తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి నేటివరకు మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర రావు పాలనా దక్షత గురించి ప్రస్తావిస్తే ‘తెలంగాణ సమాజానికి ప్రతినిధిగా బాధ్యతాయుత రాజనీతితో పదవికి వన్నె తెచ్చిన మహానేతగా’నే ప్రథమంగా స్ఫురిస్తారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ తన వ్యక్తిగత భావాలను ప్రజలపై ఏనాడూ రుద్దలేదు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మనసులను ప్రేమతో గెలుచుకున్నారు. సర్వమత సామరస్యాన్ని ప్రజల్లోనూ పెంపొందించగలిగారు.
– నెల్లుట్ల ప్రహ్లాద్‌


మన ముఖ్యమంత్రివర్యుల పూర్వాపరాన్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుంటే, స్వీయసంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సాధనే మూల సిద్ధాంతంగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని స్థాపించారు. జాతీయస్థాయిలో బలంగా పాతుకుపోయిన ఆనాటి అధికార పార్టీని రాజనీతిజ్ఞ వ్యూహాలతో అష్టదిగ్బంధనంలో చిక్కుకునేలా చేసి తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితులను సృష్టిoచారు. సుదీర్ఘ శాంతియుత పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స్వప్నాన్ని సాకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధిపతిగా ఒక్క కెసిఆర్‌ మినహా స్వతంత్రభారతంలో ఆవిర్భవించిన రాజకీయ పార్టీల అధినాయకు లెవరూ తమ పార్టీల మూల సిద్ధాంతాన్ని ఇంతవరకు సాకారం చేసుకోలేకపోయారనేది వాస్తవం. పూర్తి స్పష్టతతో సిద్ధాంత పరంగా విజయపథంలో దూసుకుపోయే పాలనా దక్షునికి వుండాల్సిన సహజలక్షణం తనలో వుందని ఆనాడే నిరూపించుకున్నారు కెసిఆర్‌. తదనంతరం యావత్‌ తెలంగాణ పౌరసమాజ సంపూర్ణ మద్దతుతో రాజ్యాంగయుక్త ఆమోదాన్ని పొంది రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణ స్వీకారమే వారి పాలనా సామర్ధ్యానికి పునాది. ఇవి అభిమానం నుండి పుట్టించిన మాటలు కావు. యావత్‌ తెలంగాణ సమాజం కళ్ళముందున్న యదార్థం.

ఇక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ఆవిర్భావంనుండి నేటివరకు కెసిఆర్‌ పాలనను ఒక్క మాటలో సూటిగా చెప్పలంటే ‘శభాష్‌’ అనే చెప్పాలి. అందుకు కారణాలను విశ్లేషిస్తే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గుర్తొస్తుంది. దాదాపు 235 టీఎంసీల గోదావరి జలాన్ని ఎత్తిపోయడమే లక్ష్యంగా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రాష్ట్ర ఆవిర్భావానంతరం ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ చేపట్టిన భారీ ప్రాజెక్ట్‌. తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వందల కిలోమీటర్ల మేర కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు, ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్‌ ఏర్పాటు, భూగర్భంలోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం ఈ ప్రాజెక్ట్‌కున్న ప్రత్యేక విశేషాలు. ప్రాజెక్ట్‌ పనులను చేపట్టిననాటినుండి రేయింబవళ్లు అహర్నిశలు అలుపెరగకుండా శ్రమించి నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు వాయువేగంతో పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవల సాధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తాలుకు విజయాల సమాహారమే ముఖ్యమంత్రిగా తన పాలనా దక్షతకు చక్కటి నిదర్శనం అన్నది చరిత్రాత్మక సత్యంగా నిలుస్తుంది.

ఇక మిషన్‌ కాకతీయ – మిషన్‌ భగీరథల ద్వారా త్రాగునీరు, సాగునీటికి ఇబ్బంది రాకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. కాకతీయుల కాలంలో చేపట్టిన చెరువుల నిర్మాణ పనులను ఆదర్శంగా తీసుకుని మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలోని చెరువుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే చేయించారు మన ముఖ్యమంత్రి కెసిఆర్‌. ఆ సర్వే ప్రకారం చెరువులకింద దాదాపు పది నుండి పదకొండు లక్షల హెక్టార్ల ఆయకట్టు వుంది. రాష్ట్రంలో 46,447 చెరువులు ఉంటే.. ప్రతి ఏడాది 20 శాతం చెరువులను పునరుద్ధరించాలని సంకల్పించి పట్టుదలతో పథకాన్ని అమలు చేశారు కెసిఆర్‌. ఇక మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలతో పాటు తండాలు, ఆదివాసీల గూడాలు, నగర శివారు ప్రాంతాలకు కూడా త్రాగడానికి, రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి దాదాపు ఒకటిన్నర లక్షల కిలోమీటర్ల మంచినీటి పైపులైన్లను ఏర్పాటుచేసే కార్యక్రమానికి కార్యరూపా న్నిచ్చారు. తద్వారా రాష్ట్రంలోని 25 వేల నివాస ప్రాంతాలకు నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం దినదిన ప్రవర్ధమానంగా నిర్ణీత లక్ష్యాలను చేరుకుంటూ ప్రజల త్రాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఈ రెండు పథకాల పారదర్శక అమలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలనా దక్షతకు మరో నిదర్శనం.

