tsmagazine
హైదరాబాద్‌ పాతబస్తీలో రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేని, మురికి నీరు రోడ్లపై ప్రవహించని, విద్యుత్‌ సమస్యలు లేని, మంచినీటి ఎద్దడి లేని, ట్రాఫిక్‌ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. రంజాన్‌ నెల ప్రారంభానికి ముందే తాను పాత బస్తీలో పర్యటించి ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రకటిస్తానని, ప్రణాళిక తయారు చేయాలని, అన్ని సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెలకు రెండు సార్లు పాత బస్తీ అభివద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ మౌలిక సదుపాయాలే కాకుండా రూ.1600 కోట్లతో చేపట్టే మూసీ నది ప్రక్షాళన, ఆధునీకరణ పనులను, రూ.1200 కోట్లతో చేపట్టిన మెట్రో రైలు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

పాతబస్తీలో విద్యుత్‌, మంచినీరు, సీవరేజి, నాలాలు, ఎస్‌.ఆర్‌.డి.పి. తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ప్రగతి భవన్‌’లో సుదీర్ఘ సమీక్ష జరిపారు.

సమైక్య పాలనలో పాతబస్తీ చాలా నిర్లక్ష్యానికి గురైందని, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ముఖ్యమంత్రి అన్నారు. పాత బస్తీలో విద్యుత్‌ కోతలని, మంచినీటి ఎద్దడని, రోడ్లు సరిగా లేవని, మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందని తాను 30 ఏళ్ల నుంచి వింటున్నానని సీఎం అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగడానికి వీలులేదని, పాతబస్తీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

”పాతబస్తీలో విద్యుత్‌ సంబంధిత సమస్యలన్నింటికీ పుల్‌ స్టాప్‌ పెట్టాలి. నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కొత్తగా మరో ఐదు 33/11 కెవి సబ్‌ స్టేషన్లు నిర్మించాలని తలపెట్టాం. వెంటనే స్థల సేకరణ జరపాలి. నిర్మాణాలు ప్రారంభించాలి. ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యకు అనుగుణంగా రోలింగ్‌ స్టాక్‌ ను ఏర్పాటు చేయాలి. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు మార్చాలి. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుకు పాతబస్తీలోనే షెడ్డు ఏర్పాటు చేయాలి. ఈ పనులన్నీ వెంటనే చేపట్టాలి. త్వరలోనే ఒకదాని తర్వాత ఒకటి రంజాన్‌, వినాయక చవితి, బోనాల పండుగలు వస్తున్నాయి. వాటికోసం విద్యుత్‌ వినియోగం ఎక్కువవుతుంది. దీనికోసం విద్యుత్‌ శాఖ సిద్ధం కావాలి. పాతబస్తీలో విద్యుత్‌ వ్యవస్థను మెరుగుపర్చడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పాతబస్తీలో మంచినీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రతీ బస్తీకి, ప్రతీ ఇంటికి మంచినీరు అందాలి. పాతబస్తీలో ఏడు ప్రాంతాల్లో మంచినీటి రిజర్వాయర్లు (జి.ఎల్‌.బి.ఆర్‌.) నిర్మించాలి. నిజాం కాలంలో, బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వేసిన పైపులైన్లే ఇంకా

ఉన్నాయి. వాటిని మార్చాలి. కొత్త, పెద్ద పైపులైన్లు వేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”వర్షం వస్తే రోడ్ల మీద, నివాస ప్రాంతాల్లో వరద వస్తున్నది. పాతబస్తీని వరదలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలి. నాలాలు వెడల్పు చేయాలి. వర్షం వస్తే ఎక్కడా నీరు నిల్వకుండా నాలాల ద్వారా వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలి. రూ.200 కోట్ల వ్యయంతో నాలాల ఆధునీకరణ, వెడల్పు పనులను వెంటనే ప్రారంభించాలి. ఎంత వర్షం వచ్చినా పాతబస్తీలో వరద రాని పరిస్థితి ఉండాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

”కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల మురికి నీరు రోడ్లపైకి, ఇళ్లల్లోకి వస్తుంది. దుర్గంధభరితమవుతుంది. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి. పాతబస్తీలో సీవరేజి పనులు చేపట్టాలి. మురికి కాల్వలను వందకు వందశాతం బాగు చేయాలి. ఎక్కడా మురుగునీరు బయటకు రాకుండా చూడాలి” అని సీఎం వివరించారు.

”ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్‌ నగరంలో అమలు చేస్తున్న స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌.ఆర్‌.డి.పి.)లో భాగంగా పాతబస్తీలో చేపట్టిన కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. మూడు కొత్త వంతెనలు నిర్మించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఐదు ప్రధాన పనులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతాయని సమావేశంలో ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నిధులను వెంటనే సమకూరుస్తామని, వెంటనే పనులు ప్రారంభించి, వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సీఎం కోరారు. రంజాన్‌ మాసం కన్నా ముందే తాను పాతబస్తీలో పర్యటిస్తానని, సబ్‌ స్టేషన్లు, మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని సీఎం వెల్లడించారు.

”హైదరాబాద్‌ నగరంలో ఇటీవల ప్రారంభించిన బస్తీ దవాఖాన్లకు మంచి స్పందన వచ్చింది. ఇలాంటి దవాఖానాలు నగరంలో మొత్తం 200 వరకు ప్రారంభించాలి. బస్తీ దవాఖాన్లలోనే వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. నగరంలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ప్రారంభించాలి” అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి కోరారు.

”హైదరాబాద్‌ నగరం తెలంగాణకు గుండెకాయ. మంచినీటి కోసం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రావద్దు. ఏ సమస్య వచ్చినా మంచినీటి సరఫరాకు ఆటంకం కలుగకుండా ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ప్రస్తుతం కృష్ణా నుంచి మూడు దశల్లో 16.5 టిఎంసిలు, గోదావరి ద్వారా 10 టిఎంసిల నీరు వస్తున్నది. సింగూరు, హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట) ప్రత్యామ్నాయ వనరులుగా

ఉన్నాయి. 10 టిఎంసిల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌ మంచినీటి కోసం కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మిస్తున్నాం. వీటికి తోడు ఓఆర్‌ఆర్‌ చుట్టూ చిన్న చిన్న రిజర్వాయర్లు కూడా నిర్మించి, నీటిని నిల్వ చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటి రామారావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎం.పి. అసదుద్దీన్‌ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, డిజిపి మహేందర్‌ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమీషనర్‌

బి. జనార్థన్‌ రెడ్డి, హెచ్‌.ఎం.డబ్ల్యు.ఎస్‌.ఎస్‌. ఎండి దానకిషోర్‌, సీనియర్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్‌ రావు, రాజేశ్వర్‌ తివారి, వాకాటి కరుణ, అరవింద్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణి, సీఎంఓ అధికారులు భూపాల్‌ రెడ్డి, స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates