పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగనున్నాయనీ.. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిని, వాటి నాణ్యతను ఈ స్క్వాడ్స్ అకస్మికంగా తనిఖీచేసి ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. స్వచ్ఛతకు అద్దం పడుతూ పచ్చనైన పరిశుభ్రమైన పల్లెల కోసం ప్రభుత్వం గత సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభించి ప్రతిష్ఠాత్మకంగా అమలు పరిచిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందన్నారు. పల్లె ప్రగతిలో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషకరమని అన్నారు. అయితే… ప్రజలు చూపిస్తున్నంత ఉత్సాహాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు చూపించట్లేదనే ఫిర్యాదులు సూచనలు తనకు క్షేత్ర స్థాయినుంచి అందుతున్నాయని సిఎం అన్నారు. ఇంకాకూడా వందశాతం ఫలితాలను రాబట్టాలంటే తనిఖీలు నిర్వహించడం ద్వారా, దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం వుంటుందని.. సిఎం తెలిపారు. పరిస్థితులను బట్టి పల్లె ప్రగతి కార్యక్రమం పురోగతిని తనిఖీ చేస్తామని, కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పినట్టు సిఎం గుర్తుచేశారు. అందులో భాగంగా.. ప్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజా ప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని సిఎం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పంచాయితీరాజ్ శాఖలో పనిచేసే అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వారి జీవితంలో ఊహించని విధంగా పదోన్నతులను కల్పించామని, గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి.. ఎంపీవో, ఎంపీడీవో, డిఎల్పీవో, డిపీవో, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యుటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్ఠపరిచి, శాఖను సజీవంగా తీర్చిదిద్దామని సిఎం అన్నారు. అయితే..ఇంతగనం బలోపేతం చేసిన తర్వాత కూడా ఫలితాలు మెరుగ్గా రావాలని ప్రభుత్వం ఆశించడం సహజమేనని సిఎం అభిప్రాయపడ్డారు. పల్లె ప్రగతిలో భాగంగా, ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా 339 కోట్ల రూపాయలను ఠంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చెప్పారు. పల్లెను అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఆయా జిల్లా కలెక్టర్లను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తున్నామని, పంచాయితీ రాజ్ చట్టంలో కూడా కలెక్టర్లకు ఆ మేరకు అధికారాలను దఖలు పరిచామని సిఎం అన్నారు. పచ్చదనం, పారిశుధ్యతను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్టం చేసినామని, గ్రామోద్యోగుల జీతాలు కూడా పెంచినామని, అందుకు సంబంధించి స్కీంలను కూడా అమలుపరుస్తున్నమన్నారు. ఇన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్నవిధంగా ముందుకు పోకపోతే దానికి కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదే బాధ్యత అని స్పష్టం చేశారు.
”పల్లెలను బాగుచేసుకోవడం కన్నా ప్రభుత్వానికి మించిన పనిలేదు. అధికారుల మీద, ప్రజా ప్రతినిధుల మీద విశ్వాసంతోనే, వారికి కావాల్సినంత వెసులు బాటును సమయాన్ని ఇచ్చినం. అందుకే తనిఖీల కోసం ఆత్రపడలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని భావిస్తున్నం. నూతన సంవత్సరం జనవరి మొదటి తేదీ నుంచి పల్లె ప్రగతి తనిఖీ కార్యక్రమం ప్రారంభించనున్నాం. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు, ఫ్లయింగు స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందచేయడానికి మాత్రమే…” అని సిఎం వివరించారు.
ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, మూడు క్యాడర్లనుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి అధికారికి రాండమ్ పద్ధతిలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున అకస్మిక తనిఖీకోసం బాధ్యతలను అప్పగిస్తామని సిఎం తెలిపారు. ఎవరికి ఏ మండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా వుంచుతుందన్నారు. అకస్మికంగా విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్ చెక్ అవుతుందని తద్వారా ప్రభుత్వానికి సరైన సూచనలు సలహాలు అందుతాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అలసత్వం వహించినట్టు రుజువయిన అధికారుల మీద, వందశాతం పనిచేయని సర్పంచుల మీద, తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం శషబిషలు కానీ మొహమాటాలు కానీ వుండవని సిఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా అలసత్వం వహించినట్టు తేలిన అధికారలును క్షమించే ప్రసక్తే లేదన్నారు. వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర రెడ్డి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరక్టర్ శ్రీదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.