పాస్‌ పోర్టుల జారీలో రాష్ట్రం రికార్డుపోలీస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం వల్ల కేవలం వారం రోజుల్లో పాస్‌పోర్టులు జారీ చేసి, దేశంలో తక్కువ సమయంలో పాస్‌ పోర్టు జారీ చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు రీజినల్‌ పాస్‌ పోర్టు అధికారి అశ్విని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తెలంగాణలో పాస్‌ పోర్టు వెరిఫికేషన్‌ కేవలం మూడు రోజుల్లో పూర్తవుతున్నదని, పూర్తి పారదర్శకంగా జరుగుతున్నదని ప్రకటించిన అశ్విని, ఇందుకోసం చొరవ చూపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

పాస్‌ పోర్టు జారీ అధికారి అశోక్‌ కుమార్‌తో పాటు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఆమె అక్టోబర్‌ 15న కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పాస్‌ పోర్టు సేవలను విస్తరించే విషయంపై చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తోడుగా నిజామాబాద్‌లో కూడా ఉప కేంద్రం పనిచేస్తున్నదని, వచ్చే నెలలో కరీంనగర్‌లో పాస్‌ పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. వరంగల్‌లో కూడా పాస్‌ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దీనికోసం తాను స్వయంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడుతానని వెల్లడించారు.

చదువులు, వ్యాపారాల కోసం అమెరికాతో పాటు అనేక దేశాల్లో తెలంగాణ వారున్నారని, వారి రాకపోకలు, వారి బంధువుల రాకపోకలు కూడా ఇటీవల ఎక్కువయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ నుంచి విదేశాల్లో పర్యాటక యాత్రలు జరిపే వారి సంఖ్య కూడా పెరుగుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రాంతాల నుంచే ఎక్కువగా విదేశాలకు వెళ్లే వారని, కానీ ఇప్పుడు తెలంగాణలోని ప్రతీ మూల నుంచి విదేశాలకు వెళ్తున్నారన్నారు. పిల్లలు విదేశాల్లో ఉంటే వారిని చూడడానికి తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలోనే పోతున్నారన్నారు. వారందరికీ పాస్‌ పోర్టులు సకాలంలో అందించడానికే సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి కోరారు.

పాస్‌ పోర్టు అవసరమైన ప్రతీ ఒక్కరు హైదరాబాద్‌ రావడం కష్టంగా ఉందని, ఎక్కడికక్కడ సేవలు అందించాలన్నారు. పాస్‌ పోర్టు కోసం ఎవరూ రెండు వందల కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయకుండా సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్‌లో సేవా కేంద్రం వల్ల ఆ జిల్లాతో పాటు, పశ్చిమ ఆదిలాబాద్‌ జిల్లాకు సేవలందించడం సులభమవుతుందన్నారు. కరీంనగర్‌లో సేవా కేంద్రం రావడం వల్ల కరీంనగర్‌ జిల్లాతో పాటు తూర్పు ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు ఉపయోగమన్నారు. వరంగల్‌లో సేవా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల వరంగల్‌, ఖమ్మం, కొంత మేర నల్లగొండ జిల్లాలకు మేలు కలుగుతుందన్నారు. హైదరాబాద్‌ నగరంలోని సేవా కేంద్రాలు ఇతర జిల్లాలకు అందుబాటులో ఉంటాయని సిఎం అభిప్రాయపడ్డారు.

Other Updates