డాక్టర్‌ వి.వి.రామారావు,


పి.వి. సాహిత్యాన్నంతా ప్రక్రియతో సంబంధం లేకుండా, ఒక రాశిగా చేర్చినప్పుడు, సమున్నతంగా నిలిచి, సాహితీ విలువలతో భాసించిన విశిష్ట, విక్షణ రచన – ‘‘సహస్ర ఫణ్‌.’’ ఇది, కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ విరచిత ‘వేయిపడగలు’ బృహన్నవలకు, పి.వి. హిందీలో చేసిన అపురూప అనుసృజన.

హిందీలో నవలను ‘‘ఉపన్యాస్‌’’ అని అంటారు. హిందీ ఉపన్యాస సాహిత్యంలో ‘సహస్ర ఫణ్‌’ అగ్రశ్రేణి రచనగా పరిగణింపబడి యావద్భారతంలో హిందీ సాహిత్యాభిమానులను ఎంతో అలరించి, ‘క్లాసిక్‌’గా గుర్తింపు పొందింది. ఈ రచనకు పి.వి. 1972లో ‘కేంద్ర హిందీ నిర్దేశాయం’ వారి ఉత్తమ అనువాద రచయిత పురస్కారాన్ని అందుకొన్నారు. పి.వి, హిందీ భాషేతర వ్యక్తయినప్పటికి, హిందీ రాష్ట్రాలలో సాహితీ విజయకేతనం ఎగురవేయడం, వారి ప్రతిభా పాటవానికి నిదర్శనం. అంతేకాదు, సహస్ర ఫణ్‌‌ రచన ద్వారా, విశ్వనాథ వారి సారస్వత వైభవాన్ని, వేయిపడగలు నవల వైశిష్ట్యాన్ని, మొత్తం భారత దేశానికి పరిచయం చేసి, వారికి జాతీయ స్థాయి గుర్తింపు కలిగేట్లు చేసిన ‘కృషీవలుడు’, పి.వి.

పి.వి., వేయిపడగలు నవలను అనువదించడానికి మౌలిక కారణం, వారికి, విశ్వనాథ సాహిత్యం పట్ల గల అభిమానం, రాష్ట్ర భాష హిందీ పట్ల గౌరవం. అయితే, వీటిని మించిన మరో ప్రధాన హేతువు, భారతీయ సంస్కృతీ విలువల పట్ల తపన! 19వ శతాబ్దిలో భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా దేశీయ విలువల పై దాడి చేస్తున్న పాశ్చాత్య సంస్కృతిని, ప్రత్యేకించి బ్రిటిష్‌ వారి సామ్రాజ్యవాద దురహంకారంపై విశ్వనాథ వారు సాగించిన సాహితీ సమరం, పి.వి.ని కార్యోన్ముఖుడిని చేసింది.

వేయిపడగలు నవల గొప్పతనం గురించి, యీ నవల సాధించదలచిన ప్రయోజనం గురించి, విశ్వనాథ వారి వ్యక్తిత్వం గురించి, పి.వి, ‘సహస్ర ఫణ్‌‌’కు రాసిన పీఠికలో ప్రస్తావించారు. ఇందులో తన అనువాద పటిమ కన్న విశ్వనాథ వారి సాహిత్య గరిమే ప్రధానంగా పేర్కొన్నారు. విశ్వనాథ వారి జాతీయ దృక్పథాన్ని దేశీయతా భూమికపై, వ్యవస్థాగత ధర్మాన్ని నిలుపుకోవలసిన అంశాన్ని లోతుగా వివరించారు.

