treesసహజ వనాలు తక్కువైపోయిన నేపథ్యంలో విరివిగా చెట్లు పెంచి పర్యావరణ సమతుల్యం కాపాడడమొక్కటే ప్రత్యామ్నాయ మార్గమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం, వాటిని పెంచడం తప్పనిసరి చేసే విధంగా శాసనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక సంస్థలు మొక్కలు పెంచే కార్యక్రమంలో మరింత భాగస్వామ్యం అయ్యేందుకు అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉందన్నారు. జనవరి 20న క్యాంపు కార్యాలయంలో తెలంగాణకు హరితహారం, ఫారెస్ట్‌ కాలేజీ ఏర్పాటు అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తాను హెలిక్యాప్టర్‌లో వెళ్తున్న సందర్భంగా కిందికి చూస్తే బాధ కలుగుతుందని సిఎం అన్నారు. ఫారెస్ట్‌ భూములలో కూడా చెట్లు కనిపించడంలేదని అంతా బోసిపోయినట్లు ఉంటుందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, భూ భాగంపై 30 శాతం వరకు చెట్లు ఉండేలా చూడాలన్నారు. అడవులు అంతరించిపోతున్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని, అడవులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిశ్రమల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, విద్యాసంస్థల్లో విరివిగా చెట్లు పెంచాలన్నారు. చెట్లు పెంచే కార్యక్రమంలో భాగంగా పనిచేసిన వారికి వృక్షమిత్ర వంటి అవార్డులు కూడా ఇస్తామన్నారు.

తెలంగాణ సాంస్క తిక సారథి ద్వారా విస్తృత ప్రచారం చేసి పర్యావరణాన్ని కాపాడుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాటాల్సిన మొక్కలను సరఫరా చేసేందుకు ఎక్కువ సంఖ్యలో నర్సరీలు నిర్వహించాలని సూచించారు.

మెదక్‌ జిల్లా ములుగులో ఇటీవల శంఖుస్థాపన జరిగిన ఫారెస్ట్‌ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. కోయంబత్తూరు ఫారెస్ట్‌ కాలేజీలో చదువుకున్న 156 మంది విద్యార్థులు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు అయ్యారని, తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీలో కూడా తెలంగాణతో పాటు ఇతర ప్రాంత విద్యార్థులు కూడా చదువుకుని ఎదగాలని సూచించారు. అమెరికాలోని అబర్న్‌ ఫారెస్ట్‌ కాలేజీ అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్నదని, ఆ కాలేజీతో పరస్పర అవగాహన కుదుర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని సిఎం చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ నడవాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Other Updates