sampadhakayamదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు రెండేళ్ళు.

ప్రత్యేక తెలంగాణతోనే తమ జీవితాలు బాగుపడతాయని నమ్మి, దశాబ్దాలపాటు పోరుసాగించిన ప్రజానీకానికి ఇవి నిజంగా ఆనంద క్షణాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే జరగరానిది ఏదేదో జరిగిపోతుందని, ప్రజలను భయపెట్టి, భంగపరచి, వంచించి , ప్రక్కదారిపట్టించే ప్రయత్నం చేసిన నయవంచకులకు ఇది చెంపపెట్టు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్ళు పూర్తయింది. బాలారిష్టాలను అధిగ మించి అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. ఒక రాష్ట్ర చరిత్రలో రెండేళ్ళ కాలం పెద్దదేమీ కాదు. కానీ, కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తంచేయడం, మన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా నిలవడం, కేంద్ర ప్రభుత్వం సయితం ప్రశంసించడం నిజంగా గర్వకారణమే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే పరాయి పాలకుల అక్రమాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా, నీళ్ళు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాగింది.ఉద్యమ నేత కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే సామాజిక సర్వే నిర్వహించింది. ప్రజావసరాలను వాస్తవదృక్పథంతో తెలుసుకున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా పాలన సాగిస్తోంది.

ఆసరా పెన్షన్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రెండు పడకగదుల ఇళ్ళు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌… ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రారంభించినా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేదే కావడం రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా నిలుపుతోంది. మిషన్‌ భగీరథ వంటి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి కాకుంటే, వచ్చే ఎన్నికలలో ఓట్లు కూడా అడగమని శాసన సభ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సాహసం ప్రశంసనీయం. అనుకున్నది సాధించే దీక్షాదక్షతలు, పట్టుదల, ప్రజలకు మేలు చేయాలన్న దృఢ సంకల్పబలమే ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనలో అంతరార్థం. భారతదేశ చరిత్రలో ఇంతటి సాహసోపేత ప్రకటనచేసిన నేతలు ఎవరూ కాగడావేసి చూసినా కానరారు. అందుకే మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిజమైన ప్రజానాయకునిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో కూడా దేశంలోనే ప్రజాదరణ గల ముఖ్యమంత్రులలో కె.సి.ఆర్‌ను ప్రథమ స్థానంలో నిలిపిందంటే, దానికి కారణం ఆయన పాలనా విధానాలే.

తెలంగాణ ప్రాంతం ఇంత కాలంగా ఆదాయ వనరులు లేకనో , మానవ వనరులు లేకనో వెనుకబడి పోలేదు. మనం గతంలో ఈ కాలమ్‌లోనే చెప్పుకున్నట్టుగా ఏం తక్వ తెలంగాణకు? గతంలో సమైక్యరాష్ట్రంలో ప్రజలకు జరిగిన నష్టం ఏమిటో, జరగాల్సిన న్యాయం ఏమిటో స్పష్టంగా తెలిసిన కె.సి.ఆర్‌ పాలనా పగ్గాలు చేపట్టి జనరంజక పాలన సాగించడం తెలంగాణ ప్రాంతానికి కొత్త ఊపిరులూదింది. ఈ జైత్రయాత్ర ఇలాగే కొనసాగుతుంది. ఇలాగే కొనసాగాలి. అప్పుడే బంగారుతెలంగాణ లక్ష్యాన్ని అనతికాలంలోనే ముద్దాడగలం.

Other Updates