1930వ దశకంలో, తెలుగు నాట ప్రభంజనం సృష్టించిన ‘వేయిపడగలు’ నవల అవతరణే కొన్ని విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. ఈ రచనా కాలం (1934) నాటికి పి.వి. పదమూడు సంవత్సరాల బాలుడు! హైస్కూలు విద్యార్థిగా తెలుగు భాషా మాధుర్యాన్ని మెల్లి మెల్లిగా ఆస్వాదించే దశలో వున్నారు. మరి, విశ్వనాథ వారు, సాహితీ త్రివిక్రమావతారం దాల్చిన త్రిదశుడు! కానీ వ్యక్తిగత జీవితంలో అష్టకష్టాల పాలయ్యారు. ఆస్తి కర్పూరంలా హరించుకు పోయింది. చేస్తున్న లెక్చరర్‌ ఉద్యోగమూ పోయింది. అదే సమయంలో భార్యా వియోగం వారిని అమితంగా క్రుంగదీసింది. దీనికి సమాంతరంగా, సమాజము బ్రిటిష్‌ వారి పాలనా ప్రభావంతో భౌతిక దృష్టిలోకి జారిపోతున్న దుఃస్థితి, విశ్వనాథలో ‘జీవుని వేదనకు’ కారణమైనది.

ఈ నేపథ్యంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1933లో నవలల పోటీని ప్రకటిస్తు, ‘‘భారతీయ సాంసృతిక పునరుజ్జీవన భూమికగా, తెలుగు వారి సామాజిక జీవితం ప్రతిబింబించే విధంగా’’ రచించాలని కథావస్తువులను కూడా సూచించారు.

విశ్వనాథ వారు స్పందించి, ఆశువుగా చెబుతుంటే, ఆయన తమ్ముడు వేంకటేశ్వర్లు, యీ నవలను, కేవలం 29 రోజులో దాదాపు వేయిపుటలో రాసి, పోటీకి పంపించారు. 1935లో న్యాయ నిర్ణేతలు, ‘వేయిపడగలు’తో బాటు, అడవి బాపిరాజు రచించిన ‘నారాయణరావు’ నవలను కూడా ఎంపిక చేసి, ప్రథమ బహుమతిని ఇద్దరికి సమానంగా అందించారు. 1937-38 మధ్య కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ‘వేయిపడగలు’ నవలను ధారావాహికగా ప్రచురించింది. మల్లాది, చింతాదీక్షితులు ప్రభృతులు విశ్వనాథ సాహిత్యాన్ని విశ్లేషిస్తు విశేష వ్యాసాలు రాయసాగారు.

1939లో ‘వేయిపడగలు’ పుస్తక రూపంలో వచ్చింది. అప్పటికి పి.వి, నాగపూర్‌ లో ఇంటర్‌ విద్యార్థిగా ఉన్నారు. 1942 లో ‘వేయిపడగలు’ నవల గురించి, దేవులపల్లి రామానుజరావు తొలిసారిగా హైదరాబాద్‌ నుండి వెలువడిన ‘తెలంగాణ’ దిన పత్రిక లో సమీక్ష చేశారు. ఈ పత్రికను బుక్కపట్నం రామానుజాచార్యులు గారు, మాడపాటి, సురవరం వారి ప్రోత్సాహంతో ప్రారంభించారు. 1942లో పి.వి. పూనాలో డిగ్రీ పూర్తి చేసుకొని నాగపూర్‌ న్యాయ కళాశాలలో చేరారు. దేవులపల్లి రామానుజరావు సైతం, పి.వి.తో బాటు ‘లా’ కోర్సులో సహవిద్యార్థిగా చేరారు. ఆ కాలంలోనే ఆయన పి.వి.కి విశ్వనాథ వారి ‘ఏకవీర, ‘వేయి పడగలు’ నవలను అందించారు. అప్పటికే, పి.వి. మరాఠి భాషలో మంచి ప్రావీణ్యం సాధించి హిందీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేస్తున్నారు. 1946లో అలహాబాద్‌ యునివర్సిటీ నుంచి హిందీ ‘సాహిత్యరత్న’ (ఎం.ఏ) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

