థాయి అధికారులతో సెల్‌ కాన్‌ారేెన్స్‌ నిర్వహించి ఈ అవకాశాన్ని నగర ప్రజలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా అన్ని పౌర సేవా కేంద్రాలు, మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలు అర్థరాత్రి వరకు పనిచేసేలా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో పాటు తాను కూడా ప్రత్యేకంగా 9వ తేదీ రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి పాత నోట్లతో పన్నుల చెల్లించేలా విజ్ఞప్తి చేశారు. దీంతో ఒక్క 10వ తేదీనే 55కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా, ఎస్‌ఎంఎస్‌, సోషల్‌ మీడియాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. తిరిగి ఈ సౌకర్యాన్ని నవంబర్‌ 24వ తేదీ వరకు కేంద్రం పొడిగించడంతో మొత్తం బల్దియా అధికారులు, సిబ్బందిని పన్నుల వసూళ్లపైనే కేంద్రీకరించాలని ఆదేశాలు జారీచేయడం, అన్ని పౌర సేవా కేంద్రాల వద్ద భారీ లైన్లకు తగ్గట్టు అదనపు సిబ్బందిని, మౌలిక సదుపాయాల ఏర్పాటు, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. డిప్యూటి, జోనల్‌ కమిషనర్ల స్థాయిలో కూడా ట్యాక్స్‌ చెల్లింపుదారులతో స్వయంగా మాట్లాడించడం, జీహెచ్‌ఎంసి సిబ్బంది వ్యక్తిగతంగా కలవడం తదితర చర్యలు పెద్ద ఎత్తున పన్నుల వసూళ్లకు ప్రధాన కారకాలని జీహెచ్‌ఎంసి కమిషనర్‌ డా.బి.జనార్ధన్‌రెడ్డి వివరించారు. టౌన్‌ప్లానింగ్‌కు సంబందించిన ఎల్‌.ఆర్‌.ఎస్‌ ఫీజులు, వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ పన్నులను కూడా చెల్లించవచ్చని ప్రకటించడంతో వాటి పన్నులు కూడా గణనీయంగా లభించాయని కమిషనర్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రధాన నగరాలు పన్నుల వసూళ్లలో హైదరాబాద్‌కు దరిదాపుల్లోలేవు.

కన్నెకంటి వెంకటరమణ

Other Updates