ktrrrతమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలన్నింటికీ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, గనుల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఆగస్టు 18న ముంబైలో జరిగిన నాలుగో ఇంజెక్షన్‌ బ్లోమౌల్డింగ్‌ అండ్‌ పెట్‌ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 600 మంది ప్లాస్టిక్‌, పెట్రోకెమికల్‌, ప్యాకేజింగ్‌ రంగాల పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. సదస్సులో మంత్రి మాట్లాడుతూ 2020 నాటికి తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాలలో అగ్రగామిగా నిలుపుతామన్నారు.

ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌, రక్షణ రంగాలలో ముందంజ సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీహబ్‌, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి పలు అంశాలు ఈ రంగాల్లో ముందుకు దూసుకుపోయేందుకు దోహదం చేస్తున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ రెండు సంవత్సరాల్లోనే నిరంతర విద్యుత్‌ సరఫరా, టీఎస్‌ ఐపాస్‌, సులభ వాణిజ్య విధానం మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణలో అందుబాటులో ఉన్న ల్యాండ్‌ బ్యాంక్‌ పెట్టుబడులకు మరో అదనపు ఆకర్షణగా ఉందని మంత్రి అభివర్ణించారు. రాబోయే రోజులలో తెలంగాణలో రెండు ప్లాస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో మెదక్‌జిల్లా సుల్తాన్‌పూర్‌లో వంద ఎకరాల్లో, రెండో దశలో జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 500 ఎకరాల్లో ప్లాస్టిక్‌ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. ప్లాస్టిక్‌ పరిశ్రమలు పెట్టే వారికి ఇచ్చే రాయితీలను ఆయన వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరిచింది. వారు కేటీఆర్‌ను అభినందించారు.

Other Updates