హిందీ భాషపై పట్టు సాధించడమే కాదు, హిందీలో ప్రసిద్ధురాలైన మహాదేవి వర్మ కవిత్వం పై, ఛాయావాదం గురించి, పలు హిందీ పత్రికలో విమర్శనాత్మక వ్యాసాలు రాసి, హిందీ సాహితీవేత్త దృష్టిని ఆకట్టుకొన్నారు. స్వామి వివేకానంద రచనలతో పాటు శ్రీ అరబిందో, సర్వేపల్లి ప్రభృతుల తాత్త్వికచింతన గురించి చదివాక, పి.వి., సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయతావాదం, నవ్యసంప్రదాయం, మొదలగు అంశాలపై దృష్టిని కేంద్రీకరించారు. గురుతుల్యుని వంటి గార్లపాటి రాఘవరెడ్డి తరచు విశ్వనాథ వారి సాహితీ ఔన్నత్యం గురించి పి.వి.తో చెబుతుండేవారు.

1952 జనరల్‌ ఎలక్షన్లలో ఓడిపోయాక ఎక్కువగా సాహిత్యంపై మనసును లగ్నం చేశారు పి.వి. 1956 మార్చ్‌ 31, ఎప్రిల్‌ 1 తేదీలో, కరీంనగర్‌లో విశ్వనాథ వారి షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు హాజరైన పి.వి., విశ్వనాథ నవలల్లోని, ఇతివృత్తాన్ని, పాత్ర చిత్రణలో గల లోపాలను, హేతువాద దృష్టితో విమర్శించారు. దాదాపు గంట పాటు సాగిన వారి ప్రసంగం, అందరినీ ఉలిక్కి పడేట్లు చేసింది. ‘‘విశ్వనాథ ఆగ్రహానికి, పి.వి. గురవుతాడేమోనని’’ కొందరు వ్యాఖ్యలు చేశారు. అయితే విశ్వనాథ పరమ శాంతంగానే పి.వి. ప్రస్తావించిన పలు అంశాలకు సమాధానం యిస్తూ, తన రచనల్లోని పాత్ర గురించి, ప్రతీక గురించి, మూలాల గురించి, దేశీయ విలువల గురించి, సోదోహరణంగా వివరించారని, నాటి సభకు హజరైన ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, సుప్రనన్న, మాదిరాజు రంగారావు ప్రభృతులు పలు సందర్భాలో ప్రస్తావించారు.

విశ్వనాథ సాహిత్యోపన్యాసం, పి.వి.ని ఎంతో ప్రభావితం చేసింది. ఆయన సాహిత్యాన్ని మరోకోణంలో చూడటాన్ని అవర్చింది. పాశ్చాత్యసాహిత్య విమర్శనా పద్ధతిలో వివేచించిన, పి.వి.కి, రహస్య కథన సంప్రదాయ మార్గమంటే ఏమిటో అవగతమయినది. ఆ విధంగా ‘వేయిపడగలు’, ‘ఏకవీర’, చెలియలికట్ట, స్వర్గానికి నిచ్చెనలు, మొదలైన నవలను మళ్ళీ మళ్ళీ చదివి, విశ్వనాథ ఆత్మను పట్టుకోగలిగారు.

1956లో విశ్వనాథ వారిని విజయవాడలో కలిసి, వారి రచనలను హిందీలోకి అనువదించడానికి అనుమతిని తీసుకొన్నారు. తొలుత ‘చెలియలి కట్టను’ కొంత భాగం అనువదించారు. అయితే, ‘చెలియలి కట్ట’ లో స్త్రీ పురుష సంబంధాలు, వివాహ వ్యవస్థ గురించే ఉండటంతో, తన ప్రయత్నం విరమించారు. తదుపరి, సమాజానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు ప్రతిఫలించే ‘వేయి పడగలు’ నవల అనువాదానికి పూనుకొని, 14సంవత్సరాల శ్రమించి, 1970లో ‘సహస్ర ఫణ్‌’గా వెలువరించారు.

