ముస్లిములకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్’ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు వర్షించే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర దివ్య ఖుర్ ఆన్ గ్రంథం అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది. వేయి మాసాల కన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైతుల్‌ఖద్ర్’ ఈనెలలోనే ఉంది. ఈ మాసంలో చేసే ఒక్క సత్కార్యానికి అనేక రెట్లు అధికంగా పుణ్యఫలం లభిస్తుంది. ఒక విధిని ఆచరిస్తే డెబ్భైవిధులు ఆచరించిన దానితో సమానమైన పుణ్యం లభిస్తుందట. విధి కానటువంటి చిన్న సత్కార్యం చేస్తే విధిగాచేసే సత్కార్యంతో సమానమైన పుణ్యం లభిస్తుంది. సమాజంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ‘ఫిత్రా’ ఆదేశాలు కూడా ఈ మాసంలోనే అవతరించాయి. ఫిత్రా అన్నది పేదసాద హక్కు. ఫిత్రా వల్ల వారికి ఆర్థికంగా కాస్తంత ఊరట భిస్తుంది. ‘జకాత్’ కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ‘తరావీ నమాజు’ కూడా ఈ నెలలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యాలు మూటగట్టుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. ఈ పవిత్ర మాసంలో ఎవరైతే ధర్మనిష్టతో ఆత్మపరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రంజాను రోజా పాటిస్తారో వారు గతంలో చేసిన పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు.
ఆకాశ గ్రంథాలు అవతరించిన మాసం
ఈనెల చాలా ప్రాశస్త్యమును సంతరించుకుంది. ఇందుకు ముఖ్యకారణం ‘ఆకాశ గ్రంథాలు’ అన్నీ ఈనెలలోనే రావడం. ‘దివ్య ఖుర్‌ఆన్’ కూడా ఈ వరుసలో ఆఖరి ఆకాశగ్రంథం. మానవాళి జీవితాలను కాంతిమంతం చేసే గ్రంథరాజమిది. అద్భుతమైన ఈ మాసంలో ఖుర్‌ఆన్ అవతరణ దేవుడిచ్చిన అపురూప వరం. దివ్య ఖుర్‌ఆన్ మనిషి గురించి మాట్లాడుతుంది. మానవ జీవితంలోని ప్రతి అంశం గురించి ఇందులో చర్చించబడిరది. దివ్య ఖుర్‌ఆన్‌ను చదివి అందులోని విషయాలను, అర్థాన్ని గ్రహించి ఆకళింపు చేసుకోవాలి. ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించుకుని ఆచరణాత్మక సంస్కరణకు కృషి చేయాలి. ఇందులోని ఒక్కొక్క వ్యాఖ్య చదివిన ప్రతిసారి కొత్త అర్థాన్ని, సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ వ్యాఖ్యలు నాకై అవతరించాయి కాబోలు అన్న భావం మనకు ఖుర్‌ఆన్ చదువుతుంటే కలుగుతుంది.
ఖురాన్ ఏంచెబుతోందంటే…
భక్తి, సోదర మానవుల ఎడ మన ప్రవర్తన, పేదసాదకై ఆరాటం, అన్నార్తులను ఆదుకునే భావాలు మనిషిలో జనించాలి. మానవీయత, సానుభూతి, ప్రేమ, సోదర మానవులకై స్పందించే విశాల గుణం మేల్కొనాలి, అనాథలను ఆదరించే విధానం వెల్లువలా ఉప్పొంగాలి. దుష్కార్యాలకు దూరమవ్వాలి. దేవుని గుణగణాలు, అతని అభీష్టం, మనిషి సాఫల్యం మొదలైన విషయ వివరణ మన ముందుంచుతుంది. మనిషి సాఫల్యానికి చక్కని రాజమార్గాలను చూపుతుంది. ఇహలోక విజయంతోపాటు పరలోక సాఫల్యం లభించే సులభమైన మార్గాలను విపులీకరించింది. అల్లాహ్ మీకు సన్మార్గం చూపించాడు. అందుకుగాను మీరు కృతజ్నులై ఉండాలి. ఉపవాసం ఇందుకు ఒక పద్ధతి అంటుంది పవిత్రమైన దివ్య ఖుర్ ఆన్.
30 రోజులు… మూడు భాగాలు
పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులను మూడు భాగాలుగా పరిగణిస్తారు. ఒకటి నుండి 10వ రోజు వరకు మొదటి భాగం. దీనిని ‘రహమత్’ అంటారు. ఈ భాగం కారుణ్యభరితమైనది. 11 నుండి 20వ రోజు వరకు రెండవ భాగం. దీనిని ‘బర్కత్’ అంటారు. ఈ మధ్యభాగం దైవమన్నింపు లభించేది. 21 నుంచి 30వ రోజు వరకు ఉండేది ‘మగఫిరత్’ అంటారు. ఈ చివరి భాగం నరకం నుంచి విముక్తి కలిగించే సాఫ్యం చేకూర్చేది. ఈ మాసంలో మనిషి చేసే సత్కార్యం ప్రతిఫలాన్ని పది నుండి ఏడువందల రెట్లు పెంచడం జరుగుతుంది.
