కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పడి ఆరుమాసాలు గడిచింది. ఓ ప్రభుత్వ పనితీరును బేరీజు వేయడానికి ఇది అత్యల్పకాలమైనా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి విజయవంతంగా అమలుపరుస్తోంది.
ఈ క్రమంలో రూపొందించిన ఓ అద్భుత పథకమే ‘మిషన్ కాకతీయ’. తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువే కేంద్రం. కాకతీయుల కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పెద్దసంఖ్యలో జరిగింది. ఆ తరువాత అధికారం చేపట్టిన కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల పాలనాకాలంలో కూడా పాత చెరువులను పరిరక్షిస్తూ మరెన్నో కొత్త చెరువులను కూడా నిర్మించారు.
అప్పట్లో చెరువుల నిర్వహణ సజావుగా సాగటంతో వ్యవసాయం లాభసాటిగా సాగేది. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండేది.
కానీ, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురికావటంతో చెరువులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ఆనవాళ్లు లేకుండా పూడిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది. రైతు ఆర్థికంగా చితికిపోయాడు. వలసలు పెరిగాయి. రైతన్నకు పూర్వవైభవం రావాలన్నా, గ్రామాలు మళ్ళీ కళకళలాడాలన్నా చెరువుల పునరుద్ధరణే ఉత్తమమార్గంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ లక్ష్యం సాధించేందుకు ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో సుమారు 45వేల చెరువులు వున్నాయి. ఏడాదికి 9వేల చొప్పున ఐదేళ్ళకాలంలో మొత్తం చెరువులు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల్లో పూడికతీత, చెరువుల విస్తరణ, కట్టు కాలువలు సరిచేయడం, పంట కాల్వల మరమ్మతు, తూముల మరమ్మతులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పూడిక తీయగా వచ్చిన మట్టిని పంట పొలాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెరువు మట్టి చేనుకు బలిమి చేకూరుస్తుందని తెలంగాణ చెరువులపై ఇటీవల అధ్యయనం చేసిన అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం కూడా తేల్చి చెప్పింది. దీనివల్ల ఎరువుల వాడకం తగ్గుతుంది.
చెరువులు పునరుద్ధరిస్తే వాటిలో నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది. చెరువు క్రింద ఆయకట్టు విస్తరిస్తుంది. కృష్ణా, గోదావరి జలాలతో చెరువులను నింపుకోవడం ద్వారా ఈ నదులలో మనవాటా జలాలను సద్వినియోగం చేసుకోవచ్చు. భూగర్భ జలమట్టం పెరుగుతుంది. మొత్తంగాచూస్తే చెరువులు నీటితో గలగలలాడుతుంటాయి. గ్రామాలు కళకళలాడుతాయి.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తానుకూడా స్వయంగా తట్టమోసి ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ప్రకటించారంటే, ప్రభుత్వం దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తొందో చెప్పకనే చెప్పినట్లయింది. అంతేకాదు, ‘కాకతీయ మిషన్’ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలు, ముఖ్యంగా చెరువులపై ఆధారపడి జీవించే ప్రజానీకం, విద్యార్థులు సయితం భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రజా ఉద్యమంలా సాగాలని భావిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ‘ఉడతాభక్తి’గా పాల్గొని, గ్రామీణ వికాసానికి దోహదపడటం మనందరి కర్తవ్యం. ‘మన ఊరు`మన చెరువు’ నినాదాన్ని గ్రామగ్రామాన చాటిచెపుదాం.