1956 – 1970 మధ్యకాలంలో పి.వి. రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎంతో ఎదిగారు. న్యాయశాఖ, దేవాదాయశాఖ, విద్యా శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు – అఖిల భారత కాంగ్రెసు పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించారు. 1960ల్లో నెహ్రూ, అనంతరం ఇందిరా గాంధీ విశ్వాసం చూరగొని నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహిత వ్యక్తిగా, క్లిష్ట సమస్యను పరిష్కరించే ‘బృహస్పతి’గా మెప్పు పొందారు. దాంతో ఊపిరి సలపనన్ని బాధ్యతలతో తలమునకలై వున్నప్పటికీ ‘సహస్రఫణ్‌’ సాహితీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. అది పి.వి అకుంఠిత దీక్షకు నిదర్శనం.

‘‘భారతీయ జ్ఞానపీఠ్‌ ప్రకాశన్‌’’ వారు, ‘సహస్ర ఫణ్‌’ నవలను 1971లో ప్రచురించారు. తొలి ముద్రణయిన నాలుగు నెలలోనే ‘సహస్ర ఫణ్‌’ రెండు వేల ప్రతులన్నీ అమ్ముడుపోయి, 1972లో మలి ముద్రణకు నోచుకున్నది 1972 లో ‘కేంద్ర హిందీ నిర్దేశాయ్‌’ వారు, సహస్ర ఫణ్‌ నవలకు గాను, పి.వి.కి ఉత్తమ సాహితీ పురస్కారాన్ని అందించారు. చాలా మంది సహస్ర ఫణ్‌ రచనకుగాను పి.వి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారని, తమ వ్యాసాలో, పుస్తకాలో పేర్కొన్నారు. పేర్కొంటున్నారు. అది సరైనదికాదు. పి.వి. అందుకున్నది హిందీ కేంద్ర నిర్దేశాయ్‌ పురస్కారం మాత్రమే!


విశ్వనాథ వ్యక్తిత్వాన్ని సాహితీ తత్త్వాన్ని, పి.వి. ఎంత గాఢంగా అధ్యయనం చేశారో, ‘సహస్ర ఫణ్‌’ వెలువడిన తదుపరి, వారు పలుచోట్ల చేసిన ప్రసంగాల ద్వారా తెలియ వస్తుంది.

1971 జులై 25న విజయవాడలో, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో విశ్వనాథ వారికి జరిగిన సన్మాన సభలో, విద్యాశాఖామాత్యులుగా వున్న పి.వి, హాజరై ప్రసంగిస్తూ, విశ్వనాథను అభ్యుదయవాదిగా, సోషలిస్టుగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతు ‘‘వేయిపడగలు అత్యుత్తమ గ్రంథమని ఒక ప్రగతివాదిగా నేను అర్థం చేసుకొన్నాను. ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివిన ప్రతివ్యక్తి పైన దాని ప్రభావం కనిపిస్తుంది. ఈతరం వారిలో కొందరు తమకు నచ్చని వారిని ‘ఆర్థడక్స్‌’ అని పిలుస్తున్నారు. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకొండని చెప్పడమే విశ్వనాథలోని ఆర్థడక్సి’’ అని వివరించారు. ‘‘వేయిపడగలు నవలలో హరిజనులకు దేవాలయ ప్రవేశం గురించి ఆకాలం (1930)లోనే విశ్వనాథ చెబుతూ కేవలం పైసా, ఖర్చులేని ప్రవేశమే కాదు వారి ఆర్థికాభివృద్ధికి ఏం చేశారన్నది ముఖ్యమని విశ్వనాథ ప్రశ్నించారని’’ పి.వి. చెప్పారు. ‘‘ఇలా రాజకీయనేతలపై విశ్వనాథ వ్యంగ్యాస్త్రాలు సంధించడం వల్ల వేయిపడగలకు జ్ఞానపీఠ బహుమతి రాలేదని, తరువాత పొరపాటు జరిగిందని గుర్తించి ప్రాయశ్చిత్తంగా వారి రామాయణ క్పవృక్షానికి, ఆ బహుమతి ఇచ్చారని పి.వి తేటతెల్లం చేస్తూ ‘‘నాకు ఇన్స్పిరేషన్‌ వారి రచనలు’’ అని విశ్వనాథను తన సాహితీ పథ నిర్దేశకునిగా భావిస్తూ ప్రసంగాన్ని ముగించారు.
మళ్ళీ 1971 సం॥ లోనే, అగష్టు 29వ తేదీన విజయవాడ, ఆంధ్రఫిలిం ఛాంబర్‌ లో, విశ్వనాథకు జరిగిన మరో సన్మాన సభలో పాల్గొని విశ్వనాథ వారిని ‘‘తెలుగు సాహిత్య రంగంలో వెసిన మహాసంస్థ’’గా అభివర్ణించి, యువ రచయితలు, ‘‘విశ్వనాథ సాహిత్యాన్ని తమ జీవిత పరమావధిగా ఎంచుకొని సమగ్ర రూపంలో పైకి తీసుకురావాలని’’ పిలుపునిచ్చారు. (ఆంధ్రప్రభ 30-8-1971) ఆలనాటి సభలో వేయిపడగలు నవలతో పాటు విశ్వనాథ వ్యక్తిత్వం గురించి, ‘సహస్రఫణ్‌’ అనువాదం గురించి, పి.వి. ఎంతో వినమ్రంగా విన్నవించారు. వారు మాట్లాడుతూ ‘‘వేయిపడగలు నవలలోని నాయకుడు ధర్మారావు, విశ్వనాథ రూపమని అందరూ అంటుంటారు. నేను అలా అనలేను. శ్రీవిశ్వనాథ వారిని శ్రీసుబ్రహ్మణేశ్వరునితో పోల్చాలి. నేను అలాగే పోలుస్తాను. ఆయన సహస్రముఖ తేజో రాశి. యావద్భారతానికి ఆయన రచనలను అందించాలని సవినియంగా కోరుతున్నాను…’ అని విశ్వనాథ వారిని జాతీయ స్థాయిలో నిలబెట్టారు.

‘‘విశ్వనాథ, ఒక తరానికి ఒక సంస్థకు గాని, కూటమికి గాని చెందినవాడు కాడని, ఆయన అన్ని కాలాల వాడని, ఆయన ప్రపంచానికి ఇస్తున్న విభూతిని ప్రతి ఒక్కరు సవిమర్శగా అర్థం చేసుకోవాలని,’’ వివరించారు.

‘‘విశ్వనాథ సాహిత్యసేవ ఎడతెగకుండా పారే జీవనది వంటిది… ఓ మహాస్రవంతి … దివ్యంగా ధారావాహికంగా ప్రవహించే పరమ పావనమైన జాహ్నవి.. ఎక్కడ దోసిలి పట్టి నీళ్ళు త్రాగినా త్రాగవచ్చు’’ అని విశ్వనాథ సాహితీ మూల్యాలను విశ్లేషిస్తూ, యీ కారణాలవలన, తాను ‘సహస్రఫణ్‌’ అనువాదానికి పూనుకొన్నానని పరోక్షానుభూతిలో విన్నవించారు.

‘‘నేను ఏదో ఆయన రచన పట్ల కృషి చేశాను. అయితే అన్ని భాషల్లోకీ, ఆయన రచనలు తర్జుమా కావాలి. భారతీయా ఆత్మ ఒక్కటే అయినా, భాషలు మాత్రం అడ్డుగోడలుగా నిల్చి
ఉన్నాయి. పక్క రాష్ట్రాల వారు ఏంచేస్తున్నారో తెలియకుండా ఉంది. పొరుగు రాష్ట్రాల వారూ, మనం.. ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిని అవలంబించాలి. ఈ పద్ధతిలో శ్రీ విశ్వనాథ రచనలను మనం వారికి అందించాలి… రచనా వైవిధ్యం ఆయనలో మిక్కుటం. ఎందుకూ పనికి రాని స్థితిలో మమ్ములను ఆయన చేరదీసి సాహిత్యాన్ని ఎరుక పరిచారు’’ (ఆంధ్రప్రభ-30-8-1971) అని ఎంతో ఉద్వేగంతో ‘సహస్ర ఫణ్‌’ అనువాద నేపథ్యాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు.

సహస్ర ఫణ్‌ అనువాద కార్యంలో, పి.వి.కి ఎన్నో అంతరాయాలు కలిగాయి. రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లకు గురి అయ్యారు. అయితే మొత్తం అనువాదరీతి మీద వాటి ప్రభావం పడకపోవటం గమనించ వలసిన అంశం. నిరంతరాయంగా, అవిచ్ఛిన్నంగా, ఒకే క్రమంలో అనువదించుకొంటూ పోయిన గ్రంథంగానే ‘సహస్ర ఫణ్‌‌’ రూపొందింది.

స్వంతంగా ఉత్తమ నవలను రచించటం వేరు. ఒక  ఉత్తమమయిన నవలను మరొక భాషలోకి అనువదించటం వేరు. మూల రచనా భాష, అనువాదకుని మాతృ భాష ఒకటే కావటం ‘అనువాద్యభాష’ మరొకటి కావటం మరింత కష్టతరమయిన ఇబ్బంది. ఈ ఇబ్బంది తోలగాలంటే, అనువాద్యభాష కూడా అనువాదకునికి స్వంతభాషగా అలవాటులో ఉండటం అవసరం. పి.వి. ఉభయ భాషాధురీణుడై వుండటం వల్ల ‘సహస్ర ఫణ్‌’ స్వతంత్ర నవలగానే భాసించిందని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ఆచార్య కోవె సంపత్‌కుమారాచార్య విశ్లేషించారు.

సాధారణంగా అనువాద రచయితలు తమ ముందు మాటలో, అనువాద సమస్యలు, తదితర అంశాల గురించి వెల్లడిస్తుంటారు. ఒక్కోసారి యిది స్వోత్కర్షగా కూడా ధ్వనిస్తుంది. పి.వి. ‘సహస్ర ఫణ్‌‌’కు రాసిన ముందుమాటలో, ఎక్కడా తన గురించి, ప్రస్తావించుకోలేదు. విశ్వనాథ వారి సాహితీ తత్త్వం, వ్యక్తిత్వం, వేయిపడగల వైశిష్ట్యం గురించే విశ్లేషించారు. పి.వి చేసిన విశ్లేషణ, ‘పీఠిక’లా లేదు. ‘వేయిపడగలు’ నవలపై విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి (థీసిస్‌) సంగ్రహ పత్రం (సినాప్సిస్‌) వలె ఉన్నది.

సహస్ర ఫణ్‌ పీఠికలో విశ్వనాథ వారిని ఇరవయ్యో శతాబ్దపు భారతీయ సాహిత్యకారులో మూర్ధన్యుగా అభివర్ణించారు పి.వి. విశ్వనాథ వ్యక్తిత్వము అపూర్వమైనదని, వారి సాహిత్యము అద్వితీయమైనదని, భారతీయ సంస్కృతిని మూచ్ఛేదం చేస్తున్న ఆంగ్లేయుల, సాంస్కృతిక, సామ్రాజ్య దాడిని ఎదుర్కొనడానికే విశ్వనాథ ‘వేయిపడగలు’ రచించాడని సప్రమాణంగా పేర్కొన్నారు.

