trsమ్మం జిల్లా పాలేరు శాసన సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టి.ఆర్‌.ఎస్‌ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించారు.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రి, పాలేరు శాసన సభ్యుడు రాంరెడ్డి వెంకట రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించవలసి వచ్చింది. ఈ నియోజక వర్గంలో మే 16న పోలింగ్‌ జరుగగా, మే 19న ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలను ప్రకటించారు.

రాష్ట్ర మంత్రి, టి.ఆర్‌.ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సుచరితా రెడ్డి పై 45,682 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. మొత్తం 1,71,074 ఓట్లు పోలవగా, తుమ్మల నాగేశ్వర రావుకు 94,940, కాంగ్రెస్‌ అభ్యర్థికి 49,258, సి.పి.ఎం అభ్యర్థి కి 15,538, నోటాకు 2,785 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా వున్న పాలేరు నియోజకవర్గంలో గతంలో ఏ పార్టీకి రాని విధంగా అత్యధిక మెజారిటీతో తుమ్మల నాగేశ్వర రావు విజయం సాధించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదం చేశాయని, పాలేరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని తుమ్మల చెప్పారు.

ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు.

Other Updates