గన్నమరాజు గిరిజా మనోహర బాబు

శ్రీచాళుక్య నృపాది పాలితము, రాశీభూత విద్యాకళా

ప్రాచుర్యం బల దక్షిణా పథ పవిత్ర క్షేత్ర రాజంబు నా

ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు నాలంపూరు నందాంధ్ర వా

ణీ చాంపేయ సుమార్చనల్‌ జరుగుచుండెన్‌ నేత్రపర్వంబుగన్‌

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము, తెలంగాణాలోని ఏకైక శక్తిపీఠము, గడియారం రామకృష్ణ శర్మ శాశ్వత కార్యక్షేత్రము అయిన అలంపురంలో 1953వ సంవత్సరం జనవరిలో జరిగిన నాటి ఆంధ్రసారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాల వేదిక నుండి భారత

ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో తమ గంభీరమైన కంచుకంఠంతో కీ.శే. గడియారం రామకృష్ణ శర్మ గానం చేసిన స్వాగత కవితలోని తొలి పద్యం ఇది. ఈనాటికీ ఇంతటి మహాసభలు జరుగలేదేమోనన్నంత వైభవంగా విశ్వనాథ, శ్రీశ్రీ దాశరథీ, కప్పగంతుల, కేశవ పంతుల వంటి సాహితీ దిగ్గజాలెందరో పాల్గొన్న నాటి సభకు ఆనాటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి సభలు ప్రారంభించారు. హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల, మంత్రులు డా. మర్రి చెన్నారెడ్డి, వి.బి.రాజు వంటి రాజకీయ ప్రముఖులందరూ పాల్గొన్న ఆ సభలో కాళోజీ నా గొడవ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలే గాక, కవిసమ్మేళనాలు, పుస్తక ప్రదర్శనలు అనేకం జరిగాయి. నేటికీ పచ్చని జ్ఞాపకంగా నిలిచిపోయిన ఆ సభలకు కర్త, కర్మ క్రియ అన్నీ బహుముఖ ప్రజ్ఞాశాలియైన గడియారం రామకృష్ణ శర్మ కావడం ఒక విశేషం.

గడియారం రామకృష్ణ శర్మ 1919 మార్చి 6న అనంతపురం జిల్లా కదిరిలో కీ.శే. జ్వాలాపతి శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. కొంతకాలం తాము జన్మించిన కదిరిలోనే ఉండి ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తూ తమ పితృవ్యులవద్ద అమరకోశం, కొంత సంస్కృతము చదివారు. ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి వరకు మాత్రమే చదివారు. అక్కడితో వారి పాఠశాల విద్య దాదాపు ముగిసిపోయినట్లే. కారణాంతరాల వల్ల వారు చిన్నతనాననే తమ స్వగ్రామాన్ని వదిలి అలంపురం రావలసివచ్చింది. నాటి నుండి తమ ఆజీవన పర్యంతము దక్షిణకాశిగా వాసికెక్కిన పరశురామక్షేత్రమైన అలంపురమే వారి స్థిర నివాసంగా మారింది. తమ జీవితాన్ని ఆ క్షేత్ర ప్రధాన దైవతమైన శ్రీ బాలబ్రహ్మేశ్వర సామికే అంకితంచేశారు. అక్కడి అమ్మవారు శ్రీ జోగుళాంబాదేవినే సేవిస్తూ తరించారు.
కొంతకాలం అలంపురంలోని పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించినా అది ఆగిపోయింది. ఉర్దూ మీడియం కావటం మూలాన ఇతర కారణాల వల్ల అతి కొద్దికాలం మాత్రమే సాగిన ఆ విద్యాభ్యాసం పూర్తిగా నిలిచిపోయి, మరోసారి పాఠశాల విద్య అనేదే ప్రారంభం కాలేదు. కాని అనుకోకుండా వారికి అత్యంత ఆసక్తి కల సంప్రదాయ విద్యను అభ్యసించే అవకాశం మహామహులు వేలూరి శివరామశాస్త్రి వద్ద శిష్యరికం చేసి నేర్చుకునే మహదవకాశం కలిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సంస్కృతాంధ్ర మహాకావ్యాలను వ్యాకరణాది శాస్త్ర గ్రంథాలను వారి అంతేవాసిగా ఉండి చదివిన శర్మ, తమ గురువు కారణంగా జీవిత పథంలో ఒక చక్కని మార్గదర్శనం లభించింది. అక్కడ విద్య కేవలం నాలుగేళ్ళకే విధిగా ముగించి అలంపురానికి రావలసి వచ్చినా వారు ఆమార్గాన్ని వదలక స్వయంకృషితో మరెన్నో గ్రంథాలను, శాస్త్రాలను అధ్యయనం చేసి తమ పాండితిని పెంచుకొని ఉత్తమ స్థాయి సాహితీ వేత్తగా సాహిత్య రంగంలో నిలిచిపోయారు. అనేక ధర్మశాస్త్ర గ్రంథాలను కూడా ఆమూలాగ్రంగా చదివి పలు విషయాల్లో నిష్ణాతులయ్యారు. నిర్భీకత ఆయన తత్త్వం, నిండైన పాండిత్యం ఆయన సొత్తు, సామాజిక, సంస్కరణ, సేవ ఆయన హృదయం, శాస్త్రం విజ్ఞానం ఆయన స్వంతం, ప్రజాసేవ ఆయనకు పరమావధి, శాసన లిపి అధ్యయనం, చరిత్రలు ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన విషయాలు, బహుముఖీనమైన ప్రతిభకు ఆయన ప్రత్యక్ష సాక్షి.