కేవలం బ్రిటీష్‌ వారి దురాక్రమణనే ఖండిరచడం కాకుండా భారతీయ తాత్త్విక చింతన, జీవనదర్శనం గురించి విశ్వనాథ చర్చించారని పి.వి. రాశారు. కొత్తగా వచ్చే విలువలు ఎలాంటి తప్పుత్రోవలు పట్టిస్తున్నాయి? వీటి క్ష్యమేమిటి? అసలు భారతీయ విలువలకు, పాశ్చాత్య విలువలకు మధ్యగల సంఘర్షణ ఏమిటి? మొదలగు అంశాలను తార్కికంగా చెప్పడానికే, విశ్వనాథ ‘వేయిపడగలు’ రచించారని పి.వి.పేర్కొన్నారు.
‘వేయిపడగలు’ నవలలోని పాత్ర గురించి పి.వి. వివరిస్తూ, అందులోని పాత్రలన్నీ సమాజంలో గల విభిన్న మానవ ప్రవృత్తులకు ప్రతీకని తెలుపుతూ, సహస్రఫణ్‌ (వేయిపడగలు)లో ప్రతినాయకుడే లేడని, ప్రతి నాయకత్వమనేది, ఒక దృక్పథానికి యివ్వబడిరదని, ఆ దృక్పథమే పర ధర్మమని తేల్చారు. ఇందులో స్వధర్మ, పర ధర్మము సంఘర్షణే నిరూపితమైనదని వివరించారు పి.వి.

‘వేయిపడగలు’ నవలను క్లాసిక్‌గా వర్ణిస్తూ, ఫ్రెంచి సాహిత్యంలో వెలువడిన ప్రసిద్ధ రచన ‘జీన్‌ క్రిస్టోఫి’ నవలతో పోల్చారు. రోమైన్‌ రోలాండ్‌ అను ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత, రాసిన పది సంపుటాల బృహన్నవల జీన్‌ క్రిష్టోఫి (Jean Christophi)కి గాను 1915లో నోబుల్‌ బహుమతి లభించింది. అంతటి ఉత్కృష్టమైనది, ‘‘వేయిపడగలు’’ అని ప్రశంసించారు పి.వి.

వేయిపడగలు నవలలోని భాష, వర్ణను అద్భుతముని ‘‘వీటిని చదివితే చాలు, ఇప్పుడిప్పుడే కలం పట్టే వారు సైతం కవులు, పండితులు కావచ్చునని’’ – పి.వి. అభిప్రాయ పడినారు.

చివరిగా, ‘‘వేయిపడగలు’’ను అనువదించుట, తన అదృష్టమని, ‘‘ఈ విధంగా హిందీ సాహిత్యలోకానికి అందించే భాగ్యం ప్రాప్తించిందని’’ నిజానికి, యిదొక సాహసమేనని పి.వి. పేర్కొన్నారు. తన అనువాద రీతిని పి.వి ఇలా తెలియజేశారు.

‘‘ఈ గ్రంథమును హిందీలోకి అనువదించుట నా భాగ్యమనవయును. ఇది చాలా సాహసమైన కార్యము. కానీ నేను వినయముతో, సహృదయతతో, దీనికి దీక్ష బూనితిని. మూలము నతిక్రమించలేదు. కొన్ని తెలుగు జాతీయములన్నీ హిందీలో ప్రవేశపెట్టితిని. నేను ఇందులో కొత్తవి కలుపలేదు. ఉన్నవి తీసివేయలేదు. ఇది సంక్షిప్త రచన. మూల గ్రంథములో సుమారు మూడవ భాగము గ్రంథకర్త అంగీకారముతో తగ్గించుట జరిగింది. ఆ వదలి పెట్టబడిన భాగములో కల్పనలు, రసవద్ఘట్టము చాలా కలవు. అయినను ఈ సంక్షిప్తమైన హిందీ పాఠములో సమగ్రతకు లోపము రాలేదు. ఇంత వివరించినను నా అనువాదము నిర్దుష్టముగా నున్నదన్న సాహసోక్తికి నేను పాల్పడను… ఆ నిర్ణయము చేయవలసినది పాఠకులు. ఇందున్న గుణము మూలములోనివి. దోషములు అనువాదము చేయుటలో సంక్రమించినవి అనియే నావిజ్ఞప్తి!’’ – అని పి.వి. ఎంతో వినయముగా తెలియజేశారు.

