yatraఈ ప్రపంచంలో వున్న దాదాపు 150 కిపైగా దేశాలకు చెందిన ముస్లింలు హజ్‌యాత్రకు వెళ్తారు. ఇది ఒక అపురూప సంగమంగా భావిస్తారు ముస్లింలు. ఈ హజ్‌ యాత్రలో పురుషులతో పాటు మహిళలు కూడా పాల్గొంటారు. వీరందరూ కూడా స్వచ్ఛతకు సంకేతంగా, పవిత్రతకు చిహ్నంగా తెల్లటి వస్త్రాలను ధరిస్తారు.
ప్రపంచ మసీదులలోకెల్లా ఉత్తమమయినవి, అత్యంత పెద్దవైన, మక్కాలోని బైతుల్లాహ్, మదీనాలోని నబవీలలో మహమ్మదీయ స్త్రీ, పురుషులందరూ కలిసికట్టుగా పక్క పక్కనే నిలబడి నమాజు చేస్తారు. మసీదులలోకి స్త్రీలు ప్రవేశించడం నిషిద్ధం అనే వారికి ఈ దృశ్యాలు ఓ చెంపపెట్టు.

సమస్త మానవజాతి అంతా ఒకటే. మనలో ఎవరూ మరొకరికంటే తక్కువకాదు. నిరంతర కర్తవ్య పరాయణులే దైవానికి ప్రీతిపాత్రులు. హజ్‌ యాత్రకు వెళ్ళేవారిని హజీని అంటారు. హజీలంటే అల్లాహ్ అతిథులు. తెలుపు వర్ణం స్వచ్ఛతకు ప్రతీక. ఎక్కడా కుట్టబడని తెల్లని వస్త్రాలు ధరించిన హజీలు, దైవం ముందు అప్పుడే పుట్టిన శిశువులతో సమానం.

ఎల్లకాలం గంగా జమునా తహజీబ్‌గా వెలుగొందేటట్లు, ప్రజలందరూ శాంతి, సౌఖ్యం, సామరస్యాలతో అలరారేటట్టు అల్లాహ్ ను  ప్రార్థించండి అని హజ్‌ యాత్రకు వెళ్ళే బృందాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. హైదరాబాద్‌ ఎంబార్కేషన్‌ పాయింట్‌ దగ్గర నుంచి ఈ సారి దాదాపు ఐదున్నర వేలమంది పవిత్ర హజ్‌ యాత్రకు బయలుదేరారు. ఇందులో సగం మంది తెలంగాణీయులు వున్నారు. రాష్ట్రం నుండి హజ్‌యాత్రకు బయలుదేరిన తొలి బృందంలో 1020 మంది హజ్‌కు బయలుదేరారు.

సెప్టెంబర్‌ 2న హజ్‌హౌస్‌ నుండి బస్సులో విమానాశ్రయానికి వెళ్ళిన తొలిబృందానికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేసి వీడ్కోలు పలికారు.

హజ్‌ శిబిరంలో వున్న యాత్రికులను పలుకరించిన కేసీఆర్‌ వారందరినీ ఉద్దేశించి ఉర్దూలో ప్రసంగించారు. హజ్‌యాత్రకు అందరూ వెళ్ళలేరు. అలా వెళ్ళే అవకాశం లభించిన మీరందరూ అదృష్టవంతులని అన్నారు. అల్లా అతిథిలుగా వెళ్తున్న మీరంతా మన రాష్ట్ర ఉన్నతిని కాంక్షిస్తూ ప్రార్థనలు చేయాలని అన్నారు. పవిత్ర హజ్‌లో చేసే ప్రార్థనలు తప్పక ఫలిస్తాయని అన్నారు. నిజాం రాష్ట్రం నుండి వెళ్ళే హజ్‌ యాత్రికుల కోసం నిజాం ఆనాడే, మక్కాకు పక్కన నిజాం రంబాత్‌ నెలకొల్పారని గుర్తు చేశారు. ఈ రంబాత్‌లో మన రాష్ట్ర యాత్రికులకు వసతి సౌకర్యం అందుబాటులో వుంది అన్నారు.

గత రెండేండ్లుగా ఆగిపోయిన రంబాత్‌ సౌకర్యాలు సిఎం కె.సి.ఆర్‌ చొరవతో తిరిగి మొదలయ్యాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తెలియజేశారు. ఇదివరకు రంబాత్‌లో వసతి సౌకర్యం మాత్రమే వుంటుండేదని, ఇప్పుడు అక్కడ భోజనం, లాండ్రీ వంటి ఇతర సౌకర్యాలు ఉచితంగా లభిస్తున్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలతో, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో హజ్‌ యాత్రికులకు సౌకర్యాలను కల్పించే అంశంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ఏ షుకూర్‌ వివరించారు. ఈ కార్యక్రమానికి జామే నిజామియా ఇస్లామిక్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ముస్తీఖలీల్‌ అహ్మద్‌ రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జాఫర్‌ హుస్సేన్‌, షకీల్‌ అహ్మద్‌, ఎమ్మెల్సీ మహ్మద్‌ సలీం, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ, డైరెక్టర్‌ ఎం.జే.అక్బర్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఎంజీ షఫీ ఉల్లా తదితరులు హాజరయ్యారు.

Other Updates