telugu-talliతెలంగాణలోని ప్రాచీన సంస్కృతికీ, ఆలయాలూ నెలవైన

ఖిల్లా ఇందూరు (నిజామాబాద్‌) జిల్లా. ఈ జిల్లాలో అపురూప దేవాలయాలకు నిలయమైన రథాలరామారెడ్డిపేటలో జన్మించిన జాతిరత్నం వల్లంభట్ల గుండయ్య భాగవతార్‌.

1900లో ప్రభవించిన ఈ మహానుభావుని చరిత్ర ఆసక్తికరం, అద్భుతం! సనాతనవైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బుచ్చమాంబ, హనుమయ్యల పుత్రునిగా అవతరించిన ఈ మనీషి బాల్యంలో చదువు, సంధ్యలు లేక అల్లరి చిల్లరిగా తిరిగేవాడట. ఒకనాడు అతని తండ్రి, అతణ్ణి చేరబిలిచి, ‘నీతోటివాళ్లందరూ చదువుల్లో ఆరితేరుతుంటే వాళ్లను చూసి బుద్ధితెచ్చుకో!’ అని మందలించారట. తండ్రి పలికిన మాటలతో జ్ఞానోదయమైన గుండయ్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే వాసరక్షేేత్రానికి వెళ్లి, సరస్వతీ మాతృ సన్నిధిలో ధ్యానం చేసుకొంటూ ఉండిపోయాడట.

అలా మండలకాలం (నలభై దినాలు) గడచిపోగానే ఒకనాటి రాత్రి సరస్వతీదేవి గుండయ్యకు స్వప్నంలో దర్శనమిచ్చి, ఆయన నాల్కపై ఏవో అక్షరాలను రాసిందట. మరుసటి రోజే గుండయ్య తన దీక్ష సఫలమైందని గ్రహించి, తన ఊరికి వెళ్లిపోయాడట.

ఆ తరువాత ఆయనలో కలిగిన మార్పును చూసి, తల్లిదండ్రులు సంతోషించారట. గుండయ్య సౌమ్యుడుగా మారిపోయాడట. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదట.

ఒకనాడు దేవతోత్సవాలు జరుగుతున్న బంధువుల గ్రామానికి వెళ్లిన గుండయ్య అక్కడ ఆ సాయంకాలం దేవాలయంలో హరికథ చెప్పవలసిన హరిదాసు అనారోగ్యంతో రాలేదట. నిర్వాహకులు ఆ విషయాన్ని సభాముఖంగా ప్రకటించి, ఈ సభలో ఎవరైనా హరికథ చెప్పగలవాళ్లుంటే సభావేదికపైకి రావాలని కోరారట. అప్పుడు గుండయ్య వేదికపైకి వెళ్లి తాను హరికథ చెప్పగలనని ప్రకటించి, ప్రారంభించాడట. తన ఇష్టదైవం అయిన వాసర సరస్వతిని ధ్యానిస్తూ ‘నమామి వాసరపురవాసినీ’ అంటూ కీర్తనను ఆలాపించి, తదనంతరం భగవంతుని ఉనికి చాటే ‘బ్రహ్మనిరూపణం’ అనే వేదాంత విషయాన్ని చెప్పారు. గుండయ్య శ్రుతిస్మృతి పురాణేతిహాసాలలోని ప్రమాణాలను ఉదహరిస్తుంటే అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులై ఇంతటి అద్భుత హరికథను తాము ఇప్పటివరకు ఎక్కడా చూడలేదనీ, వినలేదనీ ప్రశంసల వర్షం కురిపించారట. ఏ మాత్రం చదువుకోని గుండయ్య నోట వెలువడుతున్న జ్ఞానప్రవాహాన్ని చూచి, ఇదంతా సరస్వతీ కటాక్షమే తప్ప మరొకటి కాదని కొనియాడారట.