‘సహస్ర ఫణ్‌‌’ హిందీ సాహితీలోకాన్ని విశేషంగా అలరించింది. 1972లో ‘కాదంబిని,’ ‘పాంచజన్య్‌’ ‘సరితా’ మొదలగు హిందీ సాహిత్య పత్రికలో, యీ నవల గురించి విస్తృతంగా సమీక్షలు వెలువడ్డాయి.

‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో సూర్యుడి వలె ప్రకాశించిన కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవలను అనువదించి తెలుగు వారి గొప్పదనాన్ని, హిందీ ద్వారా సమస్త భారత దేశంలో పరివ్యాప్తం చేసిన పి.వి. తెలుగువారి అభినందనకు పాత్రులు’’ అని ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త భీమ్‌సేన్‌ నిర్మల్‌, ఒక చోట (ప్రతిభా వైజయంతి 2002 – పుట. 81) వ్యాఖ్యానించారు.

‘సహస్ర ఫణ్‌’ చదివిన ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి ఇందిరా ధనరాజగిర్‌ – ‘‘ఆది శంకరాచార్య, విద్యారణ్య, వివేకానంద, వారి, వారి కాలంలో ఏ ఉపకారం లోకానికి చేశారో, అదే ఉపకారము విశ్వనాథ తన కాలంలో చేశాడని, పి.వి. తెలియజేయడం ముదావహమని (రస రాజధాని – కోవె సుప్రసన్న. పుట 99) పేర్కొన్నారు.

‘సహస్ర ఫణ్‌’ సాహితీ సౌధానికి, పి.వి. రాసిన ‘ప్రవేశిక’ సింహద్వారం వంటిది. అందులో ప్రవేశించిన వారికి, భారతీయ సంస్కృతి, విలువలు, తాత్త్విక చింతన, ఆధ్యాత్మిక భావన సమాజాన్ని సువ్యవస్థితంగా ఉంచడానికి ఉద్దేశించిన ధర్మం, సహస్రముఖీనంగా దర్శనమిస్తుంది. సహృదయ పాఠకులు సంస్కారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ఒక విధంగా, పి.వి.ని, సాహితీ మేరు శిఖరంగా చూపింది, సహస్ర ఫణ్‌ !

‘‘ఈ నవల హిందీలో ఎలా ఉందని’’? విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ జర్నలిస్ట్‌, జి.కృష్ణను అడిగారు.

‘‘మీరు ఏమీ అనుకోక పోతే ఒక మాట చెబుతాను .. పి.వి. నరసింహరావు అనే రచయితే ముందు ‘సహస్ర ఫణ్‌’ నవలను రాయగా, దానిని విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో అనువదించారని, చెప్పుకుంటున్నారని” జి. కృష్ణ చెప్పగానే విశ్వనాథ ఎంతో వుప్పొంగి పోయారు.

విశ్వనాథ వారి మెప్పును పొందిన ‘సహస్ర ఫణ్‌’ విశ్వజనీనమైన ఇతిహాసంగా ఖ్యాతి గడించింది. హిందీ సాహితీవేత్తలు, పి.వి ని హిందీ భాషేతర వ్యక్తిగా కాకుండా, తమలో ఒకరిగా చేర్చుకున్నారు. పి.వి.కి ‘సాహిత్యరత్న’ అందించిన అలహాబాద్‌ యూనివర్సిటి, పి.వి.ని 1975లో సముచితంగా సత్కరించింది.

‘సహస్రఫణ్‌’ పి.వి. అనువాద ప్రజ్ఞకు, హిందీ ‘ఉపన్యాస’ నిర్మాణ ఉపజ్ఞకు నిదర్శనంగా నిలిచింది. ‘సహస్రఫణ్‌’కు పి.వి రాసిన ముందు మాట, విశ్వనాథ వారి సాహితీ వ్యక్తిత్వానికి, మొత్తం ప్రపంచానికే వివరించడానికి వేసిన పూబాట లాగా పరిమళించింది.

Other Updates