palamuruమిట్టా సైదిరెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఒకప్పుడు కరవుతో తల్లడిల్లిన పాలమూరు పల్లెలు ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నయి. బీమా, కల్వకుర్తి, కోయిల్‌ సాగర్‌ , నెట్టెంపాడు లిఫ్టులతో ప్రభుత్వం పాలమూరు జిల్లాల్లోని దాదాపు వెయ్యి చెరువులను నింపింది. ఆ నీళ్ల తాలూకూ పచ్చని కమ్మదనం రైతులకు కొండంత ధైర్యాన్ని అందిస్తున్నది. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయగలుగుతుందన్న సంపూర్ణ విశ్వాసం ఈ ప్రాంత రైతుల్లో ఏర్పడింది.

ఖరీఫ్‌లో మొత్తం నాలుగున్నర లక్షల ఎకరాల్లో రైతులు వరి, వేరుశెనగ, చెరకు పంటలను పండించారు. ఇప్పుడు యాసంగి సీజన్‌ లోనూ భారీ స్థాయిలో పంటల సాగు కొనసాగింది. వేరుశనగ పంట దిగుబడిలో ఈ సారి పాలమూరు రికార్డు సృష్టించినట్లు గణాంకాలు చెబుతున్నయి. ఒక్క వనపర్తి జిల్లా కేంద్రం మార్కెట్‌ యార్డు కే 2016 లో 88,203 క్వింటాళ్ల వేరుశనగ పంట వస్తే 2017 లో ఇప్పటి వరకు 1,26,090 క్వింటాళ్ల పంట వచ్చింది. గత 30 ఏళ్లలో నిండని చెరువులు ఈ సారి నిండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయినయి. గతంలో పాలమూరు నుండే కూలీలు వలస వెల్లే పరిస్థితి ఉండేది . ఇప్పుడు సాగు నీరు అందుబాటులోకి రావడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చి పంటలు సాగు చేసుకుంటున్నరు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా నుండి వనపర్తి జిల్లాలో చెరుకు కొట్టడానికి కూలీలు వలస వస్తున్నరు.

ఎక్కడ చూసినా చెరువుల కళకళలు, పచ్చని పైర్లే కనిపిస్తున్నయి. చెరువులు నిండడంతో బోర్లలో భూగర్భజలాలు కూడా బాగా పెరిగినయి. భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఫిబ్రవరి 2017లో భూమికి 15.29, 15.51 మీటర్ల దిగువన భూగర్భ జలాలు ఉండగా వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 9.22, 9.56 మీటర్ల దిగువన భూగర్భ జలాలు ఉన్నట్లు నిర్ధారించారు.

గతంలో ఒక ఎకరం కూడా సాగు చేయడానికి ఇబ్బంది పడే రైతులు ఇప్పుడు నాలుగైదు ఎకరాల్లో వేరుశనగ వంటి పంటలను పండిస్తున్నరు. పశు సంపదకు కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. పక్షులు, గొర్లు, మేకలు, పాడి పశువులకు తాగడానికి నీళ్లు దొరుకుతున్నయి. చెరువుల దగ్గర ఈత కొట్టే చిన్నారుల సందడి కనిపిస్తున్నది. పాలమూరులో ఇంతకు ముందు లాగ భూములు అమ్మడానికి రైతులు ఇష్టపడడం లేదు. తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల తమ భూఆస్థుల విలువ పెరుగుతున్నదని రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

కొన్ని చెరువులను ఇంకా పెద్ద రిజర్వాయర్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో రైతులు ఇక తమకు మంచి రోజులు వచ్చి నట్లేనని సంతోష పడుతున్నరు. ఒక్క బీమా లిఫ్ట్‌ స్టేజి -2 నుండి 2012 నుండి 2015 వరకు కేవలం ఒక్క టీఎంసీ నీటిని పంపింగ్‌ చేస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ కారణంగా 2016 లోనే ఏడు టిఎంసి ల నీటిని చెరువులు నింపడానికి ఉపయోగించారు. సాగు నీటి కోసం నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనకాడడం లేదు. లిఫ్టుల మోటార్లు, విద్యుత్తు సబ్‌ స్టేషన్లు, కాలువల నిర్మాణం ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. ఇరిగేషన్‌ అధికారులు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నరు. ఇంకా భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా నీరందించడానికి ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. కృష్ణా జలాల్లో ఉన్న వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నది.

Other Updates