తెలంగాణ భూ సర్వే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో వంద శాతం భూ సర్వేను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శరత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. జిల్లాలోని 18 మండలాల్లో 291 గ్రామాల్లోని భూ రికార్డులను సవరించినట్లు తెలిపారు, వివాద రహితమైన 99.18 శాతం భూములను పార్ట్-ఎ భూములుగా నిర్ధారించినట్లు చెప్పారు.
4,52,920 తప్పులను సవరించి రికార్డుల శుద్ధీకరణ చేపట్టినట్లు కలెక్టర్ శరత్ వివరించారు. ఈ సందర్భంగా మల్యాల మండలం రాంపూర్ గ్రామ భూముల వివరాలు, నక్షలు, మ్యాప్ లతో రూపొందించిన చేతిరాత పహాణిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 శాతం పూర్తి చేసినందుకు కలెక్టర్ శరత్‌ను, రెవిన్యూ అధికారులను అభినందించారు.
టన్నెల్ పరిశీలన
ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పెద్దపల్లి జిల్లా మేడారం (ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు (ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్ యార్డులను సీఎం పరిశీలించారు.
మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి 9.53 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా మేడారం గ్రామ పరిధిలోని భూగర్భ సర్జిపూల్‌కు చేరుతుంది. 9.53 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్‌ను), పది డయామీటర్ల ‘డి’ ఆకారపు వ్యాసార్థంలో నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నింటీనీ సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. మేడారం సర్జిపూల్ చేరిన నీటిని మేడారం చెరువులోకి పంపడానికి 124.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు పంపులను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కేసీఆర్‌కు వివరించారు. అటవీప్రాంతం, కొండలు, గుట్టలున్న ప్రాంతం కావడంతో మేడారంలో 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్‌ను కూడా భూగర్భంలో నిర్మించినట్లు సీఎండీ చెప్పారు. పంపుసెట్ల తయారీ బాధ్యతలు తీసుకున్న బీహెచ్‌ఈఎల్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మొత్తం ఏడు పంపులకు గానూ వచ్చే జూన్ లోగా రెండు పంపులను బిగిస్తామని, మిగతావి డిసెంబర్ నాటికి అందిస్తామని బీహెచ్‌ఈఎల్ జీఎం సుందర్‌రాజన్ చెప్పారు.
కన్నెపల్లి వద్ద నీటి పంపింగ్ జరిగిన తర్వాత అన్నారం, సుందిళ్ళ ద్వారా మేడారం వరకు చేరే నీటిని 105 మీటర్ల మేర లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. వేసవి లోగా అన్ని పనులు పూర్తి చేసి నీటి లిఫ్ట్‌కు, పంపింగ్‌కు సిద్ధం కావాలని సూచించారు. మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా సీఎం పరిశీలించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. మేడారం నుంచి రామడుగు(లక్ష్మీపూర్) వరకు 15 కిలోమీటర్ల టన్నెల్‌ను, 5.7 కిలోమీటర్ల కెనాల్‌ను సీఎం పరిశీలించారు. లక్ష్మీపూర్ వద్ద పంప్‌హౌజ్‌ను, సర్జిపూల్‌ను, 400 కేవీ సబ్‌స్టేషన్‌ను కేసీఆర్ చూశారు.
లక్ష్మీపూర్ వద్ద నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఏడు పంపులు నడిపించడానికి అవసరమైన 973 మెగావాట్ల విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిఫ్ట్ చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని సీఎం సూచించారు. ప్రతీ రోజు 2 టీఎంసీల నీటిని పంప్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత మేర నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని సీఎం చెప్పారు. వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీని మిడ్ మానేరుకు పంపాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వరద కాల్వ దాకా నీరు చేరే ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనదని, అన్ని పనులు సమాంతరంగా, పటిష్టంగా, సకాలంలో జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ కోరారు. పనులను పరిశీలించే సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులు, ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.