మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఊర్లల్ల బడులే. పల్లెలనుంచి ప్రపంచాన్ని జయించిన వాళ్ళందరికి ప్రాథమికంగా పాఠశాలనే వాళ్ళ మూర్తీమత్వాల పెంచేది. బడి తర్వాత ఆ బల్లె సదువు చెప్పిన పంతులుకే ఎనలేని కీర్తి వస్తది. బడిపంతుల్లు పిల్లల్లో దాగివున్న ఆసక్తిని గమనించి అటువైపుగా వెళ్ళేందుకు మార్గనిర్దేశ్యం చేస్తారు. తెలంగాణ పల్లెల్లోని వేలాది గ్రామాల్లో పూర్వకాలం ఉపాధ్యాయులే యవతరాన్ని ముందుకు నడిపించారు. ఒక ఊరులో హైస్కూల్ వరకు బడి ఉంటే ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న పల్లెల పిల్లలు అందరు ఆ బడికే కాలి నడకనవచ్చి చదువుకునేవారు. ఆ కాలంలో దళితులు బహుజనులకు చదువుకునే అవకాశాలు తక్కువగా ఉండేవి. ఎందుకంటే పిలగాడు ఎదిగితే జీతం ఉంచుడు లేదా ఎడ్లకాసేందుకు, మ్యాకలు, గొర్లు కాసేందుకు, పంపేవాల్లు. లేకపోతే ఆ కుటుంబాలు నడవని స్థితి. అట్టి పరిస్థితిలో ప్రభుత్వ హాస్టల్లు రావడంతో అండ్ల ఉండి తిని చదువుకున్న తరం ఈ రోజు మంచిమంచి ఉద్యోగాల్లో ఉన్నరు. మధ్యాహ్న భోజనం బడులలో దొరికే ఆ కాలంలో ఎడ్లకాడికి పోయేవాల్లు బడికి వచ్చి చదువుకున్నారు అట్ల చదువువిలువ తెలిసి ఎదిగినవాల్లు తక్కువగానే ఉన్నా అదొక గొప్పతనం. ఆయా కుటుంబాలు విద్యను అందుకొని ఇప్పుడు సమాన జీవన స్రవంతిలో భాగం అయ్యారు.
పల్లెల్లో చురుకైన విద్యార్థి ఉంటే బడి పంతులు వాళ్ళను ఇష్టపడేవారు. వాళ్ళకు ప్రత్యేకంగా క్లాసులు తీసికొని చదివించేవారు. చురుకుదనం చదవాలనే కోరిక కొందరికె సహజంగా రావడం కొందరు లెక్కల్లో, ఆంగ్లంలో ఆసక్తి ఎక్కువగా చూపడం బడిలోనే మొదలవుతుంది.
పల్లెటూరి పిల్లగాండ్లకే పని చదువు, సృజనాత్మకత అన్నీ వస్తయి. ఆ కాలంలో ఎదిగిన వాళ్ళు తక్కువ. అయితే మధ్యాహ్న భోజనం ఆశకో, హాస్టల్‌లో ఉంటే అన్నం దొరకుతుందనే ఆశవల్ల ఎందరో ఈ రోజుల్లో
ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బడిలో విద్య నేర్పిన తమను, ఈ ఉన్నత స్థితికి తెచ్చిన వారిని గుర్తుంచుకొని గౌరవించుకోవడం సంప్రదాయపరంపరగా కొనసాగుతున్నది. ఇదీగాకుండా వివక్ష కూడా కొనసాగిన రోజులు దళితులు బడికి రాకుండా కట్టడి చేయడం, చదువు చెప్పకుండా దూరంగా కూర్చుండపెట్టిన రోజులు కూడా తెలంగాణ ఫ్యూడల్ గ్రామాల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం ప్రజాస్వామిక వాతావరణం హక్కులు, చట్టాలు ఉద్యమాల అనంతరం మార్పు మొదలయ్యింది.
అయితే ఇలా వృద్ధిలోకి వచ్చిన తరం కూడా ఇంకా అభివృద్ధి ఫలాలు, విద్యాగంధం అంటని కులాలను, సంచార ఆదివాసీ, గిరిజన తెగల పిల్లలను ఆదుకోవాల్సిన అవసరం వుంది. తాము మాత్రమే నిచ్చెన పైకి పోవుడు కాదు మరింత మందిని ముందుకు తీసుకపోయేందుకు చిటికెన వేలు పట్టుకొని తీసుకపోవాల్సిన కాలం వచ్చింది.
బడి, ఊరు, పంతుల్లు సామాజిక వికాసానికి మూల మలుపులు, అయితే పంతుల్లల్లోనూ సామాజిక చైతన్యం ఆధునిక భావాలపట్ల ప్రేమ దృక్పథం ఉండాలి. పాత చాంధసత్వం పట్ల అనురాగంతో ఉంటే అంతే సంగతులు. ఆధునిక విద్యవల్లనే అన్నివర్గాల వారు అభివృద్ధిపథంలో వస్తున్నాయి.
బడిపంతులు లేకుంటే ఆయన చెప్పిన అక్షరాలు రాకుంటే ఇప్పటికి ఊర్లల్లనే మగ్గేవాళ్ళు అధికంగా
ఉండేవాళ్ళు. విద్యవల్లనే మానవుడు ఉన్నతుడు కాగలడు. బడులను వృద్ధిలోకి తేవాలి. ప్రభుత్వ బడులే ప్రజలకు క్రియాశీలకమైన విద్యను అందిస్తాయి. ప్రైవేటు బడులంటే విద్యను ఖరీదుగా అమ్ముకోగలవు. ఆ విద్యార్థులు కూడా ఖ్యాతినొంది ప్రపంచస్థాయిలో ఎదగగలరు కానీ శ్రమ జీవన సౌందర్యం అందకుండా సృజనాత్మకతకు దూరంగా ఉండవచ్చు. అందుకే బడిపంతుల్లే పల్లెల్లో మూల సుక్క.
అన్నవరం దేవేందర్