పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేగవంతంప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల చిరకాల స్వప్నమైన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనుకున్న కాలవ్యవధిలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది.

ఇందుకోసం చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రభుత్వం జీవో 143ను జారీ చేసింది. ఈ అథారిటీని ఏర్పాటు చేసిన ఉద్దేశం, అందులోని విభాగాలు, వాటి బాధ్యతలు ఉత్తర్వులలో సమగ్రంగా వివరించారు. అథారిటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నాయకత్వం వహిస్తారు.

ఇందులో వున్న వివిధ విభాగాలకు సంబంధిత అధికారులు నేతృత్వం వహిస్తారు. ఇంజినీరింగ్‌ విభాగం – చీఫ్‌ ఇంజినీర్‌, భూ విభాగం స్పెషల్‌ కలె క్టర్‌/స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఆర్థిక విభాగం, ప్రధాన ఆర్థిక విభాగం, కార్యాలయ పరిపాలనా విభాగం వుంటాయి. ఈ ప్రత్యేక అథారిటీ బడ్జెట్‌తో పాటు నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆయా విభాగాలకు సహకారం అందిస్తుంది.

ఇదే స్పూర్తితో ముందుకు వెళ్ళాలని తలచిన ప్రభుత్వం ” కాళేశ్వరం ప్రాజెక్టు” కోసం కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఇరిగేషన్‌ ముఖ్యకార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వుంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కార్పోరేషన్‌కు వందకోట్ల రూపాయల మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటుంది. ఈ కార్పోరేషన్‌ బోర్డులో ఆర్థిక సంస్థలు డైరెక్టర్లు / సభ్యులుగా వుంటాయి. వీరితోపాటు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వుంటారు. ఈఎన్‌సీ, ఐఎండీ ట్రాన్స్‌కో డైరెక్టర్‌, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, కరీంనగర్‌ చీఫ్‌ ఇంజినీర్‌, నీటి పారుదల శాఖ డిప్యూటీ కార్యదర్శి, భూగర్భ జలశాఖ డైరెక్టర్లుగా సభ్యులుగా వుంటారు. ప్రాజెక్టు నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవడం, ప్రాజెక్టు అమలులో కార్పోరేషన్‌కు పూర్తి స్వేచ్ఛ వుంటుంది. నిబంధనలన నుసరించి సీఈవోకూ పూర్తి నిర్ణయాధికారాలు వుంటాయి. ప్రాజెక్టు డిజైనింగ్‌, అమలు, నిర్వహణ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ (పీఎంసీ)ని కార్పోరేషన్‌ నియమిస్తుంది. కార్పోరేషన్‌ ప్రాజెక్టులకు సాంకేతిక అంశాలతో అనుమతి, మంజూరీలు ఇస్తుంది.

Other Updates