దైవకృప ఉంటే మూగవాడు సైతం గొప్ప వక్తగా మారుతాడనీ, కాళ్లులేని వాడు సైతం పర్వతాలను అధిరోహిస్తాడనీ అనుకొంటూ ఆనాటి సభాసదులు గుండయ్య హరికథను వేనోళ్ళ కొనియాడారట. మూడు గంటలపాటు బ్రహ్మనిరూపణను అనేక కథలూ, ఉప కథలతో కొనసాగించి, చివరికి ఒక భగవత్కథను సంక్షిప్తంగా వివరించి హరికథను గుండయ్య ముగించాడట. కథాకాలక్షేపం ముగిసిన తరువాత ఆయన దగ్గరికి చేరిన ‘శ్రోతలు ఇంతటి వాగ్వైభవం, ఆద్భుత కథాకథనశక్తి మీకు ఎక్కడి నుండి వచ్చిందని’ అడిగితే, ‘ఏమో నామీే తెలియదు. సభావేదికపై నిలబడగానే అమ్మ నాకు ప్రేరణనిస్తుంది. ఆ ప్రేరణతోనే నేను పలుకగలుగుతున్నాను. ఇప్పుడు అడిగితే మాత్రం నేనేమీ చెప్పలేను.’ అని గుండయ్య పలివాేడట.

ఇలా గుండయ్య హరికథాకథన ప్రతిభను గూర్చి చుట్టు పక్కల గ్రామాలలో ప్రచారమైపోయింది. ఒక పర్యాయం యాదగిరిగుట్టపై బ్ర¬్మత్సవాలు జరుగుతూ ఉండగా ఎందరెందరో దిగ్దంతులైన హరిదాసులు స్వామి సన్నిధిలో హరికథలు చెప్పేవారు. వారిని దర్శించడానికి వెళ్లిన గుండయ్య అక్కడి నిర్వాహకులను కలిసి, అవకాశం ఇస్తే తానూ హరికథ చెబుతానని అన్నాడు. అప్పటి కార్యక్రమం రూపకల్పన జరిగినందున సమయం ఇవ్వలేమన్నారు. కానీ చివరికి పది నిమిషాల సమయం మాత్రమే ఇచ్చి హరికథ చెప్పమన్నారు. అప్పుడు గుండయ్య లక్ష్మీనరసింహస్వామి కృపతో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, హరికథ చెప్పడం ప్రారంభించాడు. సరస్వతీ ప్రార్థన అనంతరం బ్రహ్మనిరూపణ చేస్తూ గుండయ్య హరికథను అద్భుతంగా చెబుతుంటే అక్కడి శ్రోతలందరూ మంత్ర ముగ్ధులైపోయారు. నిర్వాహకులు సైతం సమయాన్ని మరచిపోయారు. మూడు గంటలపాటు అనర్గళంగా, మకరంద స్రవంతిలా సాగిన హరికథను విని నిర్వాహకులు అమందానందసంభరితులై, గుండయ్యను ఘనంగా సత్కరించి, ఆస్థాన హరికథకునిగా ప్రకటించి, ప్రతి యేడాదీ బ్ర¬్మత్సవాలలో గుండయ్య హరికథతో కార్యక్రమాలు ప్రారంభమయ్యే విధంగా ఏర్పాటు చేశారట. ఇదీ గుండయ్య గొప్పతనం.

హరికథకులలో గుండయ్యది విలక్షణశైలి. సాధారణంగా అందరు హరిదాసులు కథాప్రవచనానికి అధికసమయం ఇస్తూ కాలక్షేపం చేస్తారు. కానీ గుండయ్య అలాకాదు. వేదాంత సంబంధమైన అభంగాలనూ, కీర్తనలనూ ఆలాపిస్తూ భగవన్మహిమను వేనోళ్ల కొనియాడే ప్రమాణాలను, అద్భుతమైన ఉదాహరణలతో రంగరించి చెబుతుంటే శ్రోతలు ఆనందడోలికలలో ఊగిపోయేవారు. ఆయన హరికథకులలో అవధానివంటి వాడని విజ్ఞులైన పెద్దలు ప్రశంసించేవారు. సభలోకి వచ్చిన తరువాత, శ్రోతలు ఏ కథ చెప్పమంటే ఆ కథను గుండయ్య అద్భుతంగా చెప్పేవారు. చెప్పిన కథ చెప్పకుండా నలభైరోజుల వరకు హరికథలు చెప్పే ప్రతిభ గుండయ్యగారి సొంతం.