చదివింది ఆరో తరగతి వరకే కావచ్చు, కాని ఆరు భాషల్లో అరుదైన పాండిత్యాన్ని సాధించిన అఖండుడు గడియారం వారు. విశ్వవిద్యాలయాల్లో చదవకున్నా విశ్వవిద్యాలయాలు ఆయన ప్రతిభకు మెచ్చి గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన నాటి గవర్నర్‌ సూర్జిత్‌ సింగ్‌ బర్నాలా చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టానందుకున్న శర్మ అదే విశ్వవిద్యాలయంలో లిపి శాస్త్రం మీద పరిశోధన చేసిన పరిశోధకులకు పర్యవేక్షకులుగా ఉండటం ఎంతో అరుదైన విషయం. ఇది వారికి లిపి శాస్త్రంలో ఉన్న ప్రతిభకు నికషోపలం. శాసనాలను అధ్యయనం చేసి ఎన్నెన్నో చారిత్రక విషయాలను వెలుగులోకి తెచ్చిన శర్మ తెలంగాణ శాసన సంపుటి (2)కి సంపాదకులుగా ఉండటమే గాక వినయాదిత్యుని పల్లెపాడు తామ్రశాసనము, విక్రమాదిత్యుని అమిదాల పాటితామ్ర శాసనము – అనే రచనలు ప్రచురించారు. వారు రచించిన మన వాస్తు సంపద, భారతీయ వాస్తు విజ్ఞానము తెలుగు సిరి వంటి రచనలు వారికి ఈ విషయాల్లో ఉన్న విశేష జ్ఞానానికి చిహ్నాలు. భారతదేశ చరిత్ర వంటి రచనలు వారికి చరిత్ర పైనున్న అధికారాన్ని, ఆసక్తిని తెలియజేస్తున్నాయి. అలంపూరు శిథిలములు, దక్షిణ వారణాసి, అలంపూరు క్షేత్రము మొదలైన గ్రంథములు వారి పరిశోధనా పాటవానికి వారి నిర్దుష్ట సాహితీ మూర్తిమత్వానికి నిదర్శనాలు. మాధవ విద్యారణ్య స్వామి చరిత్రము పేర వారు రచించిన ప్రామాణిక చారిత్రక గ్రంథము లోతైన వారి అధ్యయన శక్తిని బహిర్గతం చేస్తున్నది. కేవలం చరిత్ర, శిల్పం, వాస్తు విజ్ఞానం వంటి గ్రంథాలకే పరిమితం గాక వారి ప్రతిభను ఇతర సాహిత్య రంగాల్లోనూ మనం దర్శించవచ్చును.
సాహిత్య రంగంలో ఉన్న సృజనాత్మక, విమర్శనాత్మక రంగాల్లోనూ శర్మ ప్రతిభ రాణించింది. చిన్నతనాన్నే రాసిన ”చంద్రహాస” పద్యకావ్య రచనతో ప్రారంభమైన రచనా వ్యాసంగం చివరి వరకూ కొనసాగుతూనే వచ్చింది. తెలుగులో మాత్రమేగాక కన్నడ భాషలోనూ విస్తృత పాండిత్యం ఉన్న గడియారం వారు గదాయుద్ధ నాటకము, కన్నడ చిన్న కథలు అనే రెండు అనువాద గ్రంథాలను అందించారు. గదాయుద్ధ నాటకము కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని అందుకున్న రచన. రెండు గ్రంథాలు అకాడెమీ వారే ముద్రించారు.

