తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న సరికొత్త పవర్ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), జెన్‌కోలు మార్చి 15న ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఇందులో ఖమ్మంజిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌పవర్ ప్రాజెక్టు, నల్గొండజిల్లా దామరచర్లలో ఏర్పాటు చేయనున్న 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు వున్నాయి. ఇవేకాకుండా సదరన్ పవర్ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలో పంపిణీ వ్యవస్థ పటిష్ఠతకోసం అదనంగా రూ.500 కోట్ల రుణం మంజూరైంది.
ప్రస్తుతం పిఎఫ్‌సీ రుణాలపై 12శాతం వడ్డీ వేస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఎంత తక్కువ వడ్డీని తీసుకోగలిగితే అంత మేలవుతుందని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు పీఎఫ్‌సీ ఛైర్మన్ గోయల్ అనుకూలంగా స్పందించారు. దాంతో తాము అందిస్తున్న రుణాలపై 0.5 శాతం వడ్డీ తగ్గిస్తున్నామని అన్నారు. దీనివల్ల 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయలదాకా జెన్‌కోకు వడ్డీపై భారం తగ్గనుంది.
రూ.15వేల కోట్ల రుణంలో ఖమ్మంజిల్లాలోని భద్రాద్రి (మణుగూరు) పవర్ ప్రాజెక్టు 4 1 270 మెగావాట్ల నిర్మాణానికి రూ.6000 కోట్లు, నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించతలపెట్టిన 4400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకోసం రూ.9000 కోట్లు లభించనున్నాయి.
తెలంగాణలోని జెన్‌కో ప్రాజెక్టులకు ఈ పాటికే రూ.4700 కోట్ల పీఎఫ్‌సీ పాత రుణాలున్నాయి. కొత్త పవర్ ప్రాజెక్టుల కోసం రూ.15వేల కోట్లు, అలాగే సదరన్ పవర్ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్) పంపిణీ వ్యవస్థ పటిష్ఠత కోసం రూ.5000 కోట్ల రుణం అందజేయడంవల్ల మొత్తం రూ. 20,000 కోట్ల రుణం అందినట్లయ్యింది.
ఇది ఇలా ఉండగా, భద్రాద్రి థర్మల్‌పవర్ ప్రాజెక్టు నిర్మాణవ్యవయాన్ని బిహెచ్‌ఈఎల్ రూ.5308 కోట్లుగా నిర్ణయించి ప్రతిపాదనలు అందజేసింది. అయితే జెన్‌కో బోర్డు 5,144కోట్లకు ఖాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరుసగా బిహెచ్‌ఈఎల్‌కే కొత్త ప్రాజెక్టు పనులను అప్పగిస్తున్నందుకుగానూ నిర్మాణ వ్యయాన్ని మరింత తగ్గించేదిశగా ఆలోచించాలని బీహెచ్‌ఈఎల్ ఛైర్మన్ ప్రసాదరావును కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రసాదరావు ప్రాజెక్టు వ్యయంలో వందకోట్ల మేరకు జెన్‌కోకు వెసులుబాటు కల్పించారు. అలాగే కొత్తగూడెంలో 800 మెగా వాట్ల ప్రాజెక్టు నిర్మాణంలో కూడా రూ.490 కోట్ల వెసులు బాటు కల్పించారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రెండు ప్రాజెక్టులకింద జెన్‌కోకు రూ.590 కోట్ల భారం తగ్గింది.