2013 డిసెంబర్ 7వ తేదీన సాక్షి దినపత్రికలో నెల్సన్ మండేలాపై వేసిన కార్టూన్ ప్రచురితమయ్యింది. అప్పుడు ఆ కార్టూన్ చూసిన వారందరూ ఇది అబ్బురంగా వుందని అనుకోవచ్చుకాని అదరగొట్టే కార్టూన్ (క్యారికేచర్) అని అనుకోలేదు. అయితే 15 నవంబర్ 2014 రోజు పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటేటా ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈసారి మన తెలంగాణ నల్లగొండ బిడ్డ, గీతలతో గిమ్మిక్కులు చేసే కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌ను వరించింది. ఈ అవార్డు కోసం ఈ సంవత్సరం (2014) దాదాపు 164 దేశాల కార్టూనిస్ట్‌లు పోటీకి నిలువగా వాళ్ళందరినీ అదిగమించి తాను గీసిన నెల్సన్ మండేలా క్యారికేచర్‌తో ముందు నిలిచారు. అంతర్జాతీయస్థాయిలో అందరి మనసులను ఆకట్టుకున్నారు శంకర్. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ సంస్థ అధ్యక్షుడుగా వున్న శంకర్ నల్లగొండ జిల్లా నాగిరెడ్డిపల్లి నివాసి. ఇదివరకు గీసిన దలైలామా, బ్రూస్‌లీ, మదర్ థెరిస్సా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామాలాంటి ఎందరో ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నారు మన పామర్తి శంకర్. కార్టూనిస్ట్‌లందరూ ఓ నోబెల్ ప్రైజ్‌గా భావించే అత్యున్నత అంతర్జాతీయ పురస్కారాన్ని మనవాడైన సాక్షి దినపత్రిక కార్టూనిస్ట్ శంకర్ వశం చేసుకున్నారు. ఈ అవార్డు ప్రైజ్‌మనీగా ఐదువేల యూరో (సుమారు 8 లక్షలు)లు అందుకోనున్నారు శంకర్.
తాను గీసిన ఈ క్యారికేచర్‌లో మూడు అంశాలున్నాయని అన్నారు శంకర్. నెల్సన్ మండేలాను నల్ల సూరీడు అని అంటూ వుంటాం. అందుకు ప్రతీకగా ఆయన ముఖానికి నలుపు రంగును వేశానన్నారు. మరొకటి దక్షిణాఫ్రికా దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా మండేలా అంగీకి పలువర్ణాలద్దానన్నారు. యి పైకెత్తి బిగించిన పిడికిలి మండేలా చేసిన పోరాటానికి సంకేతంగా ఎరుపురంగులో వేశానని శంకర్ పేర్కొన్నారు. మారుమూల గ్రామంనుండి వచ్చి ప్రపంచమంతా మారుమోగే స్థాయికి చేరుకున్న శంకర్‌కి ఓ శణార్థి.