telanganaతెలంగాణ ఉద్యమంలో ప్రాధాన్యతాంశం నీళ్లు, నిధులు, నియామకాలు. వీటికోసమే ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో నియామకాలు జరిగి బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావడానికి యువత, నిరుద్యోగులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వీరి కలలను నిజం చేస్తూ నియామకాల విషయంలో తన లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిస్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి విజయం సాధిస్తోంది.

18 డిసెంబర్‌ 2014న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడింది. ఏడాదిన్నర కాలంలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడంతో పాటు, అత్యాధునిక, పారదర్శక, రాజ్యాంగ సంస్థగా టిఎస్‌పిఎస్‌సి అవతరించి, అనతి కాలంలోనే దేశం మొత్తానికి ఆదర్శంగా ఎదుగుతోంది. దీని వెనుక ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు టిఎస్‌పిఎస్‌సి కృషి కూడా ఉంది. గత ఎపిపిఎస్‌సిలో 500లకు పై చిలుకుఉద్యోగులుంటే టిఎస్‌పిఎస్‌సిలో కేవలం 120 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వీరిలో 40 మంది అటెండర్లు, 80 మంది మిగతా ఉద్యోగులు. ఉద్యోగుల సంఖ్య తక్కువైనా తెలంగాణ పట్ల వారికి ఉన్న అంకితభావంతో రాత్రి పగలు పనిచేయడం వల్ల టిఎస్‌పిఎస్‌సి విజయాలు సాధించగలిగింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 2016 వరకు 13 నోటిఫికేషన్‌లు వెలువరించగా వాటిలో 7 పూర్తి చేసింది. వాటిలో రెండు ఎంపిక దశల్లో ఉండగా మరో నాలుగు కోర్టుకేసులతో పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 30వ తేదీ 2015న 3500 పోస్టులకు మొదటి నోటిఫికేషన్‌ వెలువరించింది. జూలై నుంచి దాదాపు ఏడాది కాలంలో 20 నోటిఫికేషన్లు ప్రకటించి వాటిలో 13 పూర్తిచేసింది. వీటిల్లో ఎనిమిది ప్రభుత్వ శాఖలలో ఫలితాలు ప్రకటించి 2500 మందికి నియామక పత్రాలు అందజేసింది. ఈ నియామకాలలో పూర్తిగా పారదర్శకతతో పాటు తెలంగాణ అవసరాలు, ఆకాంక్షలు తెలిసిన వారినే టిఎస్‌పిఎస్‌సి ఎంపిక చేయడం జరిగింది. రూరల్‌ వాటర్‌ సప్లై అండ్‌ సానిటేషన్‌ (ఆర్‌డబ్ల్యూఎస్‌), పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌ ఇంజనీర్‌, రోడ్లు మరియు భవనాలు, నీటిపారుదల, పంచాయత్‌ రాజ్‌ శాఖ లాంటి వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1058 ఎఈ, 931 ఎఈఈ నియామకాలను చేపట్టింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాల వల్ల ఒకేసారి దాదాపు రెండువేలకు పైచిలుకు వివిధ ఇంజనీరింగ్‌ ఉద్యోగాలలో వీరు అందుబాటులో ఉన్నారు. ఈ తొలితరం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో చురుకుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఉద్యోగాల భర్తీని ప్రారంభించి రాష్ట్రంలోని నిరుద్యోగుల కల నెరవేర్చింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌. కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయా? ఎప్పటికి ప్రారంభించి ఏప్పుడు పూర్తి చేస్తారనే నిరుద్యోగుల అనుమానాలను నివృత్తి చేస్తూ ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తోంది టిఎస్‌పిఎస్‌సి.

ప్రధానంగా మన నేటి అవసరాలైన సాగు, త్రాగు నీరు విభాగాలైన హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ అండ్‌ సివరేజ్‌ బోర్డులో కూడా ఇంజనీరింగ్‌ విభాగంలో 200 పైగా ఉద్యోగాలను కల్పించింది. ముఖ్యమంత్రి దృష్టి సారించిన వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన వ్యవసాయ శాఖలో 1500పైగా వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులను టిఎస్‌పిఎస్‌సి చేపట్టింది. వీటిని త్వరలోనే భర్తీ చేయనుంది. వీటితో పాటు తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 244, అధ్యాపక, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే పనిలో కమిటి నిమగ్నమైంది. 6,500 పైచిలుకు ఉద్యోగ నోటిఫికేషన్లను ఏడాదినర్నర కాలంలోనే చేపట్టింది.

