ts12

విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్ళి మోసపోయి వెనుదిరిగి వచ్చేవాళ్ళు, నకిలీ ఏజెంట్ల చేతిలో నష్టపోతున్నవారు, పాస్‌ పోర్టులు కోల్పోయి గల్ఫ్‌ జైళ్ళలో మగ్గుతున్నవాళ్ళు, స్వగ్రామాల అభివద్ధికి ఏమైనా చేద్దామని వున్నా ఎలా చేయాలో తెలియని ప్రవాసీయులు వీరందరి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్తంగా కార్యాచరణకు నాంది పలికాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని హెచ్‌.ఐ.సి.సి.లో కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రవాసుల సమస్యలపై విదేశీ సంపర్క్‌ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు కూడా కుదిరాయి.

ప్రవాస భారతీయల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పనిచేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్‌ చెప్పారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, విదేశాలలో మూడు కోట్ల మంది భారతీయులు ఉన్నారని, తెలంగాణా నుండి ఎక్కువ మంది గల్ఫ్‌, తదితర దేశాలలో ఉన్నారని తెలిపారు. నకిలీ ఏజెంట్ల వల్ల ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ప్రగతిశీలంగా పురోగమిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పరిశ్రమలకు సత్వరం అనుమతులు మంజూరు చేసేందుకు అవలంబిస్తున్న సింగిల్‌ విండో విధానం బాగుందని ప్రశంసించారు.

విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌ సైట్లో ప్రభుత్వం ఆమోదించిన ఏజెంట్ల వివరాలు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలను పొందుపరిచినట్లు కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నకిలీ ఏజెంట్ల పైన కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల

ఉపయోగార్థం, విదేశీ విశ్వ విద్యాలయాల వివరాలను వెబ్‌ సైట్లో ఉంచుతామని అన్నారు. విదేశాలకు వెళ్లే భారతీయుల అవగాహన కొరకు ‘ సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి’ అనే అంశంపై ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. పాస్‌ పోర్టుల జారీని సరళతరం చేసేందుకు దేశంలోని 800ల పైబడిన పోస్టాఫీసులలో పాస్‌ పోర్టు సేవాకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విదేశాలలో ఉన్న వారికి న్యాయ సహాయం అందించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ఎన్‌.ఆర్‌.ఐ వ్యవహారాలు, ఐ.టి శాఖల మంత్రి కె.టి. రామారావు మాట్లాడుతూ, తెలంగాణ నుండి ఎక్కువ మంది కార్మికులు గల్ఫ్‌ దేశాలకు వెళ్లారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కషి చేస్తోందని అన్నారు. విదేశీ యూనివర్శిటీలలో ప్రవేశాలపై యువతకు అవగాహన కల్పించాలని కోరారు. తెలంగాణా రాష్ట్రంలో సౌదీ అరేబియా 2వ కాన్సులేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ, విదేశాలలోని కార్మికులకు న్యాయ సహాయాన్ని అందించాలని అన్నారు.

తెలంగాణాలో పాస్‌ పోర్టు ప్రాజెక్టును ప్రయోగా త్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆన్‌ లైన్‌ ద్వారా పాస్‌ పోర్టు దరఖాస్తుల స్వీకరణకు మీ-సేవ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు కె.టి.ఆర్‌ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో విదేశీ భవనానికి స్థలాన్ని కేటాయించనున్నట్లు, ఇందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అంగీకరించారని కె.టి.ఆర్‌.తెలిపారు. విదేశాలకు వెళ్ళే వారి కోసం ఇంగ్లీషులో ఉన్న పుస్తకాలను తెలుగులో అనువదించి ప్రచురించినట్లు తెలిపారు.

2019లో ప్రవాస భారతీయ దివస్‌ నిర్వహించే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రానికి కల్పించాలని కోరుతూ, ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాసిన లేఖను కెె.టి.ఆర్‌. కేంద్ర మంత్రికి అందజేశారు.

తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామన్నారు. టి ఎస్‌ ఐపాస్‌ ద్వారా 15 రోజులలో దరఖాస్తులను పరిష్కరిస్తామని కార్మిక, హోం శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. 45 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఇంకా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. అసదుద్దీన్‌ ఓవైసీ, విదేశీ వ్యవహారాల కార్యదర్శి, డాక్టర్‌ ధ్యానేశ్వర్‌ మూలే, ప్రభుత్వ సలహాదారు బి.వి. పాపారావు, సి.ఎస్‌. ఎస్‌.పి. సింగ్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆధార్‌ సిన్హా, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌ కుమార్‌, డిజిపి అనురాగ్‌ శర్మ, సెక్రెటరీ టూరిజం బి.వెంకటేశం, హైదరాబాదు రీజనల్‌ పాస్‌ పోర్టు ఆఫీసర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, వివిధ జిల్లాల అధికారులు, కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Other Updates