అతను పరుగుల సునామి సృష్టించాడు ఒకనాడు. మైదానమేదైనా అతడే బ్యాటింగ్ రారాజు. అంతటి ఆటగాడు ఈ గ్రౌండ్‌ని చూసి ముచ్చటపడ్డాడు. ‘పిచ్’ని చూసి మురిసిపోయాడు. అతడే సునీల్ గవాస్కర్.
ప్రస్తుత ప్రపంచ ప్రసిద్ధ స్పిన్నర్. మ్యాచ్ ఆడిండంటే పదేసుడే. మట్టిమీద పాము లెక్క బాలు తిరిగి వికెట్ పడాలసిందే. ఈ మట్టంటే ప్రాణం. ఇతడి పేరు రవిచంద్రన్ అశ్విన్. ఈ ఇద్దరు క్రికెట్ ప్రముఖులు ఇష్టపడ్డ మనిషిపేరు చంద్రశేఖర్. ఆ ఇష్టానికి కారణం మట్టే. నల్లమట్టితో అద్భుతాలు సృష్టించొచ్చు అని చంద్రశేఖర్ నిరూపించి అందరినీ మెప్పించాడు.
చంద్రశేఖర్ తెలంగాణ మట్టిబిడ్డ. క్రికెట్ అంటే పంచప్రాణాలు. క్రికెట్ అంటే ఎందరో పెద్ద మనుషుల ఆధిపత్యం. ఉత్తరభారతం లాబీని మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. చంద్రశేఖర్ తన, పిచ్ నిర్మాణ నైపుణ్యంతో వాళ్ళను మెప్పించాడు. ఉప్పల్ క్రికెట్ పిచ్‌ని క్రికెట్ ఆటగాళ్ళ స్వర్గంలా మార్చాడు.
ఇరవై ఏండ్లకు పైగా కఠోర శ్రమ. ఆటలో నిలదొక్కుకోవడానికి జీవితం బండిని గుంజడానికి ఏదో ఒక ఉద్యోగం అవసరం చంద్రశేఖరుకి. అపుడు పటాన్‌చెరువులోని ఇక్రిశాట్ ఆలంబనగా నిలిచింది. చంద్రశేఖర్ ఆశయానికి తొలిమెట్టు వేసి గెలిపించింది.
ఇక్రిశాట్‌లో ఉద్యోగంతోపాటు, ఇక్రిశాట్ జట్టుకు క్రికెట్లో ప్రాతినిధ్యం, చంద్రశేఖర్ జీవితంలో గొప్పమలుపు. కొన్నిసార్లు వృత్తి, ప్రవృత్తి మీద ప్రభావం చూపుతుంది. ఇక్రిశాట్ పంటల పరిశోధనా కేంద్రం, మట్టితోనే ఆ సంస్థ అనుబంధం. పల్లికాయలమీద పరిశోధనలు చేయడంవల్ల చంద్రశేఖర్‌కి ఏ మట్టి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిసింది.
ఇక్రిశాట్ చంద్రశేఖర్‌ని ఒక పచ్చటిమొక్కను చేసింది.
తన అసలైన రంగం క్రికెట్ అనుకొని ఇక్రిశాట్‌ని వదిలిన ఈ మొక్క క్రికెట్ మట్టిమీద వృక్షమై నిలిచింది.
చంద్రశేఖర్ పుట్టింది పూర్వపు మెదక్ జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం, తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి నాగమణి. చిన్నప్పుడే తల్లిదండ్రులు హైదరాబాద్‌కి తరలి వెళ్లడంతో చంద్రశేఖర్ చదువు సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో అటు తర్వాత గ్రాడ్యుయేషన్ పీజీ కాలేజీలో సాగింది.
అది 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రగులుతున్న రోజులు. తనలోని ఉరకలేస్తున్న రక్తంతోని ముందుకు ఉరికిండు. జై తెలంగాణ నినాదాలు చేసిండు. పోలీసులు అరెస్టు కూడా చేసిండ్రు. అలా కసితోని చదివిండు. క్రికెట్‌మీద అంకితభావంతోని ఆటలోనే మమేకమైండు. అలా అంచెలంచెలుగా ఎదిగిండు. ఇక్కడే చంద్రశేఖర్ నైపుణ్యం, క్రికెట్ పట్ల ఉన్న అపార అభిమానం మనకు కనబడతాయి.
శివలాల్ యాదవ్ ప్రోత్సాహంతో జింఖానా మైదానం పిచ్ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
మెదక్ జిల్లాలోని తూప్రాన్ ప్రాంతంలోని నల్ల మన్ను తెచ్చి ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం పిచ్‌ని తయారుచేసి క్రికెట్ దిగ్గజాలతో వహ్వా అనిపించి, మూడుసార్లు ఐపీఎల్ బెస్ట్ క్యూరేటర్‌గా అవార్డు పొందడం ఆయన క్రికెట్ ప్రయాణంలో గొప్ప గెలుపు.
గత 5 సంవత్సరాలుగా గోవా రాష్ట్రంలో వాడుతున్న పిచ్ మట్టి, కేరళలో వాడుతున్న మట్టి మెదక్‌జిల్లా తూఫ్రాన్‌దే.
చంద్రశేఖర్ 1976-96 వరకు 20 సంవత్సరాలు ఇక్రిశాట్‌లో పని చేయడమేకాకుండా ఇక్రిశాట్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ధ్రువీకరించిన సీనియర్ క్యూరేటర్ కూడా.
క్రికెట్ ఆట గెలుపోటములు పిచ్‌ని బట్టే ఉంటా యి. పిచ్ బాగాలేకపోతే తయారుచేసిన వాళ్ళను అభిమానులు దూషిస్తారు. ఇటువంటి సందర్భాలు తన క్రికెట్ జీవితంలో తక్కువంటాడు చంద్రశేఖర్. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో ఇండియా ఓటములకంటే గెలిచినవే ఎక్కువ.
ప్రస్తుతం చంద్రశేఖర్ సిద్ధిపేట క్రికెట్ స్టేడియం పిచ్ పనులు పూర్తి చేశారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి 31 జిల్లాల్లో పిచ్‌లను తయారుచేసి, తెలంగాణ నలుమూలలా క్రికెట్ ఆటగాళ్లను తయారుచేసి భారత జట్టులో అడేవిధంగా, కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెపుతున్నాడు వై.ఎల్.చంద్రశేఖర్.
వేముగంటి మురళీకృష్ణ