palukubadiతెలంగాణలో తెలుగులోని ”ప్రాణం” అనే పదాన్ని రావత్తు తీసివేసి ”పానం” అని పలుకుతున్నారు. ఇది ”క్రొత్త” లోంచి, ”ప్రాత” లోంచి ”బ్రతుకు”లోంచి రావత్తు మాయమైపోయిన మార్పులాంటిది. ”ప్రాణం” లోని మూర్థన్య ”ణకారం” కూడా తెంగాణతో మామూలు ”నకారం” అవుతున్నది. ఇవన్నీ భాషాపరమైన మార్పులు ఇవికాక ఈ ”పానం”, ఒళ్ళు, ఆరోగ్యం, అమ్మ మనస్సు మొదలైన అర్ధాలు తెలంగాణలో ఉన్నాయి. వ్యాధి వల్లనో, నీరసాదుల వల్లనో ఒక వ్యక్తి సరిగా నడువలేక పోయినప్పడు ” ఆయినకు పానం సొల్గుతుంది బిడ్డా ! జెర్ర ఆసర పట్టుకోండ్రి ” అంటూ వుంటారు. ఈ సందర్భంలో ప్రాణం అంటే శరీరం, ఒళ్ళు అని అర్థం. సొల్గడం తూలటం ఈ తూలటం మద్యపానం వల్ల తూలటం వంటిది కాదు. ఈ ఒళ్ళు అని అర్థంలోనే ” నా పానం కూని కూని అయింది” అంటారు. దీనికర్థం ఒళ్ళంతా హూనం కావటం.

”ఆరోగ్యం జాగ్రత్త అనే మటలకు సమానార్థకంగా తెలంగాణలో ”పానం పైలం” అని హెచ్చరిస్తారు. ఇక్కడ ”ప్రాణం” అంటే ”ఆరోగ్యం”అని అర్థం. ”వాడికి అనారోగ్యం” అని చెప్పదలచుకున్నవాడు ”వానికి పానం మంచిగ లేదు” అంటారు. అందుకనే ”కాస్త ఆరోగ్యవంతుడు అయ్యాడు” అనే వాక్యానికి తెంలంగాణలో ” జెర్ర పానం బెట్టిండు” అంటారు. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, కొంత జబ్బు పడినప్పుడు ”పానం మెత్త మెత్తగ ఉంటున్నది” అని అంటున్నారు. ”వాడికి జబ్చు చేసింది” అనే తెలుగు వాక్యానికి తెలంగాణ ప్రాంతంలో ” వాని పానం కూలవడ్డది” అనే వాక్యం ప్రచారంలో వుంది. ఈ అన్ని సందర్భాలలోనూ ”ప్రాణం” అంటే ఆరోగ్యం అనే అర్థం వుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ” పానం ఉషార్‌ వుందా? అన్ని ప్రశ్నిస్తారు. ఇక్కడ కూడా అర్థం ” ఆరోగ్యం బాగుందా?” అనే! ఆరోగ్యం కుదుటపడిన సందర్భాల్లో ” అబ్బ! నా పానం అల్కగ అయింది” అంటున్నారు. తెలుగులో ” తల ప్రాణం తోకకు రావడం” వంటి జాతీయం తెలంగాణలో ”పానం కొలికిలకు వచ్చుడు” రూపంలో ఉంది. రెండు జాతీయాల్లోనూ ”ప్రాణం” ఒకే అర్థంలో ప్రయుక్తమైంది. ఒకచోట ప్రాణం తోకకొస్తే మరోచోట కొలికిలోనికి వచ్చింది. తేడా అంతే! తెలంగాణలో ”పానం గువ్వలకు వచ్చుడు” అనే జాతీయం వుంది. దీనికి అర్థం, క్రమంగా ప్రాణం పోతూ అది చెవులోని గూబలదాకా, గువ్వలదాకా రావడం అన్నమాట, అందుకే కొందరి ప్రాణం కళ్ళలోంచి పోతుందనీ, మరి కొందరి ప్రాణం చెవులలోంచి పోతుందనీ పెద్దలు చెబుతుంటారు. అలా చెవుల్లోంచి పోయినప్పుడు రక్తం కూడా చెవుల్లో కారుతుంది అంటుంటారు.

తెలంగాణలో ”ప్రాణం” అనే పదానికి ”మనస్సు, మెదడు” అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రేమాతిశయంతో ఎవరిమీదైనా మనసు కొట్టుకొనే సందర్భంలో ”పానం తొక్కులాడుతున్నది అనడం పరిపాటి. ”పానం తాయికి వచ్చుడు” అనేది తెలంగాణలో మరొక పలుకుబడి, దీనికి అర్థం” మనస్సు లేదా మెదడు కొంత స్తిమిత పడడం అంటే చంచలమైన మనస్సు ‘ఒక స్థాయికి రావడం. తెలంగాణ పలుకులో ”తాయి” , ఈ ”స్థాయి”లోంచి వచ్చిన రూపం, ”భయపడడం” అనే అర్థంలో ”పానం దస్కుమన్నది” అంటున్నారు.

”ఆయుష్షుపోయడం” అనే మాటకు ”పానం ఎదురు పెట్ట డడం” అనడం రివాజు. ఆత్మహత్య చేసుకోవడం అంటే తెలంగాణలో ”పానం దీసుకునుడు” .

”ప్రాణ భయం” అనే సమాసం తెలంగాణలో ”పాన బయం” అయ్యింది.”ప్రాణం” అనే మాటకు ”ఆత్మ” అనే అర్థంలో ”పాన మసోంటి సుట్టం” పరిశీలనార్హం. తెలుగులో ” ఆత్మబంధువు” అనే మాట వుంది. దానికి సమానార్థకం దాదాపుగా తెలంగాణలో ”పానమసోంటి సుట్టం”. బంధువు అనే పదం సంస్కృతంలోంచి వచ్చింది. ”సుట్టం” తెలుగు పదం”. పానమ సోంటి అంటే ”ప్రాణం లాంటి” అని అర్థం.

వాళ్ళిద్దరికీ ”ప్రాణ స్నేహం” అనే మాట తెలంగాణలో ”వాళ్ళిద్దరికీ పానా పానా సోపతి ”అంటున్నారు”. స్నేహానికి పర్యాయం సోపతి తెలంగాణకు సోపతి పదం సహజంగా, నేటివ్‌గా ప్రాంతీయ ముద్రతో కూడు కొని వుంది. ”పానా పానా సోపతి”లో రెండుమార్లు ఉంది. అలా వుండటం ఆ స్నేహం మరింత గొప్పదని చెప్పకనే చెబుతున్నది. ఇక తెలుగులోని ”పంచ ప్రాణాలు” (ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం) ఆరో ప్రాణం, బహి: ప్రాణం” వంటి మాటలకు తెలంగాణలో ఒకే ఒక మాట ”పానా పానం” అనేది ఉంది. వాడంటే నాకు ”పంచ ప్రాణాలు, ఆరోప్రాణం, బహి:ప్రాణం” అని చెప్పడానికి బదులు వాడికీ నాకూ పానాపానం” అంటే చాలు.అర్థం తెలిసి పోతుంది.

Other Updates