నియామకాలల్లో విమర్శలకు, అవినీతికి తావులేకుండా బంధుప్రీతికి, రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా నియామకాలు జరపాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు నియామకాలన్ని రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను నియమించడం జరిగింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు రాజ్యాంగ బద్ద సంస్థలు కాబట్టి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే నియామకాలు జరగాలి. కాని సమైక్య రాష్ట్రంలో గత 60 ఏండ్ల కాలంలో వలస పాలకులు ఈ రాజ్యాంగ బద్ద సంస్థను నిర్వీర్యం చేసి నియామకాలను ఆయా ప్రభుత్వ విభాగాధిపతులు చేపట్టే అవకాశం కల్పించారు. మొదట్లో టీచర్లు, పోలీసులు మొదలుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, గ్రూప్స్‌ స్థాయిలో ఉన్నతా ధికారులు, అటెండర్లు, డిప్యూటీ కలెక్టర్లు, కానిస్టేబుల్‌ స్థాయి నుంచి డిఎస్‌పి వరకు ఉద్యోగాల భర్తీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరిగింది. 1980 తర్వాత వీటిలో చాలా విభాగాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధి నుంచి తొలగించి రాజకీయ పార్టీల జోక్యంతో కూడుకున్న బోర్డులకు అప్పగించారు. ఈ క్రమంలో టీచర్లను డిఎస్‌సిల ద్వారా లేదా జిల్లా పరిషత్‌ల ద్వారా, డాక్టర్లని వైద్య విధాన పరిషత్‌ లాంటి సంస్థల ద్వారా, పోలీసులను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా, విద్యుత్‌ ఉద్యోగులను ట్రాన్స్‌కో, జెన్‌కో ద్వారా నియమించుకునే విధంగా విధానాలు మార్చింది. దీని వలన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్‌, 1, 2, 3, 4 లాంటివి మాత్రమే నియమించే సంస్థగా మారింది. అందులో కూడా రాజకీయ నాయకులకి, పాలకులకు అనుకూలంగా ఉండే నాయకులు, కార్యకర్తలను పిఎస్‌సి మెంబర్లుగా, చైర్మన్‌లుగా నియమించుకునే సంస్క ృతికి అంకురార్పణ అప్పటి నుంచే జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ విషసంస్క ృతికి పూర్తిగా చెక్‌ పెట్టడానికి ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది. దీనిలో సభ్యులుగా నిపుణులు, ఉద్యోగవర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, న్యాయమూర్తులు, డాక్టర్లను మెంబర్లుగా నియమించి పూర్తి స్వేచ్చను ప్రభుత్వం కల్పించింది. అంతే కాకుండా నియామకాలన్ని టిఎస్‌పిస్‌సి ద్వారా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించడం అభినందనీయం.

వ్యవసాయ, భూగర్భగనుల శాఖ, డాక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, పశువైద్యులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్లు, ప్రిన్సిపాల్‌, లెక్షరర్లు లాంటి అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగాలను కూడా నియమించే బాధ్యతను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కే అప్పగించింది. త్వరలోనే సింగరేణి లాంటి కంపెనీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నియామకాలను టిస్‌పిఎస్‌ చేపట్టబోతున్నది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు నిష్పాక్షికంగా, ఎలాంటి పైరవీలకు, మధ్యవర్తులతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుంతోంది. కాబట్టే తెలంగాణ పబ్లిక్‌ స్వస్‌ కమీషన్‌ పై నిరుద్యోగ యువత పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వన్‌టైం రిజిస్ట్రేషన్‌ :