కువలయానందసారము, పాంచజన్యము, దశరూపక సారము మొదలైన శర్మ రచనలు బహుళ ప్రచారము పొందినవి. తిక్కన, పాల్కురికి సోమనాధులను గురించి నెల్లూరు, హైదరాబాదులలో ప్రసంగించిన వారి ప్రసంగ వ్యాసాలు ఆయాకవులపై వారికున్న ప్రత్యయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి.

కేవలం సాహిత్య సేవకే పరిమితం కాని శర్మ రాజకీయ, సామాజిక, సంఘ సంస్కరణ రంగాలలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో తలమునకలుగా పాల్గొన్న శర్మ ”భాగ్యనగర్‌” అజ్ఞాత రేడియోను మిత్రుల సహకారంతో స్థాపించి దాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. 1945 నుండి 1965 వరకు స్త్రీ జనాభ్యుదయ సేవ నిమిత్తం ఒక మహా సంస్థవలె కృషి చేసి హైందవ బాల వితంతు వివాహములు శాస్త్ర సమ్మతములను పలు ధర్మ శాస్త్రాల సహాయంతో పండితులను ఒప్పించి అనేక వివాహాలు చేసి, తాము కూడా వితంతు వివాహాన్నే చేసుకున్న ఆచరణశీలి గడియారం వారు. అలంపురంలో అనాథ స్త్రీలకొరకు విద్యాలయాన్ని స్థాపించి నిర్వహించారు. అలంపురం క్షేత్ర జీర్ణోద్ధరణ నిమిత్తం వారి కృషి అనిర్వచనీయం. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ముంపునకు ఆ క్షేత్రం గురికాకుండా ప్రభుత్వం ద్వారా రక్షణ కుడ్య నిర్మాణం చేయించగలిగిన ఘనత శర్మదే. నేటికీ అది వారి కీర్తిని తెలియజేసే విధంగా దర్శనమిస్తున్నది.
గడియారం రామకృష్ణ అవిశ్రాంత యోధుడు. అన్ని సామాజిక రంగాలలోనూ కృషి చేసి తమదైన ముద్రతో రాణించిన మహనీయులు. అలంపురంలో శ్రీ బాల బ్రహ్మేశ్వర సంస్కృత పాఠశాల నేర్పరచడంలో, దంపుడు బియ్యం చేయించి ఎన్నో సంవత్సరాల పాటు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే కృషిలో భాగస్వాములు కావడం, వారికి సమాజం పట్ల నిబద్ధతకు కొలమానం.
తమకంటూ ఒక సెంటు భూమి కూడాలేని శర్మ, ఆహారం పండించడానికి ఆరుగాలం శ్రమించే రైతు పక్షాన నిలిచి ప్రభుత్వాలతో యుద్ధం చేసిన ఘనుడు. తమ కవితల్లో రైతు పక్షపాతిగా వారు రచించిన కవితలెన్నో ఉన్నాయి. ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి వారి పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేవరకు పోరాటం చేయగలిన మానసిక ధైర్యం కలిగిన దృఢ చిత్తులు శర్మ. వారు నిర్భీతులు. ఎంతటివారైనా సరే తప్పు మాట్లాడినా, తప్పుడు మార్గంలో వెళ్లినా నిర్భయంగా ఎత్తిచూపి ఖండించే రుజుమార్గ ప్రవర్తకులు శర్మ. తొలుత రాజకీయ రంగంలో
ఉన్నా, క్రమంగా అందులో అనేక కుట్రలు, కుతంత్రాలు చోటుచేసుకున్న దృష్ట్యా ‘మా ప్రజాపతులంతా దొమ్మిలో దిగినారు దుర్విధి వలన’ అని పేర్కొంటూ ‘గారాబు ఒక బిడ్డ గణికయైనట్లు మా రాజకీయాలు మలినంబులయ్యే’ అని రాజకీయ రంగం నుండి వైదొలగి కేవలం సమాజ సేవకే అంకితమై నిలిచిన, పత్రికా రంగంలోనూ కృషి చేసి ‘సుజాతా’ అనే ఒక పత్రికను దాదాపు మూడు సంవత్సరాలు నడిపిన శర్మ ఎందరో ప్రముఖ రచయితలను సాహిత్య ప్రపంచానికి పరిచయం చేశారు. గడియారం అనేక సంస్థలలో పలుబాధ్యతలను నిర్వహించి కృతకృత్యులయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో వ్యవస్థాపక సభ్యులుగా, పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా తెలంగాణ ఆంధ్రోద్యమం (1940-41) తాలూకా సంఘ బాధ్యులుగా అలంపురంలోని శ్రీ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షులుగా, అలంపురం తాలూకా రైతుసంఘం అధ్యక్షులుగా, రీజనల్‌ హిస్టారికల్‌ సర్వే కమిటీలో సభ్యులుగా,
ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడెమిక్‌ కౌన్సిల్‌ సభ్యులుగా, ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడెమీ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా కూడా ఇతోధిక సేవలందించిన సేవా ధురంధరులు గడియారం రామకృష్ణ శర్మ. ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ వారి విశిష్ట పురస్కారం మొదలుకొని వారి జీవితకాలంలో వారందుకున్న సన్మానాలు, సత్కారాలు లెక్కకు మిక్కిలి. వారి నాటకరంగాభిరుచి వారినొక మహా నటునిగా, వారి వ్యక్తిత్వము వారి నొక ఆదర్శ మూర్తిగా, వారి సంభాషణా చతురత వారినొక మహావక్తగా, వారి సామాజిక నిష్ఠ వారి నొక ఆరితేరిన యోద్ధగా రూపొందించినవి. వారి సమగ్ర మూర్తిమత్వ దర్శనం వారి చివరి రచనయైన వారి స్వీయచరిత్ర ”శతపత్రము” చదివితే కలుగుతుంది. అత్యంత నిబద్ధతతో నిజాయితీతో ఉన్న అరుదైన స్వీయ చరిత్రలలో ఇది ఒకటి. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్న ఈ రచన పాఠకునికి పరిణత ప్రజ్ఞామూర్తియై భాసించే పండిత గడియారం రామకృష్ణ శర్మని సాక్షాత్కరించిపజేసి గొప్ప ప్రేరణను అందిస్తుంద నడంలో ఎటువంటి సందేహమూ లేదు.

(మార్చి 6, శర్మగారి జయంతి)

Other Updates