మహాబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న నాలుగు ప్రధాన భీమ, కల్వకుర్తి, నెట్టెం పాడు,కొయిల్ సాగర్‌ప్రాజెక్ట్ ల పురోగతి పై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అక్టోబర్ 16న గుత్తేదారులు, పాలమూర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు, భూసేకరణ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాగు నీటి ప్రాజెక్ట్స్ ప్రైజ్ ఎస్కలేషన్ కోసం 146 జీవో విడుదలైన సందర్భంగా ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి క్రిష్ణారావు, యంపీ జితేందర్ రెడ్డిలతో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎస్ కే జోషి, ఇఎన్ సీ మురళిధర్ రావు, మహాబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టికే శ్రీదేవి, టీఎస్ యండిసి యండి ఇలంబర్తిలు పాల్గొన్నారు. ఈ సమావేశం హైదరాబాద్ లోని టీఎస్ ఐడీసి కార్యాలయంలో జరిగింది.
క్షేత్ర స్ధాయిలో గుత్తేదారులు ఎదుర్కొంటున్న సమస్యపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి కాంట్రాక్ట్ ప్యాకేజీ పై సమీక్షించారు. మహాబూబ్‌నగర్‌లో ఉన్న పెండిగ్ ప్రాజెక్ట్‌ల పనులు చేస్తున్న కాంట్రాక్ట్ ఏజన్సీల ప్రతినిధులకు మంత్రులు ప్రభుత్వ లక్ష్యాలను, ఉద్దేశాలను వివరించారు. 2016 జూన్ నాటికి నాలుగు ప్రాజెక్ట్‌ల ద్వారా అంటే భీమ రెండు లక్షల మూడు వేలు, కల్వకుర్తి మూడు లక్షల నాలుగు వేలు, నెట్టెంపాడు రెండు లక్షలు,కొయిల్ సాగర్ ఆరవై వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిచాలనే లక్ష్యాలను వివరించారు. అందు కోసం ఈ నాలుగు ప్రాజెక్ట్‌లను 2016 మార్చి లోపు పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు గుత్తేదారులతో అన్నారు.
పెండిగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతోనే జివో 146, జివో 123 లను ప్రభుత్వం తెచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి ఏజన్సీ వారు తమ పనులకు సంబంధించిన పూర్తి స్ధాయి కార్యాచరణను సమర్పించాలని అన్నారు. భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగించుకొని ముందుకు పోతున్నామన్నారు. ఎక్కడ భూసేకరణకు ఇబ్బంది లేదని గుత్తెదారులకు తెలిపారు.
పనుల్లో జాప్యం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తాం…
ప్రాజెక్ట్ పనుల విషయంలో ఎవరు(గుత్తేదారులు, ఇంజనీర్లు)అలసత్వం వహించినా సహించేది లేదని మంత్రి తెలిపారు. సమస్యల పరిష్కారం లో ఎంతటి సహకారమైనా అందిస్తామని అన్నారు. ఒక వేళ సహకరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
ప్రాజెక్ట్ పనులను ప్రారంభించని ఏజన్సీల విషయంలోను ఈ సమవేశంలో చర్చించారు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కొయిల్ సాగర్‌లలో ఉన్న పెండింగ్ పనుల పూర్తి కోసం కావల్సిన భూసేకరణ పైన సమావేశం దృష్టి పెట్టింది. జివో 123 ని ఉపయోగించుకొని భూసేకరణను పూర్తి చేయాలని స్పెషల్ కలెక్టర్‌ను అదేశించారు. ఇక నుంచి ప్రాజెక్టుల పనుల పురోగతిపై గుత్తేదారులు, మహాబూబ్‌నగర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో పదిహేను రోజులకు ఒకసారి సమావేశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణాల కోసం కావల్సిన ఇసుక పైన ఈ సమావేశంలో చర్చించారు. మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తించిన ఇరవై రెండు ఇసుక పట్ట భూములను ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వాడుకోవాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి హరీష్‌రావు అదేశాలు జారీ చేశారు.