స్వర్గద్వారాలు తెరిచే సమయం
రోజేదాయి ‘రయ్యన్’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారు. కనుక ప్రతి ఒక్కరూ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి. రంజాన్ నెల మొదటి రాత్రి రాగానే సైతాన్, తబిరుసు బిన్ను కట్టివేయబడతారు. నరక ద్వారాలన్నీ మూసి వేయబడతాయి. స్వర్గద్వారాలన్నీ తెరవబడి ఉంటాయి.
నమాజు ప్రత్యేకం…
రంజాన్ మాసంలో నమాజుకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇస్లాంలో రోజు చదివే అయిదు, పండగ రోజుల్లో చదివే ప్రత్యేక నమాజు ఉన్నాయి. కాగా మహ్మద్ ప్రవక్త ఆచారంగా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ‘తరావీ నమాజ్’ చదువుతారు. ఈ సందర్భంగా ఖురాన్‌ను కంఠస్థం చేసిన వ్యక్తి (హపేజ్-ఏ-ఖురాన్) ఖురాన్‌ను చదివి వినిపిస్తారు. ఈ నమాజులో 20 రకాత్, 40 రుకూలు, 80 సజ్దాలు ఉంటా యి. ప్రత్యేకమైన తరావీ నమాజ్ మహ్మద్ ప్రవక్త కాలంలో ప్రారంభమైంది. ఈ నమాజు రంజాన్ చంద్రదర్శనంతో ప్రారంభించి షవ్వాల్ చంద్రదర్శనంతో ముగిస్తారు. తరావీ నమాజ్ పఠనం వల్ల పవిత్రతతో ’భించడంతోపాటు, అల్లాహ్ కోరిన కోరికలు నెరవేరుస్తారని ఖురాన్ పేర్కొంది.
ఉపవాసా’తో బహుళ ప్రయోజనాలు
రంజాన్ మాసంలో పవిత్ర మనసుతో, శరీర పరిశుద్ధతతో, నిష్ఠగా, నిష్కల్మషంగా, పుణ్యఫలాపేక్షతో ఎవరైతే రోజా పాటిస్తారో వారి గతకాలపు పాపాలన్నీ క్షమించబడతాయని మహ్మద్ ప్రవక్త సెలవిచ్చారు. ఉపవాసాలు మానసిక ప్రక్షాళనకు, వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు. ఇస్లామియా ఆరాధనలన్నీ మనిషిని ఉత్తముడుగా తీర్చిదిద్దే శిక్షణలుగానే ఉన్నాయి. ఉపవాసాల లక్ష్యం ‘తఖ్వా’ (దైవభీతి, దైవప్రీతిగ నిష్ఠాత్మక జీవితం) చెడుపనులకు, చెడుచూపు, చెడు నడక, చెడు చేతలు, చెడు అలవాట్ల నుండి విముక్తి పొందడానికి అత్యుత్తమ శిక్షణ ఉపవాసాలు. ఉత్తమస్థాయి దైవదాసునిగా మంచిని స్థాపించి, చెడును నిరోధించే అత్యుత్తమ శాంతి సైనికునిగా మలచే సాధనాలు రంజాన్ ఉపవాసాలు. రంజాన్ ఉపవాస దీక్ష వల్ల అనేక శారీరక, ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ, ప్రక్రియకు కొంతసేపు విరామం ఇవ్వడం వల్ల జీర్ణశక్తి మరింతగా అభివృద్ధి చెందుతుంది. కాలేయానికి కూడా విరామం భించడం వల్ల అది మరింత శక్తిమంతంగా తయారవుతుంది. ఉపవాసాల వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. తద్వారా ఊబకాయంతో బాధపడే వారికి బరువు తగ్గించుకోవడానికి సహాయకారిగా నిలుస్తాయి. శరీరంలో గ్లూకోజ్, ఇన్సూలిన్ శాతం క్రమబద్దీకరించబడుతుంది. ఉపవాసం రక్తపోటును తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
రెమటాయిడ్ ఆర్థిరైటిస్, ఆర్థరైటిస్ సమస్యలు, వివిధ రకాల చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 1975లో అన్ కాటన్ అనే రచయిత రాసిన ‘ఫాస్టింగ్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్’ అనే పుస్తకంలో ఆయన ఉపవాసం అన్నది జీర్ణ ప్రక్రియలో, కేంద్రనాడీ వ్యవస్థలో పూర్తిస్థాయి మానసిక విరామాన్ని తీసుకురావడంతోపాటు జీవక్రియ క్రమబద్దీకరించ బడుతుందని