మొదటి ఏడాదే ఈ సంస్థ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గతంలో అవలంభిస్తున్న విధానాలకు స్వస్తి పలికి పూర్తిగా ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఉద్యోగ ప్రకటన, అభ్యర్థులు అప్లికేషన్‌ నింపడం నుంచి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ వరకు అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌లోనే విజయ వంతంగా నిర్వహిస్తోంది. దీనిలో ముఖ్యంగా వన్‌టైం రిజిస్ట్రేషన్‌ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టింది. దీనిద్వారా నిరుద్యోగ యువతీ, యువకులు తమ పేరు, చిరునామా, వయస్సు, విద్యార్హతలు, వివిధ అంశాల్లో నిపుణతలను టిఎస్‌పిఎస్‌సి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి తమ అర్హతలను రిజిస్టర్‌ చేస్తే వారివారి అర్హతలను బట్టి టిఎస్‌పిఎస్‌సి ప్రకటించే ఉద్యోగ నోటిఫికేషన్‌లకు అర్హులైన నిరుద్యోగులకు సంబంధిత నోటిఫికేషన్‌ వివరాలు వారి సెల్‌ఫోన్‌, ఈ మేయిల్‌కు సమాచారం చేరుతుంది. ఈ వన్‌టైం రిజిస్ట్రేషన్‌ ద్వారా ప్రతిసారి నిరుద్యోగులు అప్లికేషన్‌ ఫాం నింపడం, వాటిని పిఎస్‌సికి పోస్ట్‌లో పంపడం, తిరిగి పిఎస్‌సి అభ్యర్థులకు హాల్‌ టికెట్‌ పోస్ట్‌లో పంపడం లాంటివి లేకుండా ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని వలన నిరుద్యోగులకు ఖర్చు తగ్గడంతో పాటు, సమయం ఆదా అవుతుంది. ఒక్క సారి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే చాలు కన్ఫర్మేషన్‌, పరీక్ష తేదీలు, ఉద్యోగ ఖాళీలు, ఏయే ప్రాంతంలో ఎన్ని పోస్టులు ఖాళీలున్నాయి, హాల్‌ టికెట్‌ లాంటి సమాచారం మొబైల్‌ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. సంబంధిత ఉద్యోగానికి ఫీజును బ్యాంకు డిడి తీసే అవసరం లేకుండా ఒక్క నిమిషంలో అన్‌లైన్‌లో ఫీజు చెల్లించే విధానాన్ని ప్రవేశ పెట్టింది సంస్థ. దేశంలోనే పేపర్‌లెస్‌ వర్క్‌ చేస్తున్న సంస్థగా టిఎస్‌పిఎస్‌సి గుర్తింపు తెచ్చుకుంది. ఈ విధానంతో అభ్యర్థులు ఎప్పటికప్పుడు టిఎస్‌పిఎస్‌సి వెలువరించే ఉద్యోగ ప్రకటనలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికి వరకు 12 లక్షలకు పైగా అభ్యర్థులు వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసున్నట్లు టిఎస్‌పిఎస్‌సి అధికారులు తెలిపారు. వన్‌టైం రిజిస్ట్రేషన్‌ ద్వారా రాష్ట్రంలో ఏ జిల్లా, పట్టణం, గ్రామంలో ఎంత మంది నిరుద్యో గులు, వారి స్కిల్స్‌ తెలుసుకునే అవకాశం ప్రభుత్వానికి, టిఎస్‌పిఎస్‌సికి కలుగుతుంది.

విప్లవాత్మక మార్పులు :

ఆన్‌లైన్‌ పరీక్ష విధానం :

దేశ చరిత్రలోనే సరికొత్త పరీక్షా విధానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. ఏకకాలంలో 32వేల మందికి ఆన్‌లైన్‌ పరీక్ష పెట్టి విజయం సాధించడం దేశ చరిత్రలో మొదటి సారి. దీనితో దేశలోని అన్ని పిఎస్‌సిలు టిఎస్‌ పిఎస్సిని ఆదర్శంగా తీసుకోను న్నాయి. ఆన్‌లైన్‌ పరీక్ష అభ్యర్థికి వచ్చిన ప్రశ్నా పత్రానికి సంబంధిం చిన పాస్‌వర్డ్‌ ఆ అభ్యర్థికి మాత్రమే తెలుస్తుంది. దీనివల్ల పేర్‌లీక్‌కు, మాస్‌కాపీయింగ్‌, అవకతవకలకు అవ కాశం లేకుండా పరీక్ష పాదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది. క్లౌడింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించిన ఘనత మన టిఎస్‌పిఎస్సీకే దక్కింది. ఇప్పటి వరకు జరిగిన 13 పరీక్షల్లో 9దింటిని ఆన్‌లైన్‌లోనే నిర్వహించింది.

ఆధార్‌ లింక్‌ :

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌కు ఆధార్‌ను లింక్‌ చేయడం ద్వారా అభ్యర్థి స్థానికత, ఏ జిల్లా, ఏ రాష్ట్రంలాంటి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. దేశంలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలకు 100శాతం ఆధార్‌ లింక్‌ చేసిన మొదటి పిఎస్సీగా ఘనత వహించింది టిఎస్‌పిఎస్సీ.