గుండయ్య ఏ హరికథూ పారితోషికం అడిగేవాడు కాదు. రెండు రూపాయలతో మొదలుకొని, నూరు రూపాయలదాక పారితోషికం ఇస్తే సంతోషించి కథలు చెప్పిన అలౌకికుడాయన. పారితోషికాన్ని ఎప్పుడూ నిర్బంధంగా కోరని స్వభావం గుండయ్యది.

సంగీతంలో ఓనమాలు తెలియవు. సాహిత్యంలో అసలే ప్రవేశం శూన్యం. పాఠశాల విద్య మృగ్యం. ఇలాంటి వ్యక్తి అద్భుత హరికథకుడిగా రాణించడం వెనుక గుండయ్యకు లభించిన దైవానుగ్రహం, పట్టుదలలే కారణమని అందరూ అంటారు.

తెలంగాణలోని అనేక ప్రాంతాలలో గుండయ్య హరికథా కాలక్షేపాలు చేశారు. ఎందరో సంస్థానాధీశులు పిలిపించుకొని, గుండయ్యతో కథలు చెప్పించుకొనేవారు. నిజామాబాదులోని దొంతుల గుండయ్య, శివంపేటలోని పబ్బా అంజయ్య గుప్తవంటి ఉదారులు గుండయ్య గారిని అభిమానంతో రప్పించుకొని, హరికథలను నిర్వహింప జేసేవారని ప్రాచ్య విద్యాపరిషత్తు వ్యవస్థాపకులు ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ తెలిపారు. వీరి ఆధ్వర్యంలో గుండయ్యకు విద్వత్పరిషత్తు సమక్షాన ‘హరికథాసేరి’, ‘బ్రహ్మనిరూపణ నిపుణ’ వంటి బిరుదాలను ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు.

గుండయ్య ఒక్క హరికథలోనే కాదు, ఆయుర్వేదంలోనూ, పురాణ ప్రవచనం లోనూ దిట్టగా రాణించారు. ఇన్ని గొప్ప గుణాలున్నా తొణకని మనస్తత్వం, జీర్ణించు కొన్న వైరాగ్యభావం గుండయ్యలో మెండుగా ఉండేవి. అందు ఆయన ఏనాడూ పేరుకోసం ప్రాకులాడలేదు. డబ్బుకోసం తలవంచలేదు. యాదృచ్ఛాలాభ సంతుష్టి (లభించిన దానితోనే తృప్తిపడే స్వభావం) నూరుపాళ్ల రంగరించుకొన్న వ్యక్తిత్వం కారణంగానే గుండయ్య తెలంగాణ హరికథకులలో చిరస్మరణీయుడయ్యాడు.

అజీవనాంతంగా ఆయన దేవ్యుపాసనలో తరించారు. వంశపారంపర్యంగా లభించిన శ్రీవిద్యలోని ‘వనదుర్గ’ను ఉపాసించి, జన్మను చరితార్ధం చేసుకొన్న గుండయ్య 1982లో భౌతిక దేహాన్ని వీడి, పరబ్రహ్మలో ఐక్యమయ్యారు. గుండయ్య జన్మించి నేటికి నూటపదహారేళ్లు గడచిపోయాయి. ఈ మహాత్ముని కీర్తి ఆచంద్ర తారార్కం తెలంగాణ నేలలో నిలిచిపోతుంది. ఈ మహనీయుని స్మృతిని పదిలపరచే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తే రాబోయే తరానికి స్ఫూర్తిదాయకం కాగలదు.

Other Updates