దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన, అతి పిన్నవయస్సుగల తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతోందని రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ పేర్కొన్నారు. జనవరి 26న సికిందరాబాద్ లోని పరేడ్ మైదానంలో కనుల పండువగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ సాధించిన విజయాలు, అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు.
వేడుకల్లో పాల్గొనడానికి తొలుత పరేడ్ మైదానానికి వచ్చిన గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ నరసింహన్ సైనిక దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు పటాలాలు నిర్వహించిన కవాతును వీక్షించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్ తెలిపారు. ప్రజల ముంగిటకే పాలనను అందించే లక్ష్యంతో గతంలోగల 10 జిల్లాలకు అదనంగా మరో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరిగి, జిల్లా సగటు జనాభా మూడు లక్షలుగా ఉండటంతో పరిపాలనా సౌలభ్యం ఏర్పడిందని తెలిపారు.గోదావరి, కృష్ణా జలాలను సంపూర్ణంగా వినియోగించుకొని తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టిందని, వాటిలో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు, డిండి, సీతారామ ప్రాజెక్టులు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలోని చెరువులు గతవైభవాన్ని సంతరించు కుంటున్నాయని అన్నారు. రూ.42,000 కోట్లతో ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం 2018 నాటికి పూర్తవుతుందని, ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు చేపట్టిన హరితహారం, పేదల సంక్షేమానికి అమలుచేస్తున్న ఆసరా, డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు ప్రభుత్వం జీవనభృతి అందించనున్నట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం అమలుచేస్తున్న పథకాలు, దళితులకు భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ చదువులకోసం అందిస్తున్న స్కాలర్ షిప్, తదితర అంశాలను గవర్నర్ ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, హాస్టళ్ళలో, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా, మైనారిటీల సంక్షేమానికి చేపట్టిన పలు పథకాల గురించి గవర్నర్ వివరించారు.
రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ, జోగులాంబ, భద్రాద్రి, ధర్మపురి, బాసర దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేయడంతోపాటు, పోలీసు వ్యవస్థను అన్నివిధాలా బలోపేతం చేస్తోందని, షీ టీములు మహిళలకు రక్షణ కల్పించడంలో సఫలమయ్యాయని, మాజీ సైనికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని గవర్నర్ తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు సాగునీటి వసతి కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడంతోపాటు , రైతులకు రూ.17,000 కోట్ల రుణాలు రద్దు చేసిందన్నారు. చేపల పెంపకం, పాడిపరిశ్రమ
అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది.
సులభతర వ్యాపార నిర్వహణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, టి.ఎస్.ఐపాస్ విధానంతో పెట్టుబడులు పెద్దఎత్తున తరలివస్తున్నాయని, 3వేల పరిశ్రమల ద్వారా 2 లక్షల మందికి ఉపాధి లభించడంతోపాటు, 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి సమకూరాయని చెప్పారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు.
రాష్ట్రంలో అనేక పథకాలు ప్రజాసంక్షేమం దిశగా అమలుచేస్తున్నామని, ఇకపై రాబోయే రోజుల్లో కూడా యావన్మంది తెలంగాణ ప్రజలు ఆనందంగా జీవనం గడిపేందుకు ప్రభుత్వం ఇక ముందుకూడా తగిన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తుందని గవర్నర్ చెప్పారు.
అమరవీరులకు సి.ఎం ఘన నివాళి
ఉదయం పరేడ్ మైదానం లో గల అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర రావు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడుతూ రిజిస్టర్లో సందేశం రాశారు.