తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్నదని, 10.4 శాతం పారిశ్రామిక వృద్ధిరేటుతో దేశంలోనే ముందున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, గనులశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు రేటును దాటామన్నారు. గనులశాఖ ద్వారా రాష్ట్రానికి కాసులపంట పండుతున్నదని తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. దేశ సగటు ఆదాయం రూ. 1,12,764 ఉండగా, తెలంగాణ సగటు ఆదాయం రూ. 1,75,534 ఉందన్నారు. టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టిన తరువాత 2015 సంవత్సరం నుంచి రాష్ట్రంలోకి రూ. 1,23,478 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీనిద్వారా 5.27 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అనుమతులు తీసుకున్న వాటిలో సగానికి పైగా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించాయని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. జీడీపీలోను తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు రేటుకంటే ఎక్కువగా ఉందన్నారు. జాతీయ సగటు రేటు 6.6 శాతం ఉండగా, తెలంగాణ సగటు రేటు 10.4 శాతం వుండటం విశేషం. ఇలా తెలంగాణ ముందుండడానికి పరిశ్రమల స్థాపన ఎంతో దోహదం చేసిందన్నారు.
పరిశ్రమలకు రాయితీల కింద రూ. 1400 కోట్లు చెల్లించాల్సి ఉందని వాటిని త్వరలో చెల్లిస్తామని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన విషయంలో కేంద్రం నుంచి అనుకున్నంత స్పందన లభించడం లేదని, అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా సింగరేణి, టీఎస్ ఎండీసీల ద్వారా ఉక్కుపరిశ్రమ స్థాపనకు కృషి చేస్తామన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. టీహబ్ ఫేజ్-2 పూర్తయితే దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌గా గుర్తింపు పొందుతుందని చెప్పారు.
దండుమల్కాపురంలో 377 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు వస్తా యని, 12,250 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఫార్మాసిటీ భూ నిర్వాసితుల్లో కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత భారీ ఫార్మా క్లస్టర్ ఇదేనని పేర్కొన్నారు. ఇందులో రూ. 64వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. 4.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వరంగల్‌రూరల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును 1200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 1586 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 1.13 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు.
కంపెనీలు సామాజిక బాధ్యత కింద చేపట్టిన కార్యక్రమా లకు సంబంధించిన చట్టాలు, కార్యక్రమాల వివరాల కోసం రూపొందించిన పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. అనం తరం పరిశ్రమలశాఖ త్రైమాసిక పత్రిక టీఎస్ ఇండస్ట్రియల్ వాచ్ సంచికను ఆవిష్కరించారు. మెరుగైన ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు అవార్డులు ఇచ్చారు.