బయోమెట్రిక్‌ :

పోటీ పరీక్షల్లో అవకతవకలను నిరోధించడానికి బయో మెట్రిక్‌ను ప్రవేశపెట్టింది టిఎస్‌పిఎస్సీ. ఈ విధానంలో పరీక్షకు హాజరైన అభ్యర్థి వేలిముద్రలను ఆధార్‌ కార్డ్‌ లోని బయోమెట్రిక్‌తో లింక్‌ చేస్తారు. దీని ద్వారా ఒకరికి వేరొకరు పరీక్షలు రాయడం లాంటివాటిని నిరోధించే అవకాశం కలుగుతుంది. కేవలం పరీక్షలోనే కాకుండా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు కూడా అభ్యర్థుల వేలిముద్రలను తీసుకోవడం జరుగుతుంది. దేశంలోనే మొదటి సారి ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయిన అభ్యర్థుల వివరాలతో పాటు బయోమెట్రిక్‌ వివరాలను సైతం ప్రభుత్వానికి అందజేస్తున్న సంస్థ టిఎస్‌పిఎస్సీ. ఈ విధానాన్ని మొట్టమొదటి సారి నీటిపారుదల శాఖలో విజయవంతంగా పూర్తి చేసింది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేవలం 24 గంటల్లోనే ఫలితాలు విడుదల చేయడంతో పాటు దేశంలోనే మొదటి సారి పెన్‌ అండ్‌ పేపర్‌ ఓఎమ్మార్‌ ఆన్సర్‌ షీట్‌ను పరీక్ష అనంతరం అభ్యర్థులకు ఇస్తుంది. ఈ విధానాన్ని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి) నిర్వహించిన మేనేజర్‌ పోస్టులకు హాజరైన దాదాపు 87000 మంది అభ్యర్థులకు ఓఎమ్మార్‌ షీట్‌ను అందజేసింది. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ జవాబు పత్రం వారే దిద్దుకునే అవకాశంతో పాటు టిఎస్‌పిఎస్సీ విడుదల చేసిన మార్కులతో పోల్చుకునే అవకాశం కలుగుతుంది. ఇలాంటి అవకాశాల వల్ల అభ్యర్థులకు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పాదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కుంటూ దూసుకుపోతున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రతిష్టాత్మకమైన స్కాచ్‌ గ్రూప్‌ అవార్డుతో పాటు బెస్ట్‌ టెక్నాలజీ అవార్డులు వరించాయి.

వెబ్‌ ఆప్షన్‌ సిస్టమ్‌ :

ఇంజనీరింగ్‌లో 1050 పోస్టులకు 5 డిపార్ట్‌మెంట్‌లు, 2 జోన్‌లు, 10 రకాల రిజర్వేషన్‌లు, 15 రకాల ఆప్షన్‌లున్నాయి. గత ఇంటర్వ్యూలలో పలు రకాల అవకతవకలు జరగడం వల్ల అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేక పోయారు. దీనికి చెక్‌ పెట్టడానికి ఇంటర్వ్యూలను డిజిటలైజ్‌ చేయడం వల్ల ఎంసెట్‌ లాగా వెబ్‌ అప్షన్‌ను టిఎస్పీఎస్సీ ప్రవేశ పెట్టింది. అ ప్రక్రియ వలన ఏ ఉద్యోగం, డిపార్ట్‌మెంట్‌, జోన్‌, ప్రాధాన్యత మొత్తం ఇంట్లో నుంచే అభ్యర్థి ఎంచుకునే విధంగా వెబ్‌ ఆప్షన్‌ను తయారు చేశారు. దీని వలన ఎంపిక ప్రక్రియ పాదర్శకంగా జరుగుతోంది.

ముందు చూపు :

2015 ఆగస్టు 15 న చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి ముందే 2015 జనవరి లోనే ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కమిటీ గెజిటెడ్‌ ఉద్యోగాలకు మినహా ఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఉండవని నిర్ణయం తీసుకున్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో అంగీకరించింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు ముందే తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుచూపుతో వ్యవహరిస్తోంది టిఎస్పీఎస్సీ. ఇంటర్వ్యూలు ఉండే గెజిటెడ్‌ ఉద్యోగాలకు సైతం పూర్తిస్థాయిలో పారదర్శకత, సామాజిక న్యాయం ప్రాతినిథ్యం ఉండే విధంగా ఇంటర్వ్యూ బోర్డులను అనుసంధానం చేయడమే కాకుండా, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా, స్నేహపూర్వక వాతావరణంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇంటర్వ్యూ బోర్డులో ఎవరుంటారు, ఎవరు ఏ బోర్డులో ఉంటారు, ఏ వ్యక్తి ఏ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తారనేది పూర్తిగా టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. దీంతో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది.

తెలంగాణ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ, బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. గత సమైక్యపాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తించి తెలంగాణ యువతకు బంగారు బాటగా నిలుస్తోంది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 2016 వరకు 13 నోటిఫికేషన్‌లు వెలువరించగా వాటిలో 7 పూర్తి చేసింది. వాటిలో రెండు ఎంపిక దశల్లో ఉండగా మరో నాలుగు కోర్టుకేసులతో పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 30వ తేదీ 2015న 3500 పోస్టులకు మొదటి నోటిఫికేషన్‌ వెలువరించింది.

Other Updates