పేర్కొన్నారు. జోర్డాన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సోలిమాన్ 1948లో 42 మంది పురుషులు, 26 మంది మహిళలపై చేసిన ప్రయోగాల ప్రకారం ఉపవాసం పాటించడం వల్ల బరువుగల పురుషులలో సుమారు 6 నుండి 7 కిలోలు, మహిళల్లో 4 నుండి 5 కిలోలు బరువు తగ్గడాన్ని గమనించినట్టు వెల్లడించారు. రంజాన్ నెలలో చదివే అదనపు తరావీహ్ నమాజు వల్ల రాత్రి తిన్న భోజనంలో సుమారు 200 కాలరీల భోజనం ఇట్టే జీర్ణమవుతుందట. కాగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, టైప్-1 డయాబెటిక్ పేషెంట్లు ఉపవాసాలు పాటించకపోవడం ఆరోగ్యరీత్యా ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
సహర్… ఇఫ్తార్
మహ్మద్ ప్రవక్త ఆచారం ప్రకారం రంజాన్ మాసంలో సహర్, ఇఫ్తార్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం వేళ పళ్లు ఫలాలు ఆరగించే సమయాన్ని ‘ఇఫ్తార్‘ అని, రోజా అనంతరం తెల్లవారుజామున భోజనం చేసే సమయాన్ని ‘సహర్’ అని అంటారు. రంజాన్ నెలలో ప్రతి ముస్లిం ఇంట్లో, ప్రతి మసీదులో ఇప్తార్, సహర్ హడావుడి కనిపిస్తుంది. ఈనెలలో ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ.
దానధర్మాలు…
ప్రత్యేక ప్రార్థనలు, నమాజులు, ఉపవాస దీక్షలతోపాటు దానధర్మాలకు రంజాన్ మాసంలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు పాపవిమోచన చేస్తాయని, ఆత్మశాంతి చేకూరుస్తాయని దివ్య ఖుర్‌ఆన్ ప్రబోధిస్తోంది. రంజాన్ మాసంలో ఫిత్రా(దానం) ఇవ్వడం అనేది మహ్మద్ ప్రవక్త కాలం నుంచి ఆచారంగా వస్తోంది. పవిత్ర రంజాన్ నెలలో ఉపవాస కాలంలో అనుకోకుండా జరిగే పొరపాట్లనుండి క్షమార్పణగా ఫిత్రా దానాలు చేస్తారు. రోజా పాటించే వారు నిరుపేదలు ఎవరికైనా ఫిత్రా ఇవ్వొచ్చు. ఫిత్రాలో భాగంగా 1.75 కిలో గోధుమలు లేదా 2.75 కిలో జొన్నలు ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో దివంగతుల పేరిట ‘ఇసా అలై సవాబ్’ (దాన ధర్మాలు, పుణ్యకార్యాలు) చేస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతోపాటు పాప ప్రక్షాళన జరుగుతుందని మహ్మద్ ప్రవక్త పేర్కొన్నారు. రంజాన్ మాసంలో రోజా ఆచరించే వారితో పాటు ‘జకాత్’ ‘ఫిత్రా’ ఇచ్చే వారికి 70 శాతం అధికంగా ఫుణ్యఫలం దక్కుతుంది. అలాగే బైతుల్‌మాల్‌కు విరాళాలు ఇచ్చిన వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. జీవన అవసరాకు మించి ఆర్థిక స్తోమత ఉన్నవారు బైతుల్‌మాల్ నిధిలో తాము దానం చేయదలచుకున్న డబ్బును జమ చేయొచ్చు.
వంట గుమగుములు..
రంజాన్ అనగానే అందరికి టక్కున గుర్తొచ్చేవి హలీం, హరీస్. ముస్లింలే కాక అందరూ ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ రంజాన్ ప్రత్యేక వంటకాలు నెలంతా లభిస్తాయి. రంజాన్ నెలలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హలీం, హరీస్ విక్రయ దుకాణాలు వెలుస్తాయి. మన రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ రుచికరమైన హలీం, హరీస్ వంటకాలకు ప్రసిద్ధి. నిపుణులైన వంటగాళ్లను రప్పించి కోడిమాంసం, మేక మాంసంతోపాటు గోధుము, ఖాజు, బాదామ్, నెయ్యి తదితర పోషకసంపన్నమైన పదార్ధాలను ఉపయోగించి నోరూరించే హలీం, హరీస్‌ను తయారుచేస్తారు.