ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు.కామారెడ్డి పట్టణ సమీపంలో గల అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్టను బలోపేతం చేయడం, చెరువు కింది ఆయకట్టు పెంపు, ప్రజలకు సౌకర్యవంతమైన పద్ధతిలో ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణపై కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, కలెక్టర్‌ సంబంధిత అధికారులతో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
tsmagazine

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొదటిదశలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ తదితర మౌలిక అంశాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయాన్ని స్థిరీకరించి, అనుబంధ వృత్తులను బలోపేతం చేయడంపైనేదృష్టి సారిస్తామన్నారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాభివృద్ధికికృషి చేస్తామన్నారు. తెలంగాణలో ఉమ్మడి పాలనలో విస్మరించబడి ఉన్న పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

”భారత దేశంలో అద్భుతమైన సుందర అడవులు, ప్రకృతి రమణీయ కేంద్రాలు అనేకం ఉన్నయి. విస్తీర్ణంలో అతి చిన్నదైన, పెద్దగా ప్రకృతి సహజ సిద్ధమైన కేంద్రాలు అంతగా లేని సింగపూర్‌ లాంటి దేశాలు పర్యాటక రంగంలో ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి. విశాలమైన అడవులు, కొండలు, గుట్టలు, నదీ నదాలు, చెరువులు, సహజ సిద్ధమైన సుందరదృశ్యాలతో కూడుకొని ఉన్న తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం పుణ్యక్షేత్ర మహత్యం ఎక్కడో ఉన్న శంగేరి పీఠాధిపతికి తెలుస్తది గాని.. ఆనాటి ఆంధ్రా పాలకులకు తెలువలేదు. మన విలువను మనకు తెలువకుంట జేసిండ్రు. మంచిర్యాల పిలగాడు దూలం సత్యనారాయణ వచ్చి వీడియో తీసి చూపించే వరకు తెలంగాణలో దాగి ఉన్న ప్రకృతి అద్భుతాలు వెలుగులోకి రాలేదు. తెలంగాణ పుణ్యక్షేత్రాలకు గానీ, పర్యాటక రంగానికి గానీ గత పాలకులు సరైన ప్రాధాన్యతనివ్వలేదు” అని సీఎం అన్నారు.

నిజామాబాద్‌ వెళ్లే దారిలో ఉన్న కామారెడ్డికి ఆనుకొని ఉన్న అడ్లూరి ఎల్లారెడ్డి చెరువును అభివృద్ధి పరిచి, చెరువు కింద 2500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జాలువారే రీ-జనరేటెడ్‌ వాటర్‌ తోనే చెరువు నిండుతుందనీ, ఇందుకు అయ్యే ఖర్చు దాదాపు రూ.64 కోట్లను తక్షణమే విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు కట్టను బలోపేతం చేయడమేగాకుండా, ప్రజలు, పిల్లల సౌకర్యార్థం వాటర్‌ ఫౌంటేన్‌, ఫుడ్‌ కోర్టులు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, తదితర సుందరీకరణ పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇదే విధంగా రాబోయే కాలంలో అన్ని రిజర్వాయర్లు, చెరువుల ట్యాంకుబండ్‌లను బలోపేతం చేయడమే గాకుండా, ఆహ్లాదరకమైన వాతావరణాన్ని పంచే విధంగా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కె.టి.రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఎమ్మెల్యేలు గంపా గోవర్దన్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Other Updates