రాష్ట్రంలోని పల్లెలన్నీ ఇప్పుడు కలసికట్టుగా ముందుకు కదులుతున్నాయి. ప్రజలు ఎవరికివారు స్వచ్ఛందంగా పార, పలుగు చేతబట్టి శ్రమదానంతో ముందుకు వస్తున్నారు. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతవైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఏళ్ళతరబడి అపరిష్కృతంగా ఉన్న , పల్లెలలను పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతున్నాయి. పేరుకుపోయిన చెత్త తరలిపోతోంది. గుబురుగా పెరిగిన పిచ్చి పొదలు, పనికిరాని శిధిల భవనాలు తొలగి పోతున్నాయి. గ్రామ సీమలు ఇప్పుడు కొత్త అందాలు సంతరించుకొని మారిపోతున్నాయి.
తెలంగాణలోని పల్లెసీమలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్రామాలలో జోరుగా అమలవుతోంది. దీంతో గ్రామాల ముఖచిత్రమే మారిపోతోంది. గ్రామాలలో గుణాత్మకమైన మార్పు తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అవసరమైన అధికారాలు, విధులను స్పష్టంగా పేర్కొంటూ, అవసరమైన నిధులను కూడా అందించింది.
”పల్లెల ప్రగతికి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలవుతోంది. మీరంతా స్వచ్ఛందంగా భాగస్వాములై ఊరిని తీర్చిదిద్దుకోవాలి. అవసరమైనచోట ప్రజలే శ్రమదానంచేసి, చెమట చుక్కలను పెట్టుబడిగా ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా చేయిచేయి కలిపి గ్రామాల అభివృద్ధిలో విస్తృతంగా భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా, విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానే కొత్తవి ఏర్పాటవుతున్నాయి, మురుగునీటి కాలువలు శుభ్రమవుతున్నాయి. వైకుంఠధామాలు రూపుదిద్దుకుంటున్నాయి, హరిత హారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పెద్దఎత్తున సాగుతోంది. గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ప్రజలతోపాటు వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం పనులను పర్యవేక్షిస్తూ, పల్లెనిద్రలు కూడా చేస్తున్నారు. పుట్టిన ఊరు బాగుకోసం దాతలు ముందుకు వచ్చి భూములు విరాళంగా ఇవ్వడం, ధనసహాయం చేస్తుండటం మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ప్రగతి కార్యాచరణ ప్రణాళిక స్ఫూర్తితో గ్రామసీమలు అనతికాలంలోనే ఆదర్శగ్రామాలుగా రూపొందుతాయని ఆకాంక్షిద్దాం.