ఇవే గాక రైతు బంధు, గొర్రెలపంపిణీ కార్యక్రమం, ఆసరా పింఛన్లు, ఆరోగ్యలక్ష్మి, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్‌, ఒంటరి మహిళలకు జీవన భతి, మహిళల రక్షణకు షీ టీమ్స్‌, టి-హబ్‌, టి.ఎస్‌.ఐ-పాస్‌, శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ పోలీస్‌ వ్యస్థను పటిష్టపరచడం, ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సుభోజన పథకం కింద రైతులకు ఐదు రూపాయలకే భోజనపథకం, అమ్మ ఒడి- కెసిఆర్‌ కిట్‌ వంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళ రామకష్ణా రెడ్డి స్వయంగా మన రాష్ట్రానికి వచ్చి

సుభోజన పథకాన్ని పరిశీలించారు.ఈ పథకాన్ని మీడియా ముఖంగా కొనియాడారు. తదనంతరం మంగళగిరి నియోజకవర్గంలో తాను వ్యక్తిగతంగా ఈ పథకాన్ని అక్కడి పేద ప్రజలకోసం అమలు చేసిన విషయం విదితం. అమ్మ ఒడి కెసిఆర్‌ కిట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పథకాలైనా సత్ఫాలితాలు ఇచ్చాయాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు అందుకు సమాధానం ఆయా పథకాలద్వారా లబ్ధిని పొందిన ప్రజలతీర్పే అంతిమ తీర్పు.


తమకు కావలసినవి పొందటం పట్ల భారతీయ ఓటరుకున్న స్పష్టతకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుందనేది అక్షరసత్యం. అలాంటి భారతీయ సమాజంలో అంతర్భాగమైన తెలంగాణ ఓటర్ల మేధస్సు ప్రశంసనీయం. ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ పాలనా దక్షత భేష్‌ అనడానికి రెండవసారి కూడా తెలంగాణ ఓటర్లు ఇచ్చిన ఎలక్షన్‌ తీర్పును మించిన ప్రత్యక్ష నిదర్శనం మరొకటిలేదు. పాలనాధ్యక్షుని దక్షతకు వ్యక్తిత్వం కూడా కీలకమే. సాహిత్యం పై పట్టు, ఉన్నత విద్యార్హత, సజనశీల వాక్చాతుర్యం, చతుర్భాషాప్రావీణ్యతలు, తనను నమ్మిన సమాజానికి కావలసినవి సంకల్ప బలంతో అసాధ్యమని భావించే వాటిని కూడా సుసాధ్యం చేయగలిగే చతురత స్వతహాగా మేధావి అయిన మన ముఖ్యమంత్రి కెసిఆర్‌కి సహజ సంపదగా భాసిల్లుతున్నాయి. దీనివల్ల యావత్‌ తెలంగాణ సమాజానికి ఆత్మస్థైర్యంగా, ఆత్మాభిమానంగా కెసిఆర్‌ శోభిల్లుతున్నా రనడంలో అతిశయోక్తిలేదు.

పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడం ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌ల నుండి జల సహకారం, కరెంటు సహకారం అత్యవసర సమయానికి సజావుగా పొందేలా చేసి తెలంగాణ సమాజాన్ని తలెత్తుకునేలా చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఇలా అన్ని కోణాల్లోనూ ఉన్నత వ్యక్తిత్వం, తనదైన పాలనా సామర్ధ్యం కలిగిన కెసిఆర్‌ ఉత్తమ ముఖ్యమంత్రిగా జాతీయస్థాయిలో మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. మన ఆత్మాభిమాన ప్రతిరూపంగా, పాలనాదక్షతకు నిదర్శనంగా నిలిచారు ముఖ్యమంత్రి కెసిఆర్‌.

Other Updates