logosమహిళలు ఎంతో ముచ్చటపడి, సౌభాగ్యానికి చిహ్నంగా ధరించే చేతి గాజుల తళతళలు, రంగు రంగుల ధగధగల వెనుక ఎంతోమంది చిన్నారుల శ్రమ దాగివుందని, గాజు కరిగించే కొలిమిదగ్గర వేడికి మగ్గిపోతూ, ఆ రసాయనాల విషవాయువులను పీలుస్తూ క్షయ వంటి అనేక వ్యాధులకు గురవుతున్నారన్న విషయం ఎందరికి తెలుసు?
జనవరి చివరివారంలో పోలీసులు, కార్మిక శాఖ అధికారులు ‘ఆపరేషన్‌ స్మైల్‌’లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని పలు వ్యాపార కేంద్రాలపై జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇటువంటి అనేక హృదయ విదారక విషయాలు బట్టబయలయ్యాయి. బీహార్‌ కేంద్రంగా చిన్న పిల్లలను అనైతిక కార్యకలాపాలకు వినియోగించే లక్ష్యంతో కొనసాగుతున్న దారుణ వ్యాపార వ్యవస్థ వెలుగులోకి వచ్చింది.

కన్నవాళ్ళకు, పుట్టిపెరిగిన వూరికి దూరంగా, బానిసలకంటే హీనంగా దుర్భర జీవనం సాగిస్తున్న వందలాది మంది బాల బాలికలకు ఈ దాడులతో విముక్తి కలిగింది. ఇలా విముక్తులైన పిల్లల దీనగాథలు వింటుంటే ఎంతటి కఠిన హృదయులకైనా కళ్ళుచెమ్మగిల్లక మానదు. వీరిలో చాలామంది 12 ఏళ్ళలోపువారే. గాజుల తయారీ కర్మాగారాలతోపాటు, బ్యాగుల తయారీ కార్ఖానాలు, తదితర వ్యాపార కేంద్రాలలో వీరు పనిచేస్తున్నారు.
అధికారులు పిల్లలను ప్రశ్నించగా, వారి కన్నీటిగాథలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరికి తమ పేర్లు కూడా తెలియవు. తల్లి ఎవరో, తండ్రి ఎవరో, పుట్టిన ఊరు ఏదోకూడా తెలియని దుస్థితి. కాగా, మరికొందరు బీహార్‌, తదితర ప్రాంతాలనుంచి పనులకోసం రప్పించబడిన వారు.

14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనులకు పంపకూడదనీ, పనులలో పెట్టుకోరాదని చట్టాలు చెబుతున్నా పిల్లలు పనికి వెళ్ళి డబ్బు సంపాదిస్తారన్న పెద్దవారి ఆశ, పిల్లలైతే ఎంత తక్కువ కూలి ఇచ్చినా కిమ్మనకుండా పనిచేస్తారన్న పరిశ్రమల యజమానుల దురాశా బాల్యాన్ని కబళించి వేస్తున్నాయి.

ఈ అమానుషానికి గురవుతున్న బాలలను అధికారులు గుర్తించి ప్రత్యేక రైలుబోగీలలో వారివారి స్వస్థలాలకు పంపారు. చిరునామా కూడా తెలియనివారిని జువైనెల్‌ హోమ్‌కి తరలించారు. తమతమ స్వస్థలాలకు తిరిగివెళ్తున్న పిల్లలకు వీడ్కోలు చెప్పడానికి రైల్వేస్టేషన్‌ కు వెళ్ళిన నాకు ఆ పసిహృదయాలలో ఓ వంక ఆనందం, మరోవంక నైరాశ్యం కనిపించి గుండె బరువెక్కింది. అంతలోనే వారిని తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామన్న ఆనందం కలిగింది.

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న విషయాన్ని మాటలలోగాక, చేతల్లో చూపిద్దాం. చదువు కోవటం బాలల హక్కు. ఆ హక్కును హరించే హక్కు ఎవరికీ లేదు.

` డాక్టర్‌ ఆర్‌.వి. చంద్రవదన్‌, ఐఎఎస్‌
కమీషనర్‌ & పబ్లిషర్‌

Other Updates