గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలల్లో గ్రామ పంచాయితీల సమగ్రాభివద్ధికి ఏమి చేయాలనే విషయంలో కార్యాచరణ రూపొందించాలని, మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పని చేపట్టాలని కోరారు. గ్రామాల సమగ్రాభివద్ధికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయితీల్లో పనిచేసే సిబ్బందికి, మరీ ముఖ్యంగా సానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. వివాహ, జనన, మరణ ధవీకరణ పత్రాలు జారీ చేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలు కూడా పంచాయితీలకు అప్పగించాలని సీఎం చెప్పారు.
పంచాయితీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణ ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, శాంతి కుమారి, పికె జా, వికాస్ రాజ్, నీతూ ప్రసాద్, స్మిత సభర్వాల్, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండిసి ఛైర్మన్, శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం సీఎం చేసిన సూచనలు:
వదిలేసిన గుంతలు, ఉపయోగించని పాడుపడిన బావులను పూడ్చేయాలి. పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి. కూలిపోయిన ఇండ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి. మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. మురికి నీరు సాఫీగా పోయేలా వాటిని తీర్చిదిద్దాలి. గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, ప్రత్యేకంగా తులసి మొక్కలు పెంచాలి. గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను విసర్జించడానికి డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి.గ్రామానికి ఒక స్మశాన వాటిక ఖచ్చితంగా నిర్మించాలి. గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్య పరిచి, వారానికోసారి శ్రమదానం చేయించాలి. గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలను చైతన్య పరచాలి.
గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి సూచనలు
- రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
- గ్రామంలో రైతులు, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని, దానికి అనుగుణంగా ఇండెంట్ తయారు చేసి, నర్సరీల్లో మొక్కలు పెంచాలి.
- దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. వాటిని పెంచేలా ప్రోత్సహించాలి.
- రైతులు పొలం గట్ల మీద, బావుల దగ్గర మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి.
- గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలో కూడా మొక్కలు పెంచాలి.
- గ్రామ పరిధిలోని నదులు, ఉప నదులు, కాల్వలు, చెరువుల గట్లపై మొక్కలు నాటాలి.
- అన్ని విద్యాసంస్థల అద్యాపకులతో సమావేశం నిర్వహించి, వారి ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కషి చేయాలి. ఈ విషయంలో డిఇఓలకు లేఖలు రాయాలి.
ప్రత్యేకాధికారులు ప్రతీ గ్రామానికి సంబంధించి సేకరించాల్సిన వివరాలు:
- గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లున్నాయి. అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి
- గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? దాని ఏ పరిస్థితిలో ఉన్నాయి
- గ్రామంలో స్మశాన వాటిక ఉందా? ఉంటే అవి నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలం సేకరించాలి
- గ్రామంలో దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నాయి. లేకుంటే ఏర్పాటు చేయాలి
- గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా?
- కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే అవి ఏ పరి స్థితిలో ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి
- గ్రామ పంచాయితీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి.