గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివద్ధి చేసేందుకు వెంటనే 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆలయ అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్య్టా ఇకనుండి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని, దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థాలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపంతో పాటు, పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి వుంటుందని సీఎం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. యజ్ఞ యాగాదులకు గోదావరి తీరంలోని ఆలయ ప్రాంతం అణువుగా ఉంటుందని, ఆలయ పునర్నిర్మాణానికి శంగేరి పీఠాధిపతి శ్రీ భారతి తీర్థ స్వామిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు అన్ని పూర్తయిన తరువాత గోదావరి జలాలు ధర్మపురి లక్ష్మీ నరంసిహ స్వామి పాదాలకు తాకే వరకు సుమారు 170 కిలోమీటర్లు నిలిచి ఉంటాయని తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమద్ధిగా సాగు నీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. ఉద్యమ కాలంలో రామగుండం దగ్గర గోదావరిని చూస్తే దుఃఖం వచ్చేదని, తెలంగాణకు తరలి రావాలని మొక్కుతూ గోదావరి నదిలో నాణాలు జారవిడిచే వాడినని, ఇప్పుడు తెలంగాణలో కష్టాలు తీరబోతున్నయని సీఎం పేర్కొన్నారు. అర్చకుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తామని, వేద పాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్ దగ్గర జాలీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత కన్నేపల్లి పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అటునుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన బ్యారేజ్ పనులను పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద పనుల పురోగతిని సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీసి, మరింత త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టవలసిందిగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, వర్క్ ఏజెన్సీ ఎల్ అండ్ టీ బాధ్యులకు, పని త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన వెల్డర్, ఫిట్టర్ తదితర సిబ్బందిని దేశంలో ఎక్కడనుంచయినా తక్షణమే తెప్పించి పనులను వేగవంతం చేసేందుకు సహకరించాలని మెగా కష్ణా రెడ్డిని సీఎం కోరారు. గేటు గేటుకూ సరిపోను సిబ్బందిని దించి మూడు షిఫ్ట్‌లల్లో పనిచేయించాలన్నారు.
అక్కడనుంచి వాహనంలో బ్యారేజ్ మీద నుంచి ప్రయాణిస్తూ… నడుమ ఆగిన ముఖ్యమంత్రి బ్యారేజ్ నిర్మాణాన్ని, గేట్ల బిగింపు, తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదావరి ఈ కొస నుంచి అవతలి కొసకు (మహారాష్ట్ర సరిహద్దు వైపుకు) చేరుకుని అక్కడ కాసేపు ఆగి వాగు మళ్లింపు కాల్వ నిర్మాణం.. మిగిలిన కొన్ని గేట్ల బిగింపుకు సంబంధించి సూచనలు చేశారు. అక్కడ నుంచి 45 డిగ్రీల ఎండలోనే వాహనంలో బయలుదేరిన ముఖ్యమంత్రి గోదావరి నీటి కోతను తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ నుండి తిరిగి బయలుదేరి బ్యారేజ్ కింది కాఫర్ డ్యామ్ మీదుగా గుంతల రోడ్డును సైతం లెక్కచేయకుండా ప్రయాణించి…ఎండలోనే ఆగి వాహనం దిగి…అక్కడ పనిచేస్తున్న కార్మికులను పలకరించి అక్కడ కూడా ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అక్కడ నుంచి నేరుగా గెస్ట్ హౌజ్ చేరుకున్న సీఎం ఇంజనీర్లతో సమావేశమై రానున్న జూన్‌లో వచ్చే గోదావరి వరదను మేడిగడ్డ వద్ద నిలువరించేందుకు చేపట్టవలసిన సత్వర చర్యలను, అందుకు తగిన పలు సూచనలను చేశారు. సమావేశం అనంతరం సీఎం తిరిగి రామగుండం హెలికాప్టర్‌లో